Friday, April 26, 2024

విశ్వశ్రేయోదాయకం బాబా పలుకులు!

ఆస్తి, అంతస్తు, హోదా, కులం, మతంలాంటి వాటితో నిమిత్తం లేకుండా సాయిబాబా అందరితో ఒకేవిధంగా వ్యవహరించేవారు. సర్వమానవ సమానత్వాన్ని కోరుకునేవారు సాయిబాబా. మనుషులందరూ కూడా మంచితనంతో కూడిన మాటలతో అందరిని ప్రేమగా పలకరించాలి అనేవారు. ఎందుకంటే లోకంలో మనుషులందరూ ఒకటే. మానవులందరికీ ఒకేవిధమైన భావోద్వేగాలు, ఇంద్రియ స్పందనలు, ఆకలి, నిద్ర వుంటాయి. అందరికీ కూడు, గుడ్డ, గూడు అవసరం. కోటీశ్వరులయినా గుప్పెడు అన్నమే తింటారు కానీ బంగారాన్ని తినరు కదా! కళ్ళనిండా నిద్ర వచ్చినప్పుడు అందరూ ఒకే తీరుగా నిద్రపోతారు. తూగుటుయ్యాల మీద పడుకున్నా, చెక్కబల్ల మీద పడుకున్నా, నేలమీద పడుకున్నా, పరుపుమీద పడుకున్నా అందరికీ ఒకేవిధమైన నిద్రపడుతుంది. అందుకని మనుషులందరూ ఒకటే. కావున ఎవరికీ అత్యాశకుపోవడం, ఒకరికి మించి ఒకరు ఎదగాలనుకోవడం, మోసం చేసుకోవడం తగదనేవారు బాబా. ఇలాంటి అనేక అంశాలను సాయిబాబా విభిన్న సందర్భాల్లో తనని దర్శించడానికి వచ్చిన భక్తులతో చెప్పేవారు. జీవితానికి సంబంధించిన అనేక విషయాల్ని చిన్నచిన్న కథలుగా చెప్పేవారు. మనుషులు అత్యాశకు పోకుండా, కష్టపడుతూ తమకు కావలసిన దానిని సాధించుకోవలసిన అవసరాన్ని వివిధ సందర్భాల్లో గుర్తుచేసేవారు బాబా. తమ అవసరాలకు కష్టించి పనిచేయాలని, ఇతరుల కష్టాన్ని, శ్రమని కొల్లగొడుతూ పెత్తనం చెలాయిస్తూ జీవితాన్ని గడపకూడదని అనేవారు బాబా.
మనుషులు సాధ్యమైనంతవరకు అబద్ధాలు ఆడకూడదని చెప్పేవారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దు అని ఎప్పుడూ చెబుతుండేవారు. అందరూ తమ బలాలు, బలహీనతలు తెలుసుకొని ఉండటం శ్రేయస్కరం అనేవారు బాబా. ఇతరుల గురించి చెడుగా మాట్లాడినా, ఇతరులను నిందించినా వారి పాపాలను మన నాలుకతో నాకినట్లే అని చెప్పేవారు బాబా. ఇటువంటి విశ్వశ్రేయోదాయకమైన బాబా పలుకులను స్ఫూర్తిగా తీసుకొని అందరూ తమ జీవనగమనాన్ని నిర్దేశించుకోవాలి.
మసీదులో అతిసామాన్యంగా జీవించిన సాయిబాబా జీవన సరళి చిన్న కనిపిస్తున్నప్పటికి అనంతమై నది. ఉన్నచోటనే వుండి లోకరీతిని గమనించే సాయిబాబా సునిశిత దృష్టి విశ్వవ్యాప్తమైనది.
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్న బాబా బోధనల్ని, జీవనరీతిపైన దృష్టి నిలిపి తమ ప్రాధాన్యాల్ని ఎంచుకుంటే సంకల్పం సిఇద్ధిస్తుంది. ఈ సంకల్పం మానవాళి జీవన వికాసానికి ఉపకరించేట్టయితే అంతకన్నా మరింత మేలు మరొకటి వుండదు. తమ నామస్మరణం చేసేవారి నివాసాలు శోభిల్లుతాయని, ”తన భక్తుల ఇంటిలో లేమి అను శబ్దము పొడసూపదని” బాబా పలికేవారు. మనసారా శ్రద్ధతో, నమ్మకంతో తనను స్మరించేవారికి ఏ సమస్య వుండదని చెప్పేవారు.
బాబాగారి మాటల్లోని శక్తిని గ్రహించాలి. తమ విధుల్ని సక్రమంగా నిర్వహిస్తూ బాబా బోధనలకు అనుగుణంగా జీవించడం అలవరుచు కోవాలి. బాబా బోధనల్ని అనురక్తితో అర్థంచేసుకోవాలి. ఆచరించాలి. తద్వారా సాయిబాబా బోధనలకు సాఫల్యం చేకూరుతుంది. ఇది లోకానికి ఉపకారం చేస్తుందన్నది నిత్యసత్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement