Friday, May 3, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

39: రాజన్నంతనెపోవునా? కృపయు, ధర్మం బాభిజాత్యంబు, వి
ద్యాజాత క్షమ, సత్యభాషణము, విద్వన్మిత్రసంరక్షయున్
సౌజన్యంబు, కృతంబెఱుంగుటయు, విశ్వాసంబు, గాకున్న దు
ర్బీజ శ్రేష్ఠులుగా( గతంబుగలదే? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం : శ్రీకాళహస్తీశ్వరా!, రాజు – అన్న – అంతనే – రాజరికం లభించగానే, కృపయు -దయయు, ధర్మము – ధర్మాచరణం, ఆభిజాత్యము – సద్వంశంలో జన్మించటం వల్ల వచ్చిన సద్గుణాలు, విద్యా – జాత – క్షమ – ఎఱుక(జ్ఞానం) వలన పుట్టిన క్షమాగుణం, సత్యభాషణం – నిజం పలకటం, విద్వత్ – పండితులను, మిత్ర – స్నేహితులను, సంరక్షయున్ – బాగుగా పోషించటం, సౌజన్యంబు – మంచితనం, కృతంబు – చేసిన ఉపకారాన్ని, ఎఱుంగుటయు – గుర్తుంచుకోవటం, విశ్వాసంబున్ – నమ్మకము, పోవునా? – పోతాయా? (నశిస్తాయా?) కాక – ఉన్నన్ – అట్లా కాకపోతే, దుర్బీజ – శ్రేష్ఠులు – కాన్ – చెడు పనులకు జన్మస్థానమైన వారిలో ప్రథమ గణ్యులవటానికి, కతంబు – కారణం, కలదు -ఏ – ఉందా? (లేదు కదా అని భావం)
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! ‘రాజు’ అనే పద్యంతో పిలవగానే (రాజరికం లభించగానే) అంతకు ముందున్న దయ, ధర్మమార్గావలంబనం, సద్వంశంలో జన్మించటం చేత వంశపారంపర్యంగా వచ్చిన సద్గుణాలు, విద్యవల్ల కలిగిన క్షమ(విద్య సదసద్వివేకాన్ని కలిగిస్తుంది కనుక క్షమాగుణం సిద్ధిస్తుంది). నిజం పలకటం పండితులని, స్నేహితులని పోషించి కాపాడటం, సద్వర్తనం (మంచితనం), కృతజ్ఞత, నమ్మిక మొదలైన లక్షణాలన్ని నశించి పోతాయో! ఏమో! కాకపోతే రాజులు ఈ విధంగా పాపకార్యాలకి జన్మస్థానాలైన వారిలో శ్రేష్ఠులుగా అవటానికి కారణం మఱి ఏముంది?
విశేషం: తన కాలం నాటి రాజులలో తనకు కనపడిన దుర్లక్షణాలనన్నింటిని ధూర్జటి ఈ పద్యంలో ఏకరవు పెట్టాడు. చివరగా చెప్పిన నమ్మకం లేకపోవటం అన్నది రాజులకి ముఖ్యలక్షణం. కృతజ్ఞత అన్నదిమానవులందరికి తప్పక ఉండవలసిన లక్షణమే అయినా, ఉండటం చాలా కష్టం. అందునా రాజులకి ఎవరేది చేసినా, అది తమ హక్కుగా భావించటం జరుగుతుంది.
ఈ దుర్లక్షణాలన్నీ పుట్టుకతో వచ్చినవి కావు. రాజుగా గద్దె నెక్కగానేసంక్రమించేవి.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement