Friday, May 17, 2024

కాలభైరవా భజేహం!

పూర్వం మేరు పర్వతప్రాంతంలో మహర్షులు సమావేశమై సర్వే శ్వరుడైన పరమాత్మ ఎవరు? నాశరహ తమైన, అఖండమైన పదార్థం ఏది? అని తమలో తాము చర్చించు కొని, సృష్టికర్త బ్రహ్మ వద్దకు వచ్చి అడిగారు. ఆ సందర్భంలో మాయామోహ తుడైన బ్రహ్మ ”నేనే దేవతలలో శ్రేష్టుడను. సృష్టికర్తను. యజ్ఞాధిపతిని నాకంటే అధికులు ఎవరు? నన్ను ఆరాధించకుండా, ఎవరూ ముక్తిని పొందలేరు.” అన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారాయణాంశ సంభూతుడైన యజ్ఞుడు బ్రహ్మ మాటలను అంగీకరించక, ”నేనే లోక కర్తను. పరం జ్యోతిని. నన్ను ఆరాధించనిచో జగత్తుకు జీవమే లేదు. నువ్వు నావల్లనే సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నావు.” అన్నాడు. దానికి బ్రహ్మ అంగీకరించలేదు. దాంతో బ్రహ్మ, యజ్ఞుడు వేదా లను అడిగారు ”పరమాత్మ ఎవరు? అఖండమైన పదార్థం ఏది?” అని. వేదాలు అన్నీ కలిసి ”రుద్రుడే పరమాత్మ. పరతత్త్వం. ఆయన వద్ద ఉన్నదే అఖండమైన పదార్థము.” అని వివరించాయి. ఆ మాటలకు మోహావేశంతో ఉన్న బ్రహ్మ, యజ్ఞుడు నవ్వుతూ ”బూడిద రాసుకుని దిగంబరుడుగా శ్మశానంలో తిరిగేవాడా? ఆ నిర్వి కారుడు శివుడా?” అన్నారు. ఆ మాటలకు శివుడు అక్కడకు వచ్చి, రౌద్రంతో గట్టిగా హూం కరించాడు. ఆ హూంకారం నుండి, భయంకర రూపంతో, త్రినేత్రుడు గా, త్రిశూలం ఒక చేత్తో, మరొక చేత్తో డమరుకంతో ఒక మనిషి ఆవిర్భ వించాడు. ఆ రూపం శివునికి నమస్కరించి, తన జననానికి కారణం తెలుప మన్నాడు. శివుడు ”కాలభైరవా! నువ్వు కాల సమానుడవు. కాల రాజువి. విశ్వాన్ని భరించుటకు, సమర్థించుటకు, సమర్థుడవు. భైరవుడు, కాలుడు నిన్ను చూసి భయపడుతుంటారు. అందుకే నువ్వు కాల భైరవుడవు. అహంకారంతో ఉన్న బ్రహ్మను శిక్షించడానికే నీవుఉద్భవించావు” అన్నాడు.
కాలభైరవుడు శివుని ఆజ్ఞమేరకు బ్రహ్మకున్న పంచముఖాలలో మధ్య ఉన్న శిరస్సును తన గోటివేళ్ళతో ఖండించాడు. బ్రహ్మకున్న మోహం పోయింది. ఖండించిన బ్రహ్మ శిరస్సు కాలభైరవుని చేతిలో అంటుకొనిపోయింది. శివుడు ”నీకు బ్రహ్మ హత్యాపాతకం సోకింది. నీవు తీర్థయాత్రలు చేసుకొంటూ, కాశీక్షేత్రంలోకి ప్రవేశించగానే నీకు సోకిన బ్రహ్మ హత్యాపాతకం పోతుంది. పవిత్రమైన గంగానదిలో నీవు స్నానం చేస్తున్న సమయంలో, నీ చేతికి అంటిన బ్రహ్మ శిరస్సు ఊడి, గంగలో కలిసిపోతుంది. ఆ ప్రదేశమే కపాలమోక్ష తీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది.” అని చెప్పి, ఇంకా ఇలా వివరించాడు-
”నువ్వు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడవు. కాశీని సందర్శించే భక్తులు ముందుగా నిన్ను దర్శించే, తర్వాత విశ్వేశ్వరుడి దర్శనం చేసుకొంటా రు” అని చెప్పాడు.
వెంటనే కాలభైరుడు అదృశ్యమయ్యాడు.
తరువాత శ్రీ మహావిష్ణువు కాశీలోని కాలభైరవుని సందర్శించి, ”నీవు పరమాత్మ స్వరూపుడవు. నీ నామ స్మరణ వల్ల, నిన్ను దర్శించుటవల్ల, చేసిన పాపాలు నశి స్తాయి. పునర్జన్మ ఉండదు. యోగులు సైతం దర్శింప లేని, జగత్కారుడువైన నీ దర్శనంవల్ల ధన్యుడను అయ్యాను.” అని కాలభైరవుని కీర్తించాడు.
ఎక్కడా పోని బ్రహ్మ హత్య దోషం కాశీలో కపాలమోక్ష తీర్థంలో స్నానం చేస్తే నశిస్తుంది. పితృదేవతలకు, దేవతలకు తర్పణాలు, ఇతర కార్యక్రమాలు చేస్తే విశేషమైన పుణ్యం సిద్ధిస్తుంది. కాలభైరవుని ఆల యంలో మార్గశిర మాసం శుద్ధ అష్టమీ తిథియందు విశేష పూజలు, కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే కాలభైరవుని జన్మించిన రోజు కదా. కాలభైరవుని దర్శనంవల్ల జన్మజన్మల పాపాలు నశించడమే కాక, ఆయన్ను తలచుకొని, ఏ కార్యం ప్రారంభించినా, విఘ్నాలు ఉండవని పురాణాలు చెపుతున్నాయి.
ఇదివరలో కాశీయాత్ర చేసివచ్చినవారు, అన్నసమారాధన, కాల భైరవుని పూజ చేసేవారు. అందులో భాగంగానే మినప వడలు (గారెలు) దండ తయారుచేసి, ఓ శునకాన్ని కుంకుమ, పసుపులతో అలంకరించి, పూజించి, శునకం మెడలో ఆ గారెలు దండ వేసేవారు. కాలక్రమంలో మన ఆచార వ్యవహారాలు మరుగున పెట్టేస్తున్నాము. శునకం రూపం లోనే కాలభైరవుడు ఉన్నాడని మన విశ్వాసం. ఆయనే ఆ శునక రూపం లో ప్రజల మధ్య తిరుగుతూ, రక్షిస్తున్నాడు.
అందుకే ఈ కాల భైరవాష్టమి రోజున ఆయనను పూజించి, అష్టకా న్ని చదివి కాలభైరవుడిని స్మరించుకొందాం!
”కాల భైరవా నమోస్తుతే
కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే!”

  • అనంతాత్మకుల రంగారావు
    7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement