Monday, July 15, 2024

పంచాయుధ స్తోత్రము (ఆడియోతో..)

స్ఫురత్‌ సహస్రార శిఖా తితీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్‌|
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:
చక్రం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్రిశిఖలను క్రక్కుచూమిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా!” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీమహావిష్ణువు యొక్క దక్షిణ హస్తతలము నలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణువేడుచున్నాను.

శ్లో|| విష్ణో ర్ముఖోత్థా నిల పూరితస్య
యస్య ధ్వని ర్దానవ దర్ప హంతా|
తం పాంచజన్యం శశికోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : శ్రీమహావిష్ణువు యొక్క అధరామతమే ఆహారముగ గైకొనుచు, ఆయన పూరించు వాయువతోనిండి, ఆనందాతిశయముచే నీవు చేయు ధ్వని చెవిసోకినంతనే రాక్షసమూక లందరియొక్క గర్వములను అణగిపోవును. అట్టి భీకర ధ్వనినీది. కోటి సంఖ్యాకమైన పూర్ణిమనాటి చంద్రులకాంతి ఒక్కచోట చేరినదా యనునట్లుండు తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతులనీవి . శ్రీవిష్ణువు యొక్క వామహస్తమున ప్రకాశించు శ్రీ పాంచజన్య శంఖమా! నిన్ను నేను ఎ ల్లప్పుడూ శరణు వేడుచున్నాను.

శ్లో|| హిరణ్యయీం మేరు సమానసారాం
కౌమోదకీం దైత్య కులైన హంత్రీమ్‌|
వైకుంఠ వామాగ్ర కరాభి మృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే||

- Advertisement -

తాత్పర్యము : బంగారమువలె స్పృహణీయమైన, మేరు పర్వతముతో సమానమైన బలము కల్గినట్టి రాక్షస కులములను నిర్మూలించుటలో ఇతర సహాయమునపేక్షించని శ్రీ వైకుంఠనాథుని యొక్క క్రింద వామహస్తము యొక్క కనుసన్నలలో సంచరించు ”కౌమోదకీ” యను ఓ గదాయుధమా! నిన్ను నే సదా శరణవేడు చున్నాను.

శ్లో|| రక్షో సురాణాం కఠినోగ్ర కంఠ-
చ్ఛేదక్షర చ్ఛోణిత దిగ్ధధారమ్‌|
తం నందకం నామ హరే: ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : జ న్మత: రాక్షసులై పుట్టి దుష్టబుద్ధి నిండి అసురులైన వారి యొక్కయు, ఏ జాతిలో పుట్టినా విష్ణుద్వేషముతో బుద్ధిచెడి దుష్ట ప్రవృత్తితో భగవద్దూషణ – భాగవత తిరస్కారములను చేయుచు అసురులుగ పిలువబడు వారి యొక్కయు, క్రూరమై మదమెక్కి బలసిన కంఠములను తెగ నరకుట నీ పని, తద్వారా నిరంతర ధారా ప్రవాహముగ కారుచున్న రక్తముతో మరింత వాడిగా జ్వాలలను క్రక్కుచు శ్రీ మహావిష్ణుని దివ్య హస్తమందు ప్రకాశించు చున్నావు. ”నందక” మను ఓ ఖడ్గరాజమా! నిన్ను నే నెల్లప్పుడు శరణువేడు చున్నాను.

శ్లో|| య జ్జ్యానినాద శ్రవణా త్సురాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్య:|
భవంతి దైత్యాశని బాణవర్షి
శార్ఞం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : దేవ దానవ భీకర సంగ్రామములలో నీ నారిని సారించుటచే బయల్వెడలిని ధ్వని(జ్యా ఘోషము) చెవి సోకినంతనే దేవతల మనస్సులలో ఉత్సాహము పెరిగి భయము పూర్తిగా పోవును. జయము కల్గును. రాక్షసులపై పిడుగులు కురియునట్లు శరముల పరంపరను వర్షించు శ్రీ స్వామి దక్షిణ దివ్యహస్తమున ప్రకాశించు శార్ఞమనెడి ఓ ధనస్సా! నిన్ను నే నెల్లప్పుడూ శర ణు వేడుచున్నాను.

శ్లోకం : ఇమం హరే: పంచ మహాయుధానాం
స్తవం పఠేత్‌ యో నుదినం ప్రభాతే|
సమస్త దు:ఖాని భయాని సద్య:
పాపాని నశ్యంతి సుఖాని సంతి||

తాత్పర్యము : శ్రీహరి ధరించు ఈ ఐదు దివ్యాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతిదినమూ అనుసంధించు వారియొక్క పాప ములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దు:ఖములు అట్టివారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు.

శ్లో|| వనే రణ శత్రు జలాగ్ని మధ్యే
యదృచ్ఛయాపత్సు మహాభయేషు|
ఇదం పఠన్‌ స్తోత్ర మనాకులాత్మా
సుఖీ భవేత్‌ తత్కృత సర్వ రక్ష:||

తాత్పర్యము : అడవులలో దారితప్పి, జంతువుల బారినపడి, యుద్ధములో చిక్కుకొని, నీటి ప్రమాదమేర్పడి, అగ్ని ప్రమాదమేర్పడిగాని భయగ్రస్తులయినా, లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ యితర ఉపద్రవమందైనా ఒక్కసారి ఈ అయిదు ఆయుధములను మనసార స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరము చేసి భయములు తొలగించి సుఖములను పొందించును.

శ్లో || స శంఖ చక్రం సగదాసి శార్గఙం
పీతాంబరం కౌస్తుభ వత్స చి హ్నమ్‌ |
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే||

తాత ్పర్యము : భక్తులకు ఆభరణములై, భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ, చక్ర గదా, ఖడ్గ, శార్గఙంములను పంచాయుధములను ధరించి, పీతాంబరముతో వెలుగొందుచు, కౌస్తుభమణిని ధరించి శ్రీవత్సమనెడి పుట్టుమచ్చతో విరాజిల్లుచు, శ్రీదేవి సదా సన్నిధిచేరి యుండుటచే మెరుపు తీగచే చుట్టబడిన నీలిమబ్బువలె దేదీప్యమానమగు దివ్య సుందరి మంగలవిగ్రహ విశిష్ణుడును అగు శ్రీమహావిష్ణువును నేనెల్లప్పుడూ సేవించుచున్నాను.

శ్లో|| జలే రక్షతు వారాహ: స్థలే రక్షతు వామన:|
అటవ్యాం నారసింహశ్చ సర్వత: పాతు కేశవ:||

తాత్పర్యము : జలము నందెల్లపుడూ ఏ పాపదలు దరి చేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక! భూమిపై ఏ ప్రమాదములు స ంభవించకుండు నట్లు శ్రీ వామన మూర్తి మనలను బ్రోచుగాక! అడవులలో ఘోర ప్రమాదములలో చిక్కుకొనకుండ శ్రీ నరసింహస్వామి కాపాడుగాక! బ్రహ్మకు శివునికి తన దేహమందే స్థానము నిచ్చిన సర్వజగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక!

Advertisement

తాజా వార్తలు

Advertisement