Wednesday, May 1, 2024

నేటి సంపాద‌కీయం – సంక్షోభాల శ్రీలంక..

ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయిన పొరుగుదేశా లు ఇప్పుడు రాజకీయ సంక్షోభంలో విలవిలలాడుతున్నాయి. పాకిస్తాన్‌లో మాదిరిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సంకీర్ణ ప్రభుత్వం నుంచి మిత్ర పక్షాలు వైదొలగాయి. ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దేశంలో ఆహారం లేక ప్రజల హాహాకారాలు మిన్నంటు తున్నాయి. ఈపరిస్థితికి ప్రధాని మహిందా రాజపక్స తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అసత్యం లేదు. మహిందా రాజపక్స వి ఏక పక్ష నిర్ణయాలు. అవి కూడా అవివేకమైనవనని రుజువైంది. ప్రస్తుత ఆహార సంక్షోభానికి కారణం సరైన సన్నద్ధత లేకుండానే సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టడం. రైతులను సిద్ధ పర్చిన తర్వాత కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడం తప్పులేదు. కానీ, రైతులు కొత్త పద్ధతులను అనుసరించక పోవడం వల్ల ఆహార సంక్షోభం ఏర్పడింది.

ఇతరదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే వీలు లేకుండా ఖజానా ఏనాడో ఖాళీ అయింది. ఆర్థిక సంక్షోభం ప్రజాగ్రహానికి దారి తీసింది. దాంతో దేశాధ్యక్షుడు గొటబాయ ఆర్థిక మంత్రిగా ఉన్న తన సోదరుడు బాసిల్‌ రాజపక్సను తొలగించి ఆలీ సర్బీని ఆర్థిక మంత్రిగా సోమవారం నియమించారు. ఆయన పదవిని స్వీకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే రాజీనామా చేశారు. మంత్రులపై, ప్రభుత్వం పై ప్రజల ఒత్తిడికి ఇది నిదర్శనం. శ్రీలంక గతంలో లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌టిటిఈ) టైగర్ల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. వాస్తవానికి దేశం ఆర్థికంగా దివాళా తీయడానికి చైనాయే కారణం. మహిందా గతంలో అధికారంలో ఉన్నప్పుడు చైనాతో చేసుకున్న ఒప్పందాలు దేశ ఆర్థిక పరిస్థితి మూలుగులను పీల్చివేశాయి. చైనా అనుసరించిన కాబూలీ పాత్ర వల్లే శ్రీలంక పరిస్థితి దిగజారింది. భారీ ప్రాజెక్టులకు రుణాల పేరుతో శ్రీలంకను ఊబిలోకి చైనా నెట్టేసింది.

దానికితోడు పర్యాటక రంగంపై వచ్చే ఆదాయం గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి కారణంగా పూర్తిగా పడిపోయింది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్న సమయంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంవల్ల చమురు, గ్యాస్‌ సరఫరాలు నిలిచిపోయాయి. అధిక ధర పెట్టి దిగుమతి చేసుకునే సత్తా శ్రీలంకకు లేదు. మహిందా రాజపక్స సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతూ దేశాన్ని చైనాకు అనుకూలంగా తయారు చేయడం వల్ల అంతర్జాతీయంగా చైనా వ్యతిరేక దేశాలనుంచి శ్రీలంకకు సాయం అందడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక సహాయక సంస్థలకు చెల్లించాల్సిన రుణాల బకాయిలు పెరిగిపోవడం వల్ల కొత్తగా అప్పులిచ్చేందుకు ఆ సంస్థలు నిరాకరిస్తున్నాయి. రూపాయి విలువ 15 శాతం తగ్గింది. మహింద రాజపక్స సోదరులకు అధికారం కట్టబెట్టినందుకు ప్రజలు ఇది స్వయంకృతాపరాధంగా బాధపడుతున్నారు. రాజపక్స గతంలో తమిళ టైగర్లను అణచివేయడానికి చాలా క్రూరమైన పద్ధతులను అనుసరించారు. దాంతో మానవ హక్కుల ఉద్యమకారులు ఆయనకు వ్యతిరేకంగా వివిధ దేశాల్లో ఆందోళనలు నిర్వహించారు.

శ్రీలంకకు ఆర్థిక సాయాన్ని అందించవద్దంటూ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. చైనాతో జత కట్టి మన దేశానికి వ్యతిరేకంగా రాజపక్స ఎంత విషప్రచారం చేసినా మానవీయకోణంలో మన దేశం ఎప్పటికప్పుడు సాయాన్ని అందిస్తోంది. మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ గత వారం కొలంబోలో పర్యటించి భారత్‌ నుంచి మరింత సాయం అందించేందుకు వాగ్దానం చేశారు. శ్రీలంకలో నిత్యావసరాలధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్కడి తమిళులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. మన మత్స్యకారులను శ్రీలంక నౌకా దళం అటకాయిస్తున్నా, శ్రీలంకనుంచి వచ్చి పడుతున్న తమిళులను రామేశ్వరం, తదితర తీర ప్రాంతాల్లో రక్షణ దళాలు స్వాగతించడం గమనార్హం. లంకలో టైగర్ల దాడుల సమయంలో కూడా తమిళులు మన తమిళనాడుకు ఇదే మాదిరిగా వలస వచ్చేవారు.

శ్రీలంకలోని తేయాకు తోటల్లో పని చేసేందుకు తమిళులు వందల ఏళ్ళ క్రితం వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. జాఫ్నా ప్రాంతంలో తమిళుల ప్రాబల్యం ఉంది. దాంతో అక్కడి పాలనలో తమకు భాగస్వామ్యం కల్పించాలని తమిళులు ఆనాటి శ్రీలంక ప్రభుత్వంతో పోరు సాగించారు. శ్రీలంకలో సిరిమావో బండారు నాయకే, ఆమె కుమార్తె చంద్రిక కుమార తుంగ పాలనలో తమిళులు ఈ మాదిరి ఆందోళనలు సాగించకపోవడానికి కారణం అప్పట్లో తమిళుల పట్ల వివక్ష లేకపోవడమే. ఇప్పుుడు వివక్ష మాట అటుంచి సింహళీయులకే తిండి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆకలితో చావడంకంటే కాల్పుల్లో మరణించడమే మేలన్న నిర్ణయానికి జనం రావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement