Friday, April 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

85. విత్తజ్ఞానముపాదు చిత్తము, భవావేశంబురక్షాంబువుల్
మత్తత్వంబుతదంకురంబనృతముల్ మారాకు లత్యంత దు
ర్వ్రుత్తుల్ పువ్వులు పండ్లు మన్మథముఖావిర్భూతదోషంబులున్
చిత్తాభ్యున్నతనింబభూజమునకున్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:శ్రీకాళహస్తీశ్వరా!, చిత్త‍ -మనస్సు అనెడి, అభి-ఉన్నత- బాగా అభివృద్ధి చెంది ఎత్తైన, నింబ- వేప, భూజమునకున్- చెట్టుకి, విత్తజ్ఞానము- ధనానికి సంబంధించిన తెలివియే, పాదు్స మూలము / బోదె, భవ- ఆవేశంబు- సంసార సంబంధమైన ఉద్రేకమే, రక్ష- అంబువుల్- చెట్టుని రక్షించే నీరు, మత్తత్వంబు- మదించి ఉండే లక్షణమే, తత్- అంకురంబు- దాని మొలక, అనృతముల్- అసత్య భాషణాలే, మారు- ఆకులు- బీజదళాల తరవాత వచ్చే మొదటి ఆకులు, అతి- అంత- మిక్కిలి / అధికమైన, దుర్వృత్తుల్- చెడ్డవర్తనలే, పువ్వులు- దాని పూలు, మన్మథముఖ- మన్మథుడి నుండి, ఆవిర్భూత- పుట్టిన, దోషంబులు- వికారములే, పండ్లు- ఫలాలు.
తాత్పర్యం:శ్రీకాళహస్తీశ్వరా! మనస్సు అనే బాగా ఎత్తుగా ఎదిగిన వేపచెట్టుకి ధనసంబంధమైనతెలివియే మొదలు. సంసార సంబంధమైన భావావేశమే రక్షణ నిచ్చే నీరు. మదించి ఉండే లక్షణమే మొలక. అసత్యాలే మారాకులు. మిక్కిలి చెడు ప్రవర్తనలే పూలు. మన్మథవికారాలే పండ్లు.
విశేషం: ఇది విషమాలంకారం. అమృతస్వరూపుడైన శివుడి నుండి ఉద్భవించిన మానవుడి మనస్సు అనే వేపచెట్టు చేదుగా ఉండటం విపరీతం కదా!
సుఖానికి భోగాలు, భోగాలకి ధనం మూలం అనే భ్రమలో ఉండటమే ఇన్ని రకాలైన దుర్మార్గాలకి మూలం అనే సత్యాన్ని ఈ పద్యంలో తెలియ చెప్పాడు ధూర్జటి.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement