Thursday, April 18, 2024

త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగము

శ్లో॥ “సహ్యాద్రిశీర్షే విమలే వసంతం,
గోదావరీ తీర పవిత్ర దేశే
యద్దర్శనాత్ పాతకమాశు నాశం,
ప్రయాతి తం త్ర్యంబకమీశ మీడే

భావము: నిర్మలమైన సహ్యపర్వత శిఖరంమీద, గోదావరి తీర ప్రదేశంలో నివసిస్తూ, దర్శనమాత్రము చేతనే పాపములను పోగొట్టే త్ర్యంబకేశ్వరుని పొగుడుచున్నాను. (ఇక్కడి అమ్మవారి పేరు త్ర్యంబకేశ్వరి)

పురాణగాధః సప్తర్షులలో ఒకడైన గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలసి సహ్య పర్వతముపై గల బ్రహ్మగిరిపై తపస్సుచేసుకొంటూ ఉండేవాడు. (సప్తర్షులు – 1. గౌతముడు, 2. విశ్వామిత్రుడు 3. భరద్వాజుడు 4. అత్రి, 5. వశిష్ఠుడు 6. కశ్యపుడు 7. జమదగ్ని అనువారు) ఒకప్పుడు దేశమున భయంకరమైన కరవు పరిస్థితి యేర్పడింది. ప్రజలు, పశుపక్ష్యాదులు త్రాగటానికి కూడ నీరులేక, పంటలులేక నానా బాధలూ పడుతూండేవారు. తిన తిండిలేని వారెలా యజ్ఞయాగాదులు చేయగలరు? యజ్ఞాహుతులు లేని (హవిస్సులు అందని) దేవతలు కూడ ఇబ్బంది పాలయ్యారు. ఆ పరిస్థితిని దయార్ద్ర హృదయుడైన గౌతముడు చూసి బాధపడి వర్షములు కొరకై వరుణదేవుని గూర్చి తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమై ‘మహర్షి! ఈశ్వరాజ్ఞను నేను మీరి వర్షమును కురిపించలేను, కానీ నీ తపస్సుకు మెచ్చిన నేను నీవు త్రవ్విన గోతిలో అక్షయముగా నీరుండనట్లు వరమిచ్చుచున్నాను. ‘అని చెప్పి అంత మయ్యాడు. గౌతముడొక మూరెడు లోతున ఒక కుండమును త్రవ్వాడు. వరుణుని వరము వలన అది నీటితో నిండినది. ఎంతనీరు వాడినను తరుగకుండ నిలచినది. అది తెలిసిన ఋషి గణములు భార్యా పిల్లలతో గౌతమ ఆశ్రమస్థలమును చేరి

పర్ణశాలలు నిర్మించుకొని తపస్సు యజ్ఞయాగాదులతో గౌతముడు గాయత్రీ మంత్ర ప్రభావముతో సద్యోజాత ఫలితముగా (విత్తనము కాలం వేసిన వెంటనే మొక్క మొలచి కాపు కాయుట) పంటలు పండిస్తూ తన దగ్గర చేరిన వెళ్ళబుచ్చేవారు. వారందరిని కరువు బారిన పడకుండ కాపాడేవాడు. క్రమము తప్పకుండా

హవిస్సులందుతూ వుండేవి. దేవతలు గౌతముని దయార్ద్రభావానికి, తపోప్రభావానికీ మెచ్చుకొంటూ వుండుటను తోటి మహర్షులు, బ్రాహ్మణ వర్గములు అసూయతో సహించలేక పోయేవారు. గౌతముని యెలాగైనా కించపరచాలనుకొన్నారు.

- Advertisement -

ఆ బ్రాహ్మణ వర్గములు ఒకచోట చేరి చర్చించుకొన్నారు. వారందరూ తమ తపస్సులను ధారపోసి ఒక ఆవును సృష్టించి గౌతముడు వేసిన పంటపొలములపైకి పంపించారు. అది పంటను తిననారంభించింది. అపుడా బ్రాహ్మణులు గౌతమునితో ఒక ఆవు పంటను నాశనము చేస్తోంది అని చెప్పారు. గౌతముడు దర్భగడ్డి పుల్లలతో ఆ ఆవును బయటకు తగులుటకు అదలించాడు. బ్రహ్మణ వర్గములవారి ఆశయము మేరకు ఆ ఆవు చనిపోయింది. దాంతో వారు గౌతమునకు గోహత్యా పాపమంది నదనీ, దానిని నివారించుకొనుటకు గిరిప్రదక్షిణములు చేయుచూ, ఈశ్వరునికై తపస్సు చేసి, ఆప్రాంతమున నది ప్రవహించునట్లు చేయమని, అదే అందుకు ప్రాయశ్చితమని చెప్పారు. వారి మోసమును గ్రహించని గౌతముడు ఆ సహ్యాద్రికి ప్రదక్షిణములు చేయుచు, ఈశ్వరునికై తపమాచరించెను. నిస్వార్థపూరితమైన గౌతముని తపస్సునకు ఈశ్వరుడు సంతుష్టుడై గౌతమునకు ప్రత్యక్షమై “మహర్షీ ! నిన్ను బ్రాహ్మణ వర్గముల వారు తామసులై వంచించారు. అది గ్రహించక నీవు తపస్సును కఠినముగా చేసి నన్ను తృప్తి పరిచావు. నీ అభీష్టమం ప్రకారము నేనిక్కడ జ్యోతిర్లింగముగా వెలుస్తాను. దివ్యగంగ నదిగా ఇక్కడ నుండి ప్రవహిస్తుంది. నీవలన దానియుత్పత్తి జరిగినది. కాబట్టి ఇకపై గౌతమి అనే పేరుతో పిలువబడుతుంది. గోహత్యాపాప నివారణకని నీవు తపస్సు చేశావు కాబట్టి గోదావరి అనే పేరున కూడ పిలువబడుతుంది. అని వరము లిచ్చాడు. నిన్ను మోసగించిన వారిని శిక్షిస్తాను అని శివుడు అన్నాడు. కాని గౌతముడు వారిని క్షమించమని కోరాడు. అతని విశాల, ఔదార్య బుద్ధికి మెచ్చుకొని శివుడు గౌతముని అనంతర జీవనమున సప్తఋషులలో ఒకనిగా స్థానమును పొందెదవని ఆశీర్వదించాడు. గౌతముడు, ‘బ్రాహ్మణుల కుండవలసిన సత్త్వ గుణమును వదలి, తామస గుణమవలంభించి ఒకరిని ఇబ్బంది పెట్టుటకు తపస్సును వ్యయము చేసినారు కావున మీయందు బ్రాహ్మణ్యము నశిస్తుంది. ఇకపై సేవక వృత్తితో దారిద్ర్యముతో పలుకష్టములు పడుతూ జీవించండి’ అని ఆ బ్రాహ్మణ వర్గములను శపించాడు. వారు తమ తప్పు తెలిసికొని, శాపము నుపసంహరించి తమను కాపాడమని వేడుకున్నారు. జాలిపడిన గౌతముడు ప్రతి నిత్యము బ్రహ్మణవిధులను తప్పకుండా నెరవేర్చువారిని, ప్రతినిత్యము గాయత్రిని ఉపాసించువారిని ఈ శాపము బాధించదని గౌతముడు వారి నూరడించాడు.

నాటి నుండి గౌతముడు తపస్సుచేసిన ప్రాంతమున వెలసిన ఆ శివునికి త్ర్యంబకేశరుడని (జ్యోతిర్లింగము) అక్కడినుండి ప్రారంభమైన నదికి గోదావరి/గౌతమి అను పేర్లు వచ్చాయి.

ఇక్కడికి దగ్గరలో గల పంచవటియందు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనవాస మునకు వచ్చి నివసించినట్లు రామాయణము వలన తెలుస్తోంది. ఇక్కడి రామ కుండము, లక్షణకుండము అను పేర్లతో రెండు కుండములు (చెరువులు) వున్నాయి.

సీతా కుండమను పేరుతో నొకటి గలదు. దానిని అహల్యాకుండమనీ శారంగపాణి కుండమని కూడా వ్యవహరిస్తున్నారు. సీతమ్మను రావణుడు ఇక్కడి నుండియే అపహరించాడని రామాయణం-పంచవటిలో వరుణానది యొడ్డునగల ఇంద్ర కుండములో స్నానము చేయుటచేత గౌతముని శాపమువలన ఇంద్రుని శరీరమున యేర్పడిన వేలాదిక్షిద్రములు (కన్నములు) ని వృత్తియై ఇంద్రుడు పూతాత్ము డయ్యెనని పురాణగాధ-ఇక్కడ గల అంజనాద్రి శిఖరమున ఆంజనేయుడు పుట్టాడట.

చరిత్ర: త్ర్యంబక క్షేత్రమును గూర్చి చెప్పుకోవలసినంతటి విశేషాలు లేవు. మరాఠా రాజ్యాన్ని పరిపాలించిన అనేకమంది రాజులు ఈ క్షేత్రాభివృద్ధికి పాటుపడ్డారు. పీష్వా బాలాజీ బాజీరావు అనేరాజు త్ర్యంబకేశ్వరునికి ఆలయం కట్టించి ఈ క్షేత్రాభివృద్ధికి యెంతో కృషి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement