Thursday, May 2, 2024

Editorial – అమ్మో….. ట‌మోటా….

టమోటా ధరలు వింటే అందరినోటా విన్పించే మాట అమ్మో.. టమోటా! టమోటాలు పేదలనుంచి పెద్దల వరకు ఇష్టమైన కూరగాయ. పేదలకైతే అది నిత్యావస రంగానే చెప్పుకోవాలి. చౌకగా దొరకడం, రుచిగా ఉండ టం, మరో కూరగాయో, పప్పో కలగలపి కాస్త ఆటొచ్చే లా వండుకోవడానికి వీలుగా ఉండటంవల్ల టమోటా లంటే మహాప్రీతి. ఎర్రెర్రగా పండిన టామోటాలను కొంటూ మురిసిపోవడం మామూలే. కానీ ఇప్పుడు టమోటాలు కొనాలంటే అంత సులువేం కాదు. వాటి ధరలు విని, వినియోగదారుడి ముఖం ఎర్రబారుతోంది. కొనలేని స్థాయికి ధర చేరడంతో ఏమీ చేయలేని దుస్థితి అది. ఒకటి రెండు నెలల క్రితం వరకు వంద రూపాయ లకు ఐదారు కిలోల టమోటాలు వచ్చేవి. ఆ తరువాత వాటి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు చుక్కలను తాకుతున్నాయి. టమోటాల కోసం హత్యలు చేయడం, చోరీలకు పాల్పడటం, వాటిని సంరక్షించుకు నేందుకు ఏకంగా బౌన్సర్లను కాపలాగా నియమించు కోవడం, పెళ్లిసారెగా టమోటాలను ఇవ్వడం వంటి అనూహ్య పరిణామాలు ఆశ్చర్యపరుస్తున్నా.. అవి నిజాలే! ‘గుట్టుగా లేత రెమ్మల మధ్య కులికే.. నిన్ను రొట్టె ముక్కల మధ్య పెట్టినారని ఏల విలపించెదవో ఓ టమాటా! ‘ అని అప్పుడెప్పుడో ఓ సినీకవి ఓదార్చాడు. కానీ ఇప్పుడు టమోటాల వినియోగదారులను ఓదార్చా ల్సిన పరిస్తితి. వాతావరణ పరిస్తితుల్లో తేడాలు, రుతు పవనాలు, అకాల వర్షాలు, పంట ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలవల్ల టమోటా ధరలు పెరిగాయని కేంద్రం చెబుతోంది.

నిజానికి దాదాపు అన్ని రాష్ట్రాల్లో టమోటా ల సాగు చేస్తారు. కానీ దేశంలో 60 శాత అవసరాలను ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర తీరుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, ఆదిలాబాద్‌ జిల్లాలు టమోటా సాగుకు పెట్టింది పేరు. మదనపల్లె టమోటా మార్కెట్‌ దక్షిణ భారత్‌లో అతిపెద్దది, ప్రధానమైనదీను. దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలలో వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. రుతుపవనాలకు కొంచెం ముందు అకాల వర్షాలు, తెగుళ్లు పంట ఉత్పత్తిని దెబ్బ తీశాయి. అప్పటివరకు కిలో టమోటాల ధర పది నుంచి 20 రూపాయలుండేది. ఇది మార్కెట్‌ ధర. రైతుకు కిలో ఐదారు రూపాయలు కూడా గిట్టేది కాదు. సాగు ఖర్చు కూడా దక్కలేదన్న బాధతో వారు రోడ్డుపక్కన, చేలల్లో ను పంటను పారబోసిన సందర్భాలు ఈ సీజన్‌లో కన్పించాయి. అకాలవర్షాల నేపథ్యంలో వాటి ధరలు పెరగడం మొదలైంది. సాధారణంగా జనవరిలో అత్యధి కంగా టమోటా సాగు ఉంటుంది. జులై-ఆగస్టు, నవంబ ర్‌ – డిసెంబర్‌లలో కొద్ది విస్తీర్ణంలోనే టమోటా సాగవు తుంది. అందువల్ల వాటికి డిమాండ్‌ పెరిగింది.

టమోటా ఎక్కువగా పండే రాష్ట్రాల నుంచి డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు రవాణా సౌకర్యం, నిల్వ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరి, మొక్కజొన్న సహా ఇతర పంటలకు ఇచ్చిన రీతిలో టమోటాలకు మద్దతు ధర లేదు. అందువల్ల దేశవ్యాప్తం గా వీటి ధర ఒకే రకంగా లేదా నిలకడగా ఉండదు. ఏతావాతా ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కిలోటమోటా వంద రూపాయలు పలుకుతోంది. ఢిల్లిd వంటి మహా నగరాల్లో రూ.120 నుంచి 150 వరకూ ధర ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సబ్సిడీపై కిలో రూ. 50 కే రైతుబజార్లలో అందిస్తోంది. ఈ నేపథ్యంలో టమోటా ధరల సెగ కేంద్రానికి తాకింది. ఆంధ్రప్రదేశ్‌ సహా ఇప్పుడు టమోటా సాగవుతున్న రాష్ట్రాల నుంచి టమోటా పంటను సేకరించి దేశంలోని అన్ని ప్రాంతాల కు రవాణా చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఒకటి రెండువారాల్లో వీటి ధరలు తగ్గుతాయని కేంద్రం భావి స్తోంది. సాధారణంగా మన దేశంలో ఉత్తరాదికి టమాటాలు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్నాటక నుంచే ఎగుమతి అవుతూ ఉంటాయి. టమోటాల ధరలు పెరగడంతో దొంగతనాలు, ఘర్షణలు చోటు చేసుకుంటు న్నాయి. మదనపల్లి వద్ద బుధవారం వాహనంపై వెళ్తు న్న రైతును అడ్డగించి కొందరు దుండగులు హత్య చేశారు. కర్నాటకలో ఒక సూపర్‌ మార్కెట్‌లో బౌన్సర్లను నియమించుకోవల్సి వచ్చింది. ధరల పెరుగుదల ఒక్క టమోటాలకే పరిమితం కాలేదు. పచ్చిమిర్చి కిలో వంద కుపైనే ఉంది.

- Advertisement -

ఇక కందిపప్పు ధర కిలో రూ.180 దాకా ఉంది. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలేమిటో వెతుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కోడిగుడ్లు, మాంసం ధరలు ముందే పెరగ డం వల్ల మాంసాహారులు కూడా కూరగాయలనే విని యోగిస్తున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో పప్పుధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉండక పోవచ్చునని చెబుతున్నారు. ఆకు కూరల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏమీ కొనలేని, తినలేని స్థితిలోసామాన్యులు విలవిలలాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement