Monday, April 29, 2024

సమతా కుంభ్ – 2023 మహోత్సవం..

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు

ఈ రోజు ప్రాతఃకాలంలో ఆచార్య సన్నిధిలో ఆచార్యులతో పాటు అంగన్యాసం, కరన్యాసం సహిత భగవత్‌ ధ్యానం, అష్టాక్షరి మంత్ర జప అనుష్ఠానంతో యాగశాలలో కార్యక్రమం ఆరంభమైంది. తరువాత పెరుమాళ్ల ఆరాధన, సేవాకాలం, మంగళాశాసనములు, శాంతి పాఠం, వేద విన్నపాలు, వేద పారాయణములు వరుసగా కొనసాగాయి.

18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజనం జరిపించారు.

- Advertisement -

ఉదయం స్వామివారి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. స్వామివారి రథాన్ని పుష్పాలతో అలంకరించి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. రథోత్సవంలో ముందుగా గరుడ్మంతుడిని అవాహనం చేశారు. ఆ తర్వాత మాఢవీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద, రామానుజ నామస్మరణల మధ్య రథోత్సవం సాగింది. రథోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథాన్ని యాగశాలకు తీసుకొచ్చి పూర్ణాహుతి జరిపించారు. ఆ తర్వాత సమతా స్ఫూర్తి కేంద్రంలోని విరజా పుష్కరిణి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీ చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా రామచంద్రప్రభువుకు అభిషేకం నిర్వహించారు. పెరుగు, తేనె, వివిధ పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అభిషేకం అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరిపించారు.

చక్రస్నానం ఆచరించిన భక్తులకు మరుజన్మలేకుండా ముక్తి లభిస్తుందని శ్రీచినజీయర్‌ స్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ కళ్లతో కాకుండా మనసుతో దర్శించుకోవాలన్నారు. పాపాలను హరించేందుకే స్వామివారు రథం మనకు దర్శనమిచ్చారని, ప్రతి ఆలయంలో రథ విమానానికి ఒక పేరు ఉంటుందని.. సమతా మూర్తి కేంద్రంలోని రథం ప్రణవ ఆకారంలో ఉంటుందని అన్నారు. తన దగ్గరికి రాలేని భక్తుల కోసం ఆ భగవంతుడే రథంపై వచ్చి అనుగ్రహిస్తారని చినజీయర్‌ స్వామి అన్నారు.

రథం ప్రత్యేకతలు:
ఇలాంటి రథం ఇతర ఏ ఆలయంలో కూడా కనిపించదు.
శ్రీరంగంలో ఉండే విమానంలా ఈ రథం గోపురంపై ప్రత్యేకమైన విమానం ఏర్పాటు చేశారు.
అందమైన శిల్పకళా సౌందర్యం ఈ రథం సొంతం.
ఎన్నో శిల్పకళలు ఈ రథంలో ఉన్నాయి.

అంతేకాకుండా ఈ రథంపై చతుర్ముక బ్రహ్మ ఉన్నారు.

ఈ సమతామూర్తి కేంద్రంలోని పుష్కరిణికి ఒక విశేషం ఉంది. ఇది వైకుంఠంలో ఉండే పుష్కరిణి. దీని పేరు విరజా అని శ్రీ చినజీయరుస్వామి నామకరణం చేశారు.

మధ్యాహ్నం శ్రీ చినజీయర్‌స్వామి, దేవనాథస్వామి, రామచంద్ర రామానుజ జీయర్‌, అహోబిలం జీయర్‌ల ఆధ్వర్యంలో విశ్వశాంతి విరాట్‌ గీతా పారాయణ కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని భగవద్గీత పారాయణం చేశారు.

భగవద్గీతను భగవంతుడు అర్జునుడికి ఉపదేశించారని, భగవద్గీతను పారాయణం చేస్తే భగవంతుడిని ప్రార్థించినట్టే అని చినజీయర్‌ స్వామి అన్నారు. రామానుజుల వారి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేయడం మనందరి అదృష్టమని, అంతేకాకుండా రామానుజుల వవారి సమతా స్పూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో అసమానతలు, కుల, మత, లింగ బేధాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని భక్తులకు చెప్పారు.

భగవద్గీత పూర్తయిన తర్వాత శ్రీ చినజీయర్‌స్వామి కామెంట్స్‌..
గీత నేర్చుకోవడానికి యోగ్యతలు అక్కర్లేదు.. మనిషి అయితే చాలు
భగవద్గీత మత గ్రంథం కాదు.. మానవత్వాన్ని నేర్పే గ్రంథం
ఇది సాంప్రదాయక గ్రంథం కాదు.. సమాజాన్ని నిర్మించే గ్రంథం

అన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి మార్గాన్ని చూపించేది

రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement