Friday, May 3, 2024

పితృయజ్ఞం ఎలా చేయాలి

పితామహా! పితృ యజ్ఞం ఏవిధంగా చేయాలి? అని అడిగాడు ధర్మరాజు భీష్ముల వారిని.
”ధర్మరాజా! దేవతలు సైతం స్తుతించే పితృదేవతలను పూజించడం దేవతలను పూజించడం కన్నా గొప్ప పని. ప్రత్యేకించి మానవులకు పితృదేవ తలను పూజించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. మంచి నడవడిక గల ధర్మరాజా! ప్రతి అమావాస్య నాడు భక్తిశ్రద్ధలతో పిండ ప్రదానం చేస్తూ శ్రాద్ధం చేసేవాడు నిత్యమూ చేసేవాడే అవుతాడు.”
” తాతా! పితృదేవతలకు ఏఏ తిథులందు శ్రాద్ధం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది?”
”ధర్మరాజా! పితృదేవతలకు పాడ్యమినాడు శ్రాద్ధంపెడితే అందమైన కన్యకు భర్త అవుతాడు. విదియనాడు పెడితే కన్యలకు (ఆడపిల్లలకు) తండ్రి అవుతాడు. తదియనాడు అయితే అశ్వసంపద కలవాడు, చవితినాడు అయితే గోదానం కలవాడు కాగలరు. పంచమినాడు శ్రాద్ధం పెడితే ఎక్కువమంది కొడుకులు కలవాడు అవుతాడు. షష్టి నాడైతే చక్కగా ప్రకాశించే బుద్ధి కలవాడు, సప్తమి నాడైతే వ్యవసాయదారుడు కాలడు. అష్టమినాడు శ్రాద్ధం పెడితే వ్యాపార పుష్టి కలవాడు, నవమి నాడు ఒంటిగిట్టల పశు ధనం కలవాడు, దశమినాడు శ్రాద్ధం పెడితే ఆలమందలు కలవాడు, ఏకాదశినాడు శ్రాద్ధం పెడితే లోహ సంపదలు కలవాడు, ద్వాదశినాడు శ్రాద్ధం పెడితే బ్రహ్మ తేజస్సుకల పుత్రులు కలుగుతారు. త్రయోదశినాడు పెడితే భాగ్యవంతుడౌతాడు. యుద్ధం కోరుకొనేవాడు చతుర్దశినాడు శ్రాద్ధం పెడతాడు. పూర్ణిమ, అమావాస్య తిథులందు శ్రాద్ధం పెడితే శ్రేష్ఠం. కోరికలు తీరగలవు.
కృష్ణపక్షము అపర్ణాహము (పగలు పన్నెండు గంటల సమయాన్ని మూడు భాగాలు చేస్తే మూడవ భాగాన్ని అపర్ణాహము అంటారు – మధ్యాహ్నం రెండు గంటల తరువాత కాలం) అని భీష్ముడు చెబితే విని… శ్రాద్ధం ఏ వస్తువులతో చేస్తే మంచిదని అడిగాడు. దానికి భీష్ము డిట్లన్నాడు.
‘తిలపాయస ఘృతములు పితృకలనములకు నుత్తమములు గవ్యంబు మహా
ఫల మెదియైనన్‌ మత్యంబులు మాంసము విహత విధి బ్రభూత ఫలంబుల్‌’
యమ నందనా! నువ్వులు, పాయసము, నేయి శ్రాద్ధ కర్మలకు మేలైన వస్తువులు. ఆవుల నుండి ఏర్పడేది ఏదైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చేపలు, మాంసము శాస్త్రం విధించిన తీరు ననుసరించి మంచి ఫలితాలను ఇస్తాయి. గొర్రె, ఖడ్గ మృగం, గండ భేరుండం, మేక అను వాటి మాంసము ఒకదానిని మించి మరొకటి మేలైనవని శ్రాద్ధ తత్త్వం తెలిసిన పెద్దలు చెబు తారు. ధర్మరాజా! శ్రాద్ధం ఏ నక్షత్రంలో పెడితే ఏమి ఫలితం వస్తుందో కూడా చెబుతాను.
ధర్మరాజా! పితృకర్మలు కృత్తికా నక్షత్రంలో చేస్తే శత్రువులు పీడ వుండదు. రోహణిలో చేస్తే మంచి కొడుకులు కలుగుతారు. మృగశిరలో దేహబలం, ఆర్ధ్రలో క్రూరత్వం, పునర్వసులో సేద్యపు ఫలం, పుష్యమిలో పుష్టి, కలుగుతాయి. ఆశ్లేషలో గొప్ప శక్తిగల కుమా రులు కలుగుతారు. మఖలో వంశాభివృద్ధి, పుబ్బలో సౌభాగ్యం కలుతాయి. ఉత్తరలో సత్సంతానం, హస్తలో కార్యసిద్ధి, చిత్తలో అందమైన పుత్రులు, స్వాతిలో వర్తక వాణిజ్యాలు కలుగుతాయి. ధర్మరాజా! విశాఖ యందు మంచి పుత్రులు, అనూరాధ యందు ప్రభుత్వం, జ్యేష్ఠలో అధికారం పొందడం, మూలయందు ఆరోగ్యం, పూర్వాషాఢ యందు గొప్ప అభి వృద్ధి కలుగుతాయి. ఉత్తరాషాఢ యందు శోకం తొలగిపోతుంది. అభిజిత్తు నందు విద్యాభి వృద్ధి, శ్రవణంలో మోక్షం, ధనిష్ఠయందు రాజ్యం, శతభిషంలో కార్య ఫలం, పూర్వాభాద్ర లో మేకలు, గొర్రెలు వృద్ధి చెందుతాయి. ఉత్తరాభాద్రలో గోసంపద వృద్ధి చెందుతుంది. రేవతిలోనూ, అశ్వనిలోనూ, భరణిలోనూ శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే వరుసగా లోహ సమృ ద్ధి, అశ్వసంపద, ఆయువు వృద్ధి చెందుతాయ’ని ధర్మరాజుకు భీష్ముడు చెప్పాడు.
”తాతా! పితృదేవతల ఆరాధనకు యోగ్యులెవరు?”
”రాజా! దేవతా సంబంధమైన కార్యాలలో బ్రాహ్మణులను పరీక్షించ వలసిన అవసరం లేదు కానీ శ్రాద్ధకర్మలకు మాత్రం గట్టిగా పరీక్షించాలి. మంచి కులం, ప్రాయం, అందచం దాలు, స్వభావం, విద్య అను వాటి చేత ఉన్నతులనదగిన వారు శ్రాద్ధ కర్మలో పంక్తిని పవిత్రం చేసేవారు. ఈ గుణాలు లేనివారు పంక్తిని పాడు చేసేవారు అవుతారు. రాజా! జూదరి, విషం పెట్టేవాడు, వేదవిరోధి, వడ్డీ వ్యాపారి, గాయకుడు, కరణం, ఇల్లు తగుల బెట్టే వాడు, కుష్టురోగి, క్షయరోగి, అన్ని వస్తువులు అమ్మేవాడు, సోమం అమ్మేవాడు, సముద్ర వ్యాపారి, రాజోద్యోగి, బిడ్డలను పంచుకొన్న భార్యాభర్తలు, వ్యాపారం కొరకు పశువులను పెద్దఎత్తున పెంచేవాడు, మోసగాడు, దొంగ, శిల్పపు పనులు చేసి బ్రతుకు సాగించేవాడు వీరందరినీ పంక్తి దూషకులంటారు. ఇటువంటి వారు శ్రాద్ధ భోజనాలకు అనర్హులు.
తలకు గుడ్డ చుట్టుకొని, చెప్పులు వేసుకొని భోజనం చేస్తే ఆ తిన్న భోజనం రాక్షసుల పాలౌతుందని బ్రహ్మ స్పష్టంగా చెప్పాడు. వంటకాల మీద ఎన్నోవిధాల మైల సోకవచ్చు అట్టి వాటితో పితృకర్మలు చేస్తే ఆ ఫలం రాక్షసులు దక్కించుకొంటారు. అటువంటి వంటకాల మీద నువ్వులు చల్లితే అశుచిత్వంపోతుందని పెద్దలంటారు. శాంతుడు, వ్రతశీ లుడు, దాంతుడు, వేద బోధకుడు, భూత దయ కలవాడు, జ్ఞాన సంపన్నుడు, వ్యాకరణ, ధర్మశాస్త్ర, పురాణ, పరమాత్మ జ్ఞానము కలవారు శ్రాద్ధభోజన పంక్తులలో పవిత్రులు.
రాజా! ఎంత (ఎన్ని) మంచి గుణాలు వున్నా పగవారిని మాత్రం శ్రాద్ధ భోజనంలో భాగ స్వాములను చేయరాదు. శ్రాద్ధ పద్ధతులన్నీ చక్కగా తెలుసుకొని గొప్ప నిష్టతో శ్రాద్ధం ఆచ రించే పాపరహితుడు సంతోషంతో దేవ మార్గంలో ప్రయాణిస్తాడు.
ధర్మజా! బ్ర#హ్మమానస పుత్రుడైన అత్రివంశజుడు దత్తాత్రేయుడి కుమారుడు నిమి. అతని కుమారుడు శ్రీమంతుడను వాడు మరణించినప్పుడు ఆతనికి శ్రాద్ధం పెడుతూ భక్తితో తలచినంత మాత్రాననే అత్రి మహర్షి దయతో వచ్చి కార్యాలను పరిశీలించాడు. బ్రా#హ్మణు లు శ్రేష్ఠమైన వారు కావడం, శ్రేష్టమైన దర్భ ఆసనాలు, క్రియలన్నీ నువ్వులతో నిండుదనం కలిగివుండడం, ఆయా పనులకు తగినవిధంగా మంత్రాలు నడవడం వంటివి పరిశీలించి సంతృప్తి చెందాడు. అదేవిధంగా శ్రాద్ధంలో మునగ, ఉల్లి, అడవి మునగ చెడు మాంసా లు, సొరకాయ మలినమైన ఉప్పు, నల్ల జీలకర్ర, కరివేపాకు, గురజాకు, ఇంగువ పూర్తిగా లేకుండా ఉండడాన్ని చూసి సంతోషించాడు. కుక్క, బహిష్టు, భ్రష్టుడు, శూద్రుడు, శ్రాద్ధం జరిగే తావులలో తిరుగకూడదని వివ రించి శ్రాద్ధ విషయాలలో ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడంవలన మన్నననిస్తుందని, నిమికి పితృదేవతలెవరో చక్కగా తెలియజేసి, గడ్డి పంటల ధాన్యాలు, ఆరిగలు, నేరేడు పండు శ్రాద్ధానికి పనికిరావని, తుమ్మడం, ఏడవడం కూడదని, ప్రశాంతత కలిగి వుండాలని అత్రి నిమికి చెప్పాడు.
ధర్మరాజా! ఒకసారి చాలామంది మునులు శ్రాద్ధాలు చేశారు. భోజన పదార్థాలు ఎక్కువగా తినడం వలన పితృదేవతలకు అగ్ని మాంద్యం (అజీర్ణ వ్యాధి) కలిగింది. వారందరూ ఓషధులకు అధిపతియైన చంద్రుడి దగ్గరికి వెళ్లి తమ బాధను విన్నవించు కొన్నారు. ‘నేనేమీ చేయలేను మీరు బ్ర#హ్మ దగ్గరకు వెళ్ళండి’ అని చంద్రుడు వారితో చెప్పాడు. వారు అక్కడి నుండి వేగంగా బ్ర#హ్మ దగ్గరికి వెళ్లి తమకు కలిగిన కష్టాన్ని విన్న వించారు. అయన తన దగ్గరున్న అగ్నిని చూసి మీకు కలిగిన కష్టాన్ని యితడు తొలగిస్తాడ’ని చెప్పగా అగ్ని ‘ఇకపైన ఆహారాలను మీరు నాతో కలిసి తీసుకొంటే నేను వాటిని ఆరగిస్తానన్నాడు. అగ్ని ఆవిధంగా చెప్పగానే పితృదేవతలు అగ్నిని ముందుంచు కొని భోజనాలు చేసి జీర్ణించుకొని సంతోషం పొందారు. ధర్మరాజా! శ్రాద్ధం అగ్నిపూజలతో కలిసి చేస్తే అది ప్రశస్తమౌతుంది. పితృదేవతలు పరమానందం పొందుతారు. రాక్షసు లు అటువైపు చూడనైనా చూడలేరు. చక్కని ఆచారంతో, నిష్ఠతో జందెం కుడి భుజానికి మార్చుకొని భక్తితో తండ్రి, తాత, ముత్తాతలకు పూజలకు చేయాలి. గయలో పెట్టిన పిండం ప్రేతభావం పోగొట్టడమే గాకుండా పుణ్యగతిని ప్రసాదిస్తుంది. అందుకే ఒక్క కొడుకైనా గయకు వెళ్లి పిండం పెడతాడన్న ఆశతో కొడుకులు కావాలని కోరుకొంటారు.
రజస్వలకాని కన్యను వివాహం చేయడం, నల్లనిఎద్దును ఆబోతుగా వదలడం పితృ దేవతలకు ఎంతోఆనందాన్నిస్తాయి.ధర్మరాజా!” అని వివరించారు పితామహులు.

  • డా|| చదలవాడ హరిబాబు,
    9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement