Wednesday, May 1, 2024

భారత్‌ లౌకికవాదం ఇరాన్‌కు తెలుసు..!

ఇరాన్‌తోమన దేశానికి దశాబ్దాలుగా సత్సంబంధాలు న్నప్పటికీ,బీజేపీ అధికార ప్రతినిధి హోదా నుంచి ఇటీవల తప్పించబడిన నూపుర్‌ శర్మ మహ్మద్‌ ప్రవక్త పై వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై యావత్‌ ఇస్లామిక్‌ ప్రపంచం అట్టుడుకుతున్న వేళ ఇరాన్‌ విదె శాంగ మంత్రి హుస్సేన్‌ అబ్దుల్లా హియోన్‌ మన దేశంలో పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకుని ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చు కోవాలన్న ఆసక్తి కనబర్చడం చెప్పుకోదగిన పరిణామం. మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం అన్ని దేశాల వారినీ ఆకర్షిస్తోందనడానికి ఇది నిదర్శనం. మోడీ అమెరికాతో వ్యూహాత్మిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే, దాని ప్రత్యర్దిదేశాలతో అంతే సమానంగా దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నారు. పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, చైనాలు మన దేశాన్ని ఎంత కవ్విస్తున్నా, సంయమనాన్ని కోల్పోకుండా ఆ రెండు దేశాలతో కూడా స్నేహాన్నే భారత్‌ కోరుకోవడం మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో ఆకర్షణీయమైన అంశం.నూపుర్‌ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలనీ,భారత్‌నుంచి దిగుమ తులు నిలిపివేయాలన్న డిమాండ్లు ఇస్లామిక్‌ దేశాల్లొ హోరెత్తుతున్నతరుణంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్లా హియాన్‌ డాలర్‌తో పని లేకుండా, వస్తు మార్పి డి రూపంలో వాణిజ్య సంబంధాలను వృద్ది చేసు కుందామని మన ప్రధానికి ప్రతిపాదించడం భారత్‌ పట్ల ఇరాన్‌ నమ్మకం, విశ్వసానికి నిదర్శనం.ఇరాన్‌పై ఆంక్షల నేపధ్యంలో ఇరుదేశాల వాణిజ్యం 17 బిలియన్‌ డాలర్ల నుంచి రెండు బిలియన్‌ డాలర్లకు పడిపో యింది. భారత్‌లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సెక్యుల రిజానికి కట్టుబడి ఉంటుందన్న నమ్మకం ఇరాన్‌కి ఉంది కనుకనే,ఇస్లామిక్‌ ప్రపంచంలోమిగిలిన దేశాలంత తీవ్రంగా ఇరాన్‌ మహ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలకు ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు.

ఈ వ్యాఖ్యలు చేసిన వారిపై పార్టీ స్థాయిలో చర్యలు తీసుకున్నట్టు ఇరాన్‌ మంత్రికి మోడీ తెలియజేసినందువల్లనే ఆయన పెద్ద సీరియస్‌గా తీసు కోలేదన్నవార్తలు వచ్చాయి. ఇరాన్‌ వ్యతిరేక కూటమిగా అభివర్ణి తమైన ఇజ్రాయెల్‌-భారత్‌-యూఏఈ-అమెరికా కూటమిలో భారత్‌ చేరడం ఇరాన్‌కి నచ్చని మాటనిజమే అయినా, ఆ కూటమిలో భారత్‌ చేరడానికి గల కారణా లను మోడీ అబ్దుల్లాహియాన్‌కి వివరించారు.ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ రైసీ త్వరలో మన దేశంలో పర్య టించనున్నారు.మహ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌ శర్మ వ్యాఖ్య లు చేసిన మరునాడే ఇరాన్‌ టెహరాన్‌లో మన దౌత్యా ధికారిని పిలిపించి నిరసన తెలిపింది. అయితే, ఇరాన్‌ విదేశాంగ మంత్రి భారత పర్యటనలో ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం.ఇరాన్‌ నుంచి క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులను రెట్టింపు చేయాలన్న ప్రతిపాద నకు ఇరాన్‌ సానుకూలంగా స్పందించింది. డాలర్‌తొ నిమిత్తం లేకుండ రూపాయి- రియల్‌ మారకం ప్రాతి పదిక పై చమురు దిగుమతులు జరగాలన్న ప్రతిపాదనకు ఇరాన్‌ అంగీకరించడం శుభ పరిణామం. రష్యా నుంచి చమురు దిగుమతులకు అక్కడి పరిస్థితులు ప్రతి బంధకంగా తయారు కావడంతో ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు మన అవసరాలకు సరిపడా చమురు లభించేట్టు చేస్తాయి.

అంతేకాకుండా చాబహార్‌ రేవు నిర్మాణంలో భారత్‌ భాగస్వామ్యం కొనసాగాలని ఇరాన్‌ కోరుకుంటోంది.అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల నేపధ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుసంధానమైన విద్యుత్‌ ప్రాజెక్టును చైనాకు అప్పగించేందుకు ఇరాన్‌ ఆలోచన చేసింది. భారత్‌కి వ్యతిరేకంగా చైనా ఇరాన్‌కి నూరి పోయడం వల్ల ఇరాన్‌ ఈ ఆలోచన చేసింది.భారత్‌ అమె రికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉన్నందువల్ల భారత్‌కి ఆ ప్రాజెక్టు ఇవ్వొద్దని చైనా ఒత్తిడి చేసింది. ఇందులో పాకిస్తాన్‌ పాత్ర కూడా ఉంది .చైనా,పాక్‌ల మైత్రి వల్ల ఈ ప్రాంతంలోదేశాలకు మేలు జరగకపోగా, కీడు జరుగుతుందన్న వాస్తవం ఇరాన్‌ గ్రహించింది. చైనా ఒత్తిడి వెనుక దుర్వ్యూహాన్ని ఇరాన్‌ గమనిం చింది. చాబహార్‌ ప్రాజెక్టు మొత్తం నిర్మాణం భారత్‌కే విడిచి పెట్టాలన్నది ఇరాన్‌తాజా ఆలోచన.రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవాలనీ, వెనిజులా, ఇరాన్‌ల నుంచి దిగుమతులు పెంచుకోవాలని అమెరికా సూచి స్తోంది.అమెరికా తన అవసరాల కోసం భారత్‌ వంటి దేశాలకు చమురు దిగుమతుల విషయంలో పెదన్న పాత్ర వహిస్తోంది. డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షునిగా ఉన్న సమ యంలో ఇరాన్‌ నుంచి దిగుమతులను నిలిపి వేయాలని ఆయన హూంకరించారు.అయితే, మన దేశం పూర్తిగా లొంగ కుండా ఇరాన్‌ నుంచి దిగుమతులు కొనసాగించింది.ఈ విషయం ఇరాన్‌ ప్రస్తుత పాలకులకు తెలుసు.అందుకే ,భారత్‌కి గతంలో మాదిరి ముడి చమురు ఎగుమతులు కొనసాగించాలని ఇరాన్‌ నిర్ణయించినట్టు కనిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement