Thursday, May 9, 2024

Big Story: తెలంగాణకు కేంద్రం షాక్‌.. గ్రీన్‌ ఎనర్జీ పేరిట డిస్కంలపై 7,200 కోట్ల అదనపు భారం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యుత్‌ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీ షాక్‌నే ఇచ్చింది. ఇప్పటికే వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని చెబుతున్న కేంద్రం.. తాజాగా గ్రీన్‌ ఎనర్జీ సెస్‌ పేరుతో విద్యుత్‌ పంపిణీ సంస్థలపై మరింత ఆర్థిక భారం వేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బొగ్గు టన్నుకు రూ. 50 గ్రీన్‌ ఎనర్జీసెస్‌ చార్టీ ఉండగా.. ఒకేసారి రూ.400 లను కేంద్రం పెంచింది. పెంచిన ఎనర్జీసెస్‌ చార్జీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 7,200 కోట్ల అదనపు భారం మోపింది. తెలంగాణ డిస్కంలు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి 50 వేల మిలియన్‌ యూనిట్లను ప్రతి ఏటా కొనుగోలు చేస్తున్నది. అయితే కేంద్ర సర్కార్‌ బొగ్గు ధరలను సాలీనా 6 నుంచి 10శాతం వరకు పెంచడంతో ప్రతి సంవత్సరం రూ.725 కోట్ల మేర డిస్కంలపై అదన పు భారం పడుతున్నది. దీనికితోడు బొగ్గు రవాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో బొగ్గు రవాణాకు సంబంధించి రైల్వే చార్జీలు 40శాతం మేర పెంచడంతో.. ఆ పెరిగిన చార్జీల భర్తీని ఏ రకంగా పూడ్చుకోవాలో తెలియక తెలంగాణ విద్యుత్‌ పంపిణీ (డిస్కంలు)లు ఆందోళన చెందుతున్నాయి.

రెనెవబుల్‌ పాలసీని తప్పనిసరి చేయడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ పీఎల్‌ఎఫ్‌లపై భారీగానే ప్రభావం చూపనుంది. అంతకు ముందే రాష్ట్ర విభజన సమయంలో సీలేరు, కృష్ణపట్నం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేయడంతో తెలంగాణ విద్యుత్‌ సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడింది. ఈ లోటును పూడ్చుకోవడం కోసం బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయడంతో విద్యుత్‌ సంస్థలు రూ.2,763 కోట్ల అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఏపీ జెన్‌కో, ఇతర సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్‌ను నిలిపివేయడంతో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు రూ.2,502 కోట్లు అదనంగా భరించాల్సి వచ్చింది. కొవిడ్‌ కారణంగా విద్యుత్‌ బిల్లుల వసూళ్లు రూ.4,374 కోట్లు నిలిచిపోవడంతో డిస్కంలపై ఆర్థిక భారం పడింది.

సంస్కరణల పేరుతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కేంద్రం..
విద్యుత్‌ సంస్కరణల పేరుతో కేంద్రం తెలంగాణను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ ఎక్కడ రాజీలేకుండా అన్ని వర్గాల వినియోగదారులకు, కులమతాలకు అతీతంగా సబ్సిడీతో నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. అందులో ప్రధానంగా ఒక్కో వ్యవసాయ పంపుసెట్‌కు ప్రతి సంవత్సరం రూ.18,167 సబ్సిడీ ఇస్తూ నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరం అందిస్తూ రికార్డ్‌ సృష్టించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 19.03 లక్షల వ్యవసాయ మోటార్ల కనెక్షన్లు ఉండగా.. గడిచిన ఏడేళ్ల నాటి నుంచి అదనంగా 6.89 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేశారు. మొత్తం వ్యవసాయ కనెక్షన్ల మీదనే రాష్ట్ర ప్రభుత్వం రూ.3.375 కోట్లు ఖర్చు పెట్టింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.3,200 కోట్లు ఖర్చు చేసింది. అదే విధంగా 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకునే గృహ వినియోగదారులకు సబ్సిడీ రూపంలో ప్రతి ఏటా రూ.1,253 కోట్లు ఖర్చు చెల్లిస్తున్నది.

ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి 101 యూనిట్లలోపు వినియోగదారులకు పూర్తిగా ఉచిత విద్యుత్‌ అందిస్తున్నది. ఈ పథకం ద్వారా 5.77 లక్షల ఎస్సీలు, 2.70 లక్షల ఎస్టీలు లబ్ధి పొందుతున్నారు. వీటితో పాటు హెయిర్‌సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నది. వీటికి తోడు 4,920 పవర్‌లూమ్స్‌, 5,920 కోళ్ల ఫారాలు, 39 స్పిన్నింగ్‌ మిల్స్‌కు యూనిట్‌ విద్యుత్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇవ్వగా వ్యవసాయానికి పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement