Monday, April 29, 2024

Editorial – సుప్రీం కోర్టు ధ‌ర్మాగ్ర‌హం …

క్షేత్రస్థాయిలో పోలీసుశాఖ పేరు ప్రతిష్టలను నిలబెట్టా ల్సినది కానిస్టేబుల్స్‌ అయితే, రాష్ట్ర స్థాయిలో పోలీసుల కీర్తి చంద్రికలు డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ)పై ఆధారపడి ఉన్నాయి. మన పోలీసు వ్యవస్థ పై మణిపూర్‌ దుర్ఘటన మాయనిమచ్చ వేసింది. ఈ విషయ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆవేదన ద్వారా వ్యక్తమైంది. మణి పూర్‌లో జరిగిన అత్యాచారాల పై ఆ రాష్ట్ర డీజీపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిలదీస్తూ, అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి క్షీణిస్తుండటాన్ని అత్యున్నత న్యాయస్థానం గమనిస్తోందనీ, అయితే, మణిపూర్‌లో పరిస్థితి ఘోరాతిఘోరమైనదిగా పరిగణి స్తున్నామని పేర్కొన్నారు. శాంతిభద్రతల యంత్రాంగం అన్ని రాష్ట్రాల్లో దిగజారిందన్న విమర్శలు వస్తున్న మాట నిజమే కానీ, డీజీపీ స్థాయి ఉన్నతాధికారి తన విధులను సక్రమంగా నిర్వర్తించక పోవడంవల్లనే అక్కడి పరిస్థితి అగ్నిగుండంలా మారిం దని ఆయన మాటల్లో ధ్వనించింది. వచ్చే శుక్రవారం కోర్టులో హాజరు కావాల ని మణిపూర్‌ డీజీపీకి సమన్లు జారీ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఒక రాష్ట్ర పోలీసు విభాగం సర్వోన్నత అధికారికి ఈ మాదిరిగా సమన్ల తరహా ఆదేశాలను జారీ చేయడం చాలా అరుదైన విషయం. అసోంలో విదేశీయు ల సమస్యపై నల్లిలో జరిగిన ఊచకోత సందర్భంగా కూడా ఆనాటి రాష్ట్ర పోలీసు డైరక్టర్‌ జనరల్‌ని సుప్రీం కోర్టు ఇదే మాదిరిగా ఆదేశించింది.

ఈ రెండూ ఈశాన్య రాష్ట్రాలే కావడం గమనార్హం. ఆనాటి పరిస్థితి వేరు. ఇప్పటి మణిపూర్‌ పరిస్థితి వేరు. గడిచిన అర్ధశతాబ్దిలో పోలీసుశాఖపై రాజకీయ ఒత్తిళ్ళు ఎంతగానో పెరిగాయి. ఉన్నతస్థాయి పోలీసు అధికారులంతా ఆలిండియా సర్వీసుకు చెందినవారే కానీ, రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధినేత చెప్పినట్టు నడుచుకోవా లి. బెదిరింపుల వల్ల కొంత, భవిష్యత్‌ప్రయోజనాలను ఆశించి మరికొంత రాష్ట్ర ప్రభుత్వాధినేత ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం చాలా సందర్భాల్లో అనుభవమవుతున్నది. మణిపూర్‌లో పోలీసు ఉన్నతాధి కారులు చేష్టలుడిగినట్టు వ్యవహరించడానికి కారణం అదే. పోలీసు వ్యవస్థపైనే కాదు, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) పైన కూడా ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రమైన ఆక్షేపణ తెలియజేసింది. అంతకుముందు బొగ్గు కుంభకోణంపై విచారణ సందర్భంగా సీబీఐని పంజరంలో చిలుకగా సుప్రీంకోర్టు అభివర్ణించింది.

ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై ఇలాంటి మచ్చ పడటానికి రాజకీయ వర్గాలే కారణం. ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీసులను, దర్యాప్తు సంస్థలను ఉపయోగించు కుంటున్నారు. రాజకీయ నాయకులకు పోలీసు కానిస్టేబు ల్స్‌, ప్రభుత్వోద్యోగులు ఊడిగం చేయడం పట్ల కూడా సుప్రీంకోర్టు ఓ సందర్భంలో ఆక్షేపణ తెలిపింది. పోలీసు లను చూస్తేనే గతంలో ప్రజలు హడలిపోయేవారు. ఇప్పుడు పోలీసుల చేతిలో ఎంతో కొంత పెట్టి తమ పనులు పూర్తి చేసుకోవచ్చనే ధీమా ప్రజల్లో పెరిగింది. పై నుంచి కింది వరకూ పోలీసు వ్యవస్థ ఈ మాదిరిగా తయారు కావడానికి రాజకీయ వ్యవస్థే కారణం. తమ చెప్పుచేతల్లో ఉండని పోలీసు అధికారులను బదిలీల పేరిట వేధించడం కూడా వారి నైతికతను దెబ్బతీస్తు న్నది. మణిపూర్‌పై ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్‌ కావడానికి పోలీసు వ్యవస్థలో పెరిగిన అలసత్వం, ఉదాసీన వైఖరి కారణం. మణిపూర్‌లో అల్లర్లు సృష్టించి న సాయుధ దళాలు యువతులను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంటే పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు తమకు సమాచారం అందిందని ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా ఉటంకించారు.

అలాగే, మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకొలేకపోవడానికి రాజకీయ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణంగా సమాచారం అందింది. మణిపూర్‌లో సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. అక్కడి సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియకూడ దన్న ఉద్దేశ్యంతో సమాచార వ్యాప్తిని అణచివేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు విషయంలో కూడా రాష్ట్ర పోలీసు యంత్రాం గం చేసిన ప్రయత్నాలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై కూడా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

నేరం తీవ్రతను బట్టి ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయాల్సి ఉండగా, మణిపూర్‌లో అందుకుభిన్నంగా జరగడం వల్ల అవి ఎందుకూ కొరగాకుండా పోయాయి. మణిపూ ర్‌ పోలీసుల తప్పులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అంశాల వారీగా ఎత్తి చూపి అంతిమంగా డీజీపీ ని కోర్టుకు హాజరు కావల్సిందిగా ఆదేశించారు. ప్రధాన న్యాయమూర్తి మణిపూర్‌ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వడం దేశంలో పౌరుల హక్కుల పరిరక్షణ పట్ల ఆయనకు గల ఆసక్తిని తెలియజేస్తున్నది. దేశంలో రాజకీయ వ్యవస్థను సక్రమ మార్గంలో పెట్టడానికి న్యాయవ్యవస్థ చేస్తున్న కృషికి ఇలాంటి ఘటనలు ఎన్నో.

Advertisement

తాజా వార్తలు

Advertisement