Sunday, May 5, 2024

తిరుప్పావై ప్రవచనాలు

పాశురము : 1
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

మార్గళిత్తింగల్‌ మది నిఱౖన్ద నన్నాళాల్‌
నీరాడ ప్పోదువీర్‌ పోదుమినో నేరిళైయీర్‌ !
శీర్‌ మల్‌గు మాయ్‌ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్‌ కాళ్‌ !
కూర్‌ వేల్‌ – కొడున్దొళిలన్‌ నన్దగోపన్‌ కుమరన్‌
ఏరాన్‌ న్దకణ్ణి యశోదై యిళ ఞ్జిఙ్గమ్‌
కార్‌మేని చ్చెంగణ్‌ కదిర్‌ మది యమ్మోల్‌ ముగత్తాన్‌
నారాయణనే నమక్కే పఱౖ దరువాన్‌
పారోర్‌ వుగళప్పడిన్దేలో రెమ్బావాయ్‌!

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
‘శుభప్రదమైన మార్గశీర్ష మాసము శుక్లపక్షమున వెన్నెల నిండిన రాత్రులు గలది. స్నానము చేయు తలంపుకల వారందరూ రండు.చక్కని ఆభరణములు ధఱించి, సకల సంపదలు నిండిన గోప కులమున నున్న స ంపదలు కల గోపికలారా! వేలాయుధమున ధరించిన నందుని కుమారుడు, విశాలనేత్రముల కల యశోద బాలసింహము నీలమేఘ శ్యాముడు అరుణ నేత్రుడు, సూర్యచంద్ర సన్నిభముఖుడగు శ్రీమన్నారాయణుడే మన వ్రతసాధనమును అనుగ్రహించును. లోకములన్నియు ఆనందించును. ‘
ఇచట స్నానమనగా శ్రీకృష్ణ సమాగమము. శ్రీకృష్ణ సమాగమమునకై కోరిక కల వారందరూ ఇందుకు అర్హులు. భగవంతుని సేవకు సంకల్పించగానే మంచి కాలము, మంచి వాతావరణము తమకు తామే సమకూరును అని తెలిపిరి. భగవంతుని సేవ చేయ సంకల్పించుటే ఐశ్వర్యము. భగవంతుడు ఆచార్యునకు విధేయునిగా ఉండును. మంత్రమున యధేచ్చగా విహరించును. ‘మంత్రోమాతా గురు: పితా’ అని ప్రమాణము. యశోద అనగా కీర్తి నిచ్చునది. తల్లి అనగా మంత్రము. నందగోపుడనగా ఆనందమును కాపాడువాడు. ఇచట ఆనందమనగా పరమాత్మ. అతనిని అయోగ్యులకు అందకుండా కాపాడువాడు ఆచార్యుడు. వ్రతమునకు కూడా పరమాత్మ తగిన సాధన సంపత్తిని కూర్చి కొనసాగించును అని బోధించినది.

- Advertisement -

శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజా చార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement