Tuesday, April 30, 2024

గురువే శిష్యుడైన వేళ !

గురువు యాదవ ప్రకాశులకు మొదట్లో అభిమాన శిష్యుడు రామానుజులవారు. అయితే కొన్నాళ్ళకు గురుశిష్యుల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. రామానుజులది వివేకసహిత గురు శుశ్రూషా పద్ధతి. మారు మాట్లాడక గురువు గారు చెప్పిన దానిని వల్లెవేసే బట్టీ వీరుడు కాదాయన. పైగా వారు అధ్యయనం చేసేది ఉపనిషద్విద్య. ప్రశ్నించి సత్యాన్ని స్పష్టపరచు కోవడం ఉత్తమ శిష్యుని లక్షణం. చర్చించి, సత్యాన్ని స్పష్టపరచి శిష్యుడిని వొప్పించగలగడం ఉత్తమ గురువుకు ఉండవలసిన లక్షణం. యాదవ ప్రకాశులు వేదమంత్రాలను తనకు అర్థమైన దృక్పథంలో బోధించసాగారు. యాదవ ప్రకాశులు ఉపనిషన్మం త్రాలపై చెప్పే వ్యాఖ్యానాలు రామానుజులకు తృప్తినివ్వలేదు. దాంతో యాదవ ప్రకాశులు బోధించే వ్యాఖ్యానాలలోని దోషా లను, పరిమితులను రామానుజులు ప్రశ్నింపసాగారు. ఆయన సత్యాన్వేషణ బుద్ధి గురువుగారికి గురుధిక్కారంగా తోచింది.
రామానుజులు ప్రతిపాదించే సవరణలు హేతుబద్ధమైనవి, తార్కికమైనవి, ఆమోదయోగ్యమైనవి. ఈ సత్యం గురువుగారి బుద్ధి గ్రహించినా, ఆయన మనస్సు దానిని అంగీకరించలేకపో యింది. యాదవప్రకాశులను తు.చ. తప్పక అనుసరించే అభిమాన శిష్యులు కొందరు గురువుగారి ముందు రామానుజులను ఈసడి స్తూ, ఆక్షేపిస్తూ అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా యాదవ ప్రకాశకుల అసంతృప్తిని ప్రజ్వలింపచేయసాగారు. అయినప్పటికీ రామానుజా చార్యులు ఎనిమిది సంవత్సరాలు యాదవ ప్రకాశుల వద్ద ఎంతో ఓర్పుతో ప్రమాదాలకు లోనౌతూ విద్యనభ్యసించారు.
శ్రీ భగవద్రామానుజాచార్యులు గురువు యాదవ ప్రకాశులతో కలిసి కాశీయాత్రకు బయలుదేరారు. ఆ ప్రయాణంలో తనను భౌతి కంగా తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని తెలిసి తెలివిగా బయటపడ్డారు. ప్రయాణం మధ్యలోనే తప్పించుకొని ఇంటికి చేరి నప్పటికీ, రామానుజులు తనపై జరిగిన ప్రాణహాని ప్రయత్నానికి ప్రతిక్రియ సంకల్పించలేదు. పైగా ‘విద్య’మీద ప్రేమతో, ఏమీ తెలి యనట్లుగా రామానుజులు యాదవ ప్రకాశకుల వద్ద తగు జాగ్రత్త లతో ఈ ఘటన అనంతరం మరో రెండు సంవత్సరాలు గడిపారు. ఆటంకాలను పట్టిం చుకోని ఏకాగ్రత, మానసిక దృఢత్వం రామా నుజుల లక్ష్య శుద్ధిని స్పష్టం చేస్తుంది.
రామానుజుల హృదయ పరిపక్వత ఆ తర్వాత కాలంలో యాదవ ప్రకాశుని పరివర్తనకు మార్గం చూపింది. తన పాండిత్యం మానసిక ప్రశాం తతను ఇవ్వలేకపోయిందని గ్రహించాడు యాదవ ప్రకాశులు. కొన్ని సంవత్సరాలకు యాదవ ప్రకాశులు ఒకప్పుడు తనకు శుశ్రూ షలు చేసిన శిష్యుడైన రామానుజాచార్యులు వివేకవంతుడైన యతియై, ఆత్మోజ్జీవన మార్గాన్ని లోకానికి ప్రకాశింపచేస్తున్నాడని, ఎవరినైతే తాను గంగలో ముంచి పరిమార్చా లని భావించాడో, అతడు ప్రజల హృదయ తాపాగ్నులను చల్లార్చే నడిచే పవిత్ర గంగాజలమయ్యాడని, తాను విషపు మొక్కగా భావించి గిల్లేద్దామనుకున్న చిన్న మొక్క నేడు తన కళ్ళముందే కల్పవృక్షంగా పెరిగి ఆశ్రితుల అభీష్టాలను నెరవేరుస్తు న్నదని తెలుసుకున్నారు. భేషజాలను వీడిన యాదవ ప్రకాశులు రామా నుజులను తన మనోవికారాలను సరిదిద్దమని వేడు కొన్నాడు. గురువు శిష్యుడయ్యాడు. వివేకం శుశ్రూషలందు కొన్నది. ‘గోవిందదాసుని’గా మారిన యాదవప్రకాశుడు ”యతిధర్మ సముచ్ఛయ”మనే గ్రంథాన్ని రచించి ‘శిష్య గురువు’ ముందుం చాడు.చివరకు యాదవ ప్రకాశులు రామానుజుల సన్నిధిలో ప్రశాంత చిత్తంతో దేహం విడిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement