Wednesday, May 1, 2024

కళ్యాణ వైరాగ్యం

మానవుడు చేసే కృత్యాకృత్యాలను ఆ సృష్టికర్త భగవంతుడు ప్రతీ క్షణం పరిశీలిస్తూనే ఉంటాడు. అయితే తనను ఎవరూ చూడ డంలేదని భావిస్తాడు. సత్త్వగుణ సంపన్నులు మాత్రం ఈ విష యాన్ని గ్రహించి తమకు లభించిన ఈ మానవ జన్మను ధర్మానుసారంగా సాగించి ఆనందంగా ముగిస్తారు.
ఆదిత్య చన్ద్రావ నిలానలేచ
ద్యౌర్భూమి రాపో హృదయం యమశ్చ|
అహశ్చ రాత్రిశ్చ ఉభేచసంధ్యే
ధర్మశ్చ జానాతి నరస్యవృత్తమ్‌
సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, జల ము, హృదయము, యముడు, పగలు, రాత్రి, రెండు సంధ్యలు, ధర్మము, తోటిమానవులు అంటే సమాజము ఇవన్నియూ మను జుడు చేయు మంచి, చెడులన్నిటినీ నిత్యమూ పరిశీలించుచున్నాడు. పై వానిలో హృదయము అనగా అంతరాత్మ చాలా ముఖ్యమైనది. మనుజులు చేయు పనులన్నియూ తమ అంతరాత్మకు తెలిసియే చేయుచుందురు. అందువలననే అంతరాత్మ యొక్క ముఖ్యగుణము విచక్షణ. అది ఎల్లప్పుడూ మం చినే కోరుచుండు ను. అయితే దానిని గ్రహించుటయే వివేకము.
ఈ చావు పుట్టుకల చక్రములో అన్ని జీవులవలె మానవులు కూడా తిరుగుచూ సుఖదు:ఖాలు అనుభవిస్తున్నారు. ఎవరైతే జన్మ యొక్క సార్థ కతను తమ విజ్ఞతతో కనుగొనుచున్నారో వారు ఆనం దమును అనుభవించి ముక్తిని పొందుచున్నారు. ఆనందమనగా ఇక్కడ సచ్చిదానందము. మరి ఎందుకు ఈ భ్రమణమునందు మనుజులు చిక్కుకొనుచున్నారు? అను ప్రశ్న ఉత్పన్నమగును. దీనికి కారణం అజ్ఞానం మరియు దాని నుండి జనిం చిన అరిషడ్వర్గాలు. ముఖ్యముగా కామం, లోభం, మోహం ఇవి మనుజుని స్వార్ధపూరితముగా మార్చివేయును. స్వార్థం ఎప్పుడైతే మొదలగునో దానికి భయం తోడవుతుంది. భయం, స్వార్థం ఒకదానికొకటి పరస్పరం ప్రోత్సహించుకుంటూ మనుజుని అశాంతికి గురిచేసి అజ్ఞానంలో దించు తుంది. దానితో మానవుడి జీవితమంతా భయంతోనే గడిచిపోతోంది.
భోగేరోగ భయం, కులేచ్యుతి భయం, విత్తేనృపాలాద్భయమ్‌
మానేదైన్య భయం, బలేరిపు భయం, రూపేజరాయా భయమ్‌
శాస్త్రేవాద భయం, గుణఖల భయం, కాయేకృతాంతాబ్భయమ్‌
సర్వవస్తు భయం భువిహి, నృణాం వైరాగ్యమేవా భయమ్‌
స్వార్థం భోగాన్ని కోరుతుంది. అయితే ఎక్కడ రోగం వస్తుందోనని భయంతోనే ఉంటాడు. తన కులం అనే అహంతో ఉండేవారికి అది ఎక్కడ నాశనమయి జారిపోతుందోనని భయం. ఇక సంపా దించిన ధనాన్ని రాజు ఎక్కడ చూస్తాడో, తన సంపద రాజు కళ్ళలో ఎక్కడ పడిపోతుందోనని భయం. ప్రభువు ఎక్కడ తన ధనాన్ని ఖజానాకి జమ చేస్తాడోనని భయం. మానాభిమానంతో బ్రతికేవాడికి ఎక్కడ ఒకరి చేతి క్రింద చేయి చాచవలసి వస్తుం దోననే దైన్యమను భయం. బలంతో ఉండేవాడికి ఓటమి భయం వెంటాడు తుంది. ఎవరి చేతిలో ఓడిపోతానోననే భయం. ఇక అందంతో విర్రవీగేవారికి వృద్ఢాప్య భయం. తప్పదని తెలిసినా స్వార్థం వల్ల వృద్ధాప్య భయం వెంటాడుతుంది. శాస్త్రంలో దిట్టయిన పండితునికి ఎవరి చేతిలో వాదంలో ఓడిపోతానేమోననే భయం. ఇక గుణవంతునికి ఎక్కడ ఖలు రతో స్నేహం ఏర్పడుతుందో, తమ గుణాన్ని కోల్పోవలసి వస్తుందోనని భయం. ఇక చివరగా ఈ కాయం అంటే దేహాన్ని వదలి వేయవలసి వస్తుందనే భయం. పుట్టినది గిట్టక మానదు. ఆ విషయం తెలిసి కూడా మృత్యు భయం. ఈవిధంగా సర్వం భయం. సకల వస్తువులూ భయాన్ని కల్పిస్తూ ఉంటాయి. అందుకే జ్ఞానంతో ఆ పరాత్పరుని లీలను తెలుసు కున్నవారికి వైరాగ్యమనే కళ్యాణం లభిస్తుంది. ఆ వైరాగ్యమే భయాన్ని పోగొట్టి అభయాన్ని కలిగిస్తుంది. వైరాగ్యమంటే వృద్ధాప్యంలో వచ్చేది కాదు. ఆ సమయంలో వచ్చేది రాగాను రాగాలు వెంటాడుతున్న వైరాగ్యం. యుక్తవయసులో గృహస్థుగా మారినప్పుడే ఈ వైరాగ్యభావం అలవడాలి. కర్తవ్యం, కర్మలతో కూడిన వైరాగ్యం. ధర్మానువర్తియై అర్థ కామాలను కాం క్షిస్తూ పరోపకారంతో ఆనందంగా లభించిన అవకాశాన్ని సంపూర్ణం చేసు కోవడమే వైరాగ్యం. అదే కళ్యాణ వైరాగ్యం.
య: సర్వత్రానభి స్నేహ: తత్తత్‌ప్రాప్య శుభాశుభమ్‌|
నాభినందంతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా||
ఎవరైతే సర్వకాలముల యందు మమకారం, ఆసక్తి లేకుండా సంప దలకు సౌభాగ్యానికి పొంగి పోకుండా, కష్టాలకు కృంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా తన కర్తవ్యాన్ని, ఆనందంగా కొనసాగిస్తారో వారు పరి పూర్ణ జ్ఞానంతోనున్నవారు. అటువంటివారినే కళ్యాణ వైరాగ్యము తోనున్న ఋషితుల్యుడు అనవచ్చు. ప్రస్తుతం యువత విజ్ఞానాన్ని పొంది సకల సౌక ర్యాలు అమర్చుకొని సుఖపడడం లౌకిక విజయంగా భావించవచ్చు. కాని చిన్న కష్టం వచ్చినా, వడిదుడుకులు ఏర్పడినా కృంగిపోతూ జీవితాలను మధ్యలోనే ముగించుకొనే బలహీన యువతను చూస్తే మానవజన్మ యొక్క ప్రాముఖ్యత తెలియలేదని చెప్పవచ్చు. ఈ సకల చరాచర సృష్టికర్త ఆ పర మాత్మను తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. విజ్ఞాన శాస్త్రం కల్పించే సౌక ర్యాలే జీవితమనే భ్రమలో ఉన్నారని భావించవచ్చు. ఆకర్షణకు, ప్రేమకు తేడా తెలియని అవి వేకంతో అనేక అనర్థాలకు గురి అవ్వడం చూస్తే లోపం ఎక్కడ వుందో ప్ర తి ఒక్కరూ ఆలోచిం చాల్సిన అవసరం ఉంది.
యుగయుగాలకు పరమ సత్యంగా నిలిచి ఉండే సనాతన ధర్మపథం, వాఙ్మయాన్ని తరతరాలకు అందించవలసిన అవసరం ఉంది. బాల్యము నుండే బాలబాలికలకు పురాణ ఇతిహాసాలను, ఉపనిషత్తులను బోధించ వలసిన అవసరం ఉంది. కొన్ని తరాలు వాటికి దూరమవడం వల్ల ప్రస్తుత యువత ఒక గందరగోళ స్థితిలో ఉంది. అందుకే ప్రస్తుత భావి గృహస్థులు సకల శ్రేయస్సును కలిగించే సనాతన వాఙ్మయాన్ని అధ్యయనం చేసి పిల్లల కు అందిస్తే మన భరతజాతి వల్ల లోక కళ్యాణం తప్పక జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement