Monday, April 29, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 4
భూమిరాపోనలో వాయు:
ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే
భిన్నా ప్రకృతిరష్టధా ||

తాత్పర్యము : భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఎనిమిది అంశముల సముదాయము నా భిన్నాప్రకృతి యనబడును.

భాష్యము : భగవద్విజ్ఞానము అనగా భగవంతుని యొక్క వ్యక్తిత్వాన్ని మరియు ఆయన యొక్క వివిధ శక్తులను విశ్లేషణాత్మకముగా తెలిసికొనుట. ప్రకృతి కూడా భగవంతుని యొక్క ఒక శక్తి మాత్రమే. శ్రీకృష్ణుడే మహావిష్ణువు, గర్భోదకశాయి విష్ణువు, క్షీరోదక శాయి విష్ణువులుగా విస్తరించి ఈ భౌతిక ప్రకృతి యొక్క అన్ని కార్యాలను పర్యవేక్షించుచూ ఉండును. ఈ విజ్ఞానము తెలియని జీవులు తామే భౌతిక ప్రకృతికి కారణమని, అధిపతులమని, ఆనందించే వారమని బ్రాంతి చెందుచూ ఉందురు. ముఖ్యముగా ఈ భౌతిక ప్రకృతి ఎనిమిది విధాలుగా వ్యక్తమవుతుంది. మొదటి ఐదు అయిన భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశము, వాటిలో ఐదు రకాల ఇంద్రియార్ధాలైన భౌతిక శబ్ధము, స్పర్శ, రూపము, రుచి మరియు వాసనను కలిగి ఉంటాయి. నేటి భౌతిక విద్య ఈ పదింటినీ తెలిసికొనుటకే పరిమితమైనవి. మనస్సును సైకాలజిస్టులు అర్థము చేసుకొనుటలో విఫలురగుచున్నారు. ఇక అహంకారమైనా ‘నేను’ ‘నాది’ అనేదే భౌతిక బంధనానికి కారణం. బుద్ధి, సమగ్రభౌతిక సృష్టియైన ‘మహతత్త్వానికి’ సంబంధించినది. ఈ ఎనిమిది శక్తుల నుండి ఇరువదినాలుగు భౌతిక మూలకాలు వ్యక్తమవుతాయి. అందరూ వీటిని సాంఖ్య శాస్త్రముగా అధ్యయనము చేయుదురేగాని, వీటికి మూలమైన శ్రీ కృష్ణుని అర్థము చేసికొనపోవుటచే వారు సరైన అవగాహనను పొందలేకపోవుచున్నారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement