Saturday, March 16, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 54

  1. తల మీదంగుసుమ ప్రసాద మలికస్థానంబు పై భూతియున్
    గళ సీమంబున దండ, నాసిక తుదన్గంధప్రసారంబు లో
    పల నైవేద్యము జేర్చు నే మనుజు( డా భక్తుండు నీ కెప్పుడున్
    జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, ఏ మనుజుడు = ఏ మానవుడు,తల మీదన్ = తలపై, కుసుమ ప్రసాదము = నీ నిర్మాల్య మైన పుష్పప్రసాదాన్ని, అలికస్థానంబుపైన్ = నుదుటిమీద, భూతియున్ = నీ ప్రసాదమైన విభూతిని, గళసీమంబునన్ = కంఠ ప్రదేశాన / మెడలో, దండ = రుద్రాక్షమాల, నాసికతుదన్ = ముక్కుచివర, గంధప్రసారంబు = సువాసనల కదలికలు,(అభిషేకజలం నుండి), లోపలన్ = కడుపులో, నైవేద్యమున్ = నివేదన చేసిన ప్రసాదాన్నం, చేర్చున్ = ధరిస్తాడో, ఆ భక్తుండు = అటువంటి భక్తుడు, నీకు = నీకు, చెలికాడై = మిత్రుడై, ఎప్పుడున్ = ఎల్లప్పుడు / నిరంతరం, రౌప్యగిరిపైన్ = కైలాసపర్వతం మీద, విహరించున్.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! తన శిరస్సున నీ నిర్మాల్యమైన, పుష్పప్రసాదాన్ని, నుదుట నీ ప్రసాదమైన విభూతిని, మెడలో రుద్రాక్షమాల, ముక్కుచివర నీ అభిషేకజల సుగంధాలు, కడుపులో నీకు నివేదన చేసిన ప్రసాదాన్ని కూర్చుకొన్న (ధరించిన) భక్తుడు నీకు స్నేహితుడై, నిరంతరం కైలాసపర్వతం మీద నీతో కలిసి విహరిస్తూ ఉంటాడు. (‘సాలోక్యం’ అనే మోక్షం పొందుతాడు.)

విశేషం:
శివుడికి, శివనామానికి ఉన్నంత మహత్త్వంశివనిర్మాల్యానికి, శివప్రసాదానికి కూడా ఉన్నది. వాటిని భక్తితో ధరిస్తే ‘సాలోక్యం’ – అంటే శివుడు ఉండే లోకంలో ఉండటం – అనే మోక్షస్థితి లభిస్తుంది. అది శాశ్వతం. తిరిగి రావటం ఉండదు. మోక్షం 4 విధాలు. అవి : సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం.
రుద్రాక్షలు శివస్వరూపాలుగా భావించబడతాయి. రుద్రాక్షధారణం శివుడికి మిక్కిలి ప్రీతిపాత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement