Monday, April 29, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 38

  1. పదునాల్గేలెమహాయుగంబులొకభూపాలుండు; చెల్లించె న
    య్యుదయాస్తాచల సంధి నాజ్ఞనొకడాయుష్మంతుడై వీరి య
    భ్యుదయంబెవ్వరు చెప్పగా వినరొయల్పుల్ మత్తులై యేలచ
    చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా!,ఒక భూపాలుండు = ఒకరాజు, పదునాల్గు + మహాయుగంబుల్ = పదునాల్గు మహాయుగాలు,ఏలె = పరిపాలించాడు. ఒకడు = మఱియొకడు, మరి యొక రాజు, ఆయుష్మంతుడు + ఐ = దీర్ఘాయువు కలవాడై, ఆ + ఉదయ + అస్త + అచల సంధిన్ = ఆ తూర్పు, పడమర కొండల మధ్య నున్న భూమి యందు, ఆజ్ఞన్ = తన ఆజ్ఞను, చెల్లించెను = చలామణి చేసెను. వీరి = ఆ రాజుల యొక్క, అభి + ఉదయంబు = ఔన్నత్యం, ఎవ్వరు = ఎవ్వరూ, చెప్పగా చెపుతూ ఉండగా, వినరు + ఓ = వినలేదా, అక్కటకటా = అయ్యయ్యో, అల్పుల్ = చిన్న చిన్న రాజులు, మత్తులు + ఐ = మదించిన వారై, రాజులము + అంచు = మేమే రాజులంఅంటూ, ఏల = ఎందుకు, చచ్చెదరో? = విర్రవీగుతారో? , చనిపోతారో ?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! గతంలో ఒకరాజు 14 మహాయుగాలు భూమిని పరిపాలించాడు. మరొక రాజు తూర్పు పడమటి కొండల మధ్య ఉన్న భూభాగాన్ని (భూమి నంతటిని) తన ఆజ్ఞ కెదురు లేనట్లు దీర్ఘాయువు కలవాడై (చాల కాలం) పరిపాలించాడు. ఇటువంటి రాజుల చరిత్రలను ఇప్పటి అల్పులయిన రాజులు వినలేదా? తామే గొప్ప రాజుల మని విర్రవీగుతారెందుకో తెలియదు. (అజ్ఞానమే కారణం.)

విశేషం:
ఒకరాజు పరిపాలన చేసిన కాలం దీర్ఘం, మరియొకరి రాజ్యం విశాలం. ధూర్జటి కాలం నాటి రాజులలో ఏ ఒక్కరును ఆ పూర్వపురాజులలో ఏ అంశానికి సాటి రారు. వారితో పోల్చుకుని తమ అల్పత్వాన్నితెలిసికొన్నట్టయితే అంత గర్వపడడు. అది వారి అజ్ఞానం.

మహాయుగం:
కలియుగం – 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం దానికి రెండురెట్లు– 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం మూడురెట్లు– 12,96,0000. కృతయుగం నాలుగురెట్లు– 17,28,000. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 14 జరిగే వరకు పరిపాలించిన రాజులు మనకు పురాణాల యందు దర్శన మిస్తారు. సమకాలికులైన అల్పులైన రాజులను నిరసించటమే కాదు, ఆదర్శప్రాయులైనరాజులెట్లా ఉండాలో సూచించాడు ధూర్జటి.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement