Friday, May 17, 2024

నేటి సంపాద‌కీయం – మన పంథాయే మంచిది!

ఉక్రెయిన్‌ యుద్ధంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌లో భారత్‌ గైర్‌హాజర్‌ కావడాన్ని విమర్శిస్తున్న వారికి విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఘాటైన సమాధాన మిచ్చారు. ఈ ఓటింగ్‌లో భారత్‌ పాల్గొనకపోవడం పట్ల ఇటు రష్యా, అటు ఉక్రెయిన్‌ రెండూ భారత వైఖరిని అర్థం చేసుకున్నాయి. అభినందించాయి. నిజానికి ఇలాంటి క్లిష్ట సమయాల్లో దౌత్య సంబంధాలను కాపాడుకోవడం ముళ్ళ కంచెపై నడకలాంటిది. ఈ యుద్ధం వల్ల భారత్‌కి ప్రత్యేకంగా ఒరిగేది లేదు. సరికదా తీవ్ర నష్టాలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే, ఇలాంటి కష్టనష్టాలు ప్రపంచంలో అన్ని దేశాలకూ ఉంటాయి. అవి అనివార్యమైనవి అయినప్పటికీ, నష్టాలను సాధ్యమై నంతవరకూ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూ కూర్చోవడం వల్ల కాలహరణం తప్ప వచ్చే ప్రయోజనం ఏమీఉండదు. రష్యాతోమన మైత్రి కాలపరీక్షలకు నిలిచింది. అమెరికాతో పరోక్ష యుద్ధంలో రష్యా పాల్గొన్నప్పటికీ, మన దేశంతోమైత్రి విషయంలో దాని ప్రభావం ఎన్నడూ పడలేదు. ఇలాంటి సంక్లిష్ట స్థితులను ఎదుర్కోవల్సి ఉంటుందనే తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అలీన విధానానికి మొగ్గు చూపారు. అలీన విధానం భారత్‌కి ఎంతోపేరు తెచ్చింది.

అమెరికా, రష్యాలలో దేనివైపూ మొగ్గుచూ పకుండా తటస్థంగా వ్యవహరించడమే అలీన విధానం. అయితే, అలీన విధానం అమలులో ఉండటం వల్లే ఆరోజుల్లో అమెరికా నుంచి గోధుమలు, ఇతర నిత్యావసరాలను, రష్యా నుంచిఆయుధ సామగ్రిని మన దేశం దిగుమతి చేసుకోగలిగింది. ఏదో ఒక కూటమి వైపు మొగ్గు చూపి ఉంటే మన ప్రయోజనాలు నెరవేరేవి కావు. అలీన విధానాన్ని ఆరోజులో హేళన చేసినవారి లో దేశాధినేతలు కూడాఉన్నారు సంక్షుభిత ప్రపంచానికీ శాంతి కిరణాలు భారత్‌ నుంచే ప్రసారమ య్యాయని ప్రధాని నెహ్రూ చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గౌతమ బుద్ధుడు, వివేకానందుడు వంటి మహనీయుల సూక్తులనూ, ఉపన్యాసా లను ఉదహరించారు. అదే మాదిరిగా.. ఆనాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు భారత దేశం విశ్వశాంతిని ఆకాంక్షిస్తోందనీ, అలీన విధానంమానవ జాతి రక్షణకు పెట్టని కోట వంటిదని ఆమెస్పష్టం చేశారు. ఇందిరాగాంధీతో వాదించి ప్రయోజనం లేదనుకుని నిక్సన్‌ తమ సంభాషణను పొడిగించలేదట. వివేకానందుడు చికాగోలో సర్వమత సమ్మేళనంలో చేసిన ప్రసంగం నాటికీ, ఏనాటికీ విశ్వశాంతికి దారి చూపే దిక్సూచి వంటిది. శాంతి, సహనం, సామరస్యం వ్యక్తుల మధ్యే కాదు, వ్యవస్థలు, దేశాల మధ్య అవసరమని ఇలాంటి సందర్భాల్లో అందరికీ గుర్తుకు వస్తుంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆధిపత్య ధోరణే కారణమన్న విషయ స్పష్టం అవుతుంది.

ఉక్రెయిన్‌పై పెత్తనం చెలాయించేందుకు రష్యా ప్రయత్నించడమే ఈ దాడికి మూల కారణం. ప్రచ్చన్న యుద్ధానికి కూడా ఇదే కారణం. అప్పట్లో ఆధిపత్య ధోరణిని ప్రదర్శించిన అమెరికా వైఖరిలో ఈ యుద్ద సమయంలోఎంతో మార్పు కనిపిస్తోంది. ఇతర దేశాల మధ్య తగువుల్లో తలదూర్చడం వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుందని అమెరికా అనుభవ పూర్వకంగా తెలుసుకుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జోబిడెన్‌ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి సంకీర్ణ సేనలను ఉపసంహరించారు. ఆయన కన్నా ఒక టరమ్‌ ముందు ఆ పదవిని నిర్వహించిన బరాక్‌ ఒబామా అఫ్గాన్‌ నుంచి సంకీర్ణ సేనల ఉపసంహరణకు ఎంతోప్రయత్నించారు. కానీ, ఫలించలేదు. ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్‌ ఉపాధ్యక్షుని గా పాలనానుభవంతో పాటు పరిణతిని సాధించిన నేతగా ఆనాటి నిర్ణయాన్ని అమలు జేశారు. అలా చేయడం వల్ల స్వదేశంలో ఆయన విమర్శలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. రష్యా ఉక్రెయిన్‌పై చేసిన దాడి వల్ల సాధించిందేమిటో దేశాధ్యక్షుడుపుతిన్‌ చెప్పలేరు. రష్యాసేనలు వందల సంఖ్యలో మర ణించారు. ఒక ఆర్మీజనరల్‌ కూడా ప్రాణాన్ని కోల్పోయారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెనెస్కీ తమ దేశ పౌరుల గుండెధైర్యాన్ని అభినందిస్తూ దేశ పునర్నిర్మాణంలో కూడా ఇదే అంకిత భావంతోపని చేయాలని పిలుపు ఇచ్చారు. అలాగే, రష్యా నుంచి నష్టం పరిహారాన్నీ అంతకు అంత రాబడతామని ప్రతిన చేశారు. ప్రతినలూ, పరిహారాల సంగతి అలా ఉంచితే అమాయాకుల ప్రాణాలను తిరిగి ఎవరూతీసుకుని రాలేరు. ఈ ఇంగితాన్ని గుర్తు చేసుకుంటే యుద్ధాలను నివారించడం సాధ్యమవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement