Wednesday, May 1, 2024

కాబోయే సీజేఐ తొలి భాష్యం..

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, అమృతోత్సవాల సందర్భంగా భారత జాతీయ పతాకానికి దేశ వ్యాప్తంగా లభిస్తున్న గౌరవాన్ని చూసి భరత మాత సంతోషంతో పొంగిపోతోంది. అదే సందర్భంలో దేశంలో రాజ్యాంగ సంస్థలనూ, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారినీ సమాజంలో కొన్ని వర్గాలు అవహేళన చేసి మాట్లాడటం పట్ల ఖిన్నురాలు అవుతోంది. ఇవి ఎవరి మాటలో కాదు, ఈనెల 27వ తేదీన భారత సర్వోన్నత న్యాయస్థానంప్రధాన న్యాయ మూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్‌ యుయు లలిత్‌ ఆవేదన. రాజ్యాంగం నాలుగు స్తంభాల్లో సుప్రీంకోర్టు ఒకటని చిన్నప్పుడు చదువుకోవడమే కాదు, సమయం వచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు ఘన చరిత్రను తెలుసుకుంటూనేఉన్నాం. ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా మన దేశంలో సుప్రీంకోర్టుఅత్యున్నతమైన స్థానంలో ఉంది. ఇతర దేశాల్లో సుప్రీంకోర్టు ఆయా దేశాల పాలకుల ముఖ్యంగా సైనిక పాలకుల ఆంక్షలతో పని చేస్తోంది. ఇందుకు మన దేశంలో ఒకప్పుడు అంతర్భాగంగా ఉండి ఇప్పుడు స్వతంత్ర దేశాలుగా కొనసాగుతున్న పాక్‌, బంగ్లాదేశ్‌లలోనూ, తాజాగా శ్రీలంకలోనూ నెలకొన్న పరిస్థితులు ఉదాహరణ.పాకిస్తాన్‌లో జనరల్‌ ముషా ర్రఫ్‌ దేశాధ్యక్షునిగా కొనసాగిన సమయంలో అక్కడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇఫ్త్తికార్‌ చౌదరిని ఎంత అవమానించారో మనందరికీ తెలుసు. అలాగే, బంగ్లాదేశ్‌ ప్రధాన న్యాయమూర్తి కూడా అవమానాల పాలయ్యారు.

మన దేశంలో అటువంటి పరిస్థితి రాలేదు కానీ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న విమర్శలు, వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. జస్టిస్‌ యుయు లలిత్‌ ఒక జాతీయ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోఇదే ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో సుప్రీంకోర్టు నుంచి సబార్డినేట్‌ కోర్టు వరకూ న్యాయమూర్తులంటే జనానికి అమితమైన గౌరవం ఉంది. వారి తీర్పుల పట్ల కూడ అలాంటి గౌరవం ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో కొందరు తమకు అనుకూలంగా తీర్పురాలేదని న్యాయ మూర్తులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. జార్ఖండ్‌ ధన్‌బాద్‌ జిల్లా కోర్టుకు సమీపంలో నడిచి వెడుతున్న ఒక న్యాయమూర్తిని ఆటో ఢీకొట్టింది. అది ప్రమాదమని ముందు అంతా అనుకున్నారు. తర్వాత అసలు సంగతి తెలిసింది. తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని ఇద్దరు వ్యక్తులు ఆటో వ్యక్తితో ముందు మాట్లాడుకుని ఉద్దేశ్య పూర్వకంగానే ఆ న్యాయమూర్తిని ఢీకొట్టినట్టు దర్యాప్తులో తేలింది. అలాగే, పలు చోట్ల న్యాయమూర్తులపై ఆగ్ర హాన్ని వ్యక్తం చేయడానికి నిందితులు చెప్పులు విసిరిన సంఘటనలు కూడాచోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా, నీచంగా పోస్టులు పెట్టడం మరో ఎత్తు. సామాజిక మాధ్యమాలను ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకోవడానికి రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారు.

అలాగే, సినీతారలు, సెలబ్రెటీల పరువు తీయడం కోసం వినియోగించుకుంటున్నారు. ఇటీవల సమాజంలో వ్యాపిస్తున్న విషసంస్కృతి ఇది. దీనిపై సుప్రీంకోర్టుకు కూడా కొందరు వెళ్ళడం జరిగింది. మంత్రులు, ముఖ్యమంత్రులంటే ప్రజల్లోంచి వచ్చిన వారు కనుక, వారితో ఉండే చనువును బట్టి ప్రత్యర్ధులు ఇలాంటి పోస్టులు పెట్టిస్తున్నారనుకుందాం. మరి న్యాయమూర్తుల సంగతి ఏమిటి? వారు ప్రజలతో టచ్‌లో ఉండరు, న్యాయమూర్తులు తీర్పులు, ఉత్తర్వులతోనే మాట్లాడుతారంటూ జస్టిస్‌ లలిత్‌ అన్న మాట ముమ్మాటికీ నిజం. వారు ఎవరితోనూ చనువుగా మాట్లాడరు అంత మాత్రాన గర్వమని కాదు, తమపదవికి ఉన్న హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు నిరంతరం వారు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిపై చనువు తీసుకుని వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. పైగా, న్యాయమూర్తుల్లో దాదాపు అంతా రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకుని తీర్పులు చెబుతారు. ఆ తీర్పులు నచ్చకపోతే విమర్శించవచ్చు. కానీ, తీర్పులిచ్చిన న్యాయమూర్తులను విమర్శించడం, వ్యక్తిగత దూషణకు దిగడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని జస్టిస్‌ లలిత్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగ పరమైన అంశాలపై కూడా టీవీల్లో, బయట చర్చలు జరుగుతాయి. అలాగే, తీర్పుల పైనా జరుగుతాయి. అవి కూడా రాజ్యాంగ పరిధిలోనే జరుగుతాయి. అయితే, ఫలానా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనో న్యాయమూర్తులు ప్రభావితులు కావడం వల్లనే ఇలాంటి తీర్పు వచ్చిందనో వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇవి కూడా హర్షణీయం కాదు. ఫలానా న్యాయమూర్తి ముందుకు కాకుండా వేరే న్యాయమూర్తి వద్దకు తమ కేసువిచారణకు వచ్చేట్టు చూడాలని కోరే హక్కు కక్షిదారులకు ఉంది. అలా కోరుతున్నారు కూడా. అయినప్పటికీ న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడే వారు రాజ్యాంగాన్ని అవమానించినట్టే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement