Thursday, November 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 70
70
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాప: ప్రవిశంతి యద్వత్‌ |
తద్వత్‌ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ ||

తాత్పర్యము : సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి, తనయందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే కలత నొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు.

భాష్యము : సముద్రము అపారమైన నీటితో నిండి ఉంటుంది. వర్షాకాలములో నదులనుండి మరింత నీరు వచ్చి చేరుతుంది. అయితే సముద్రము ఎప్పుడూ నిండుగా ఉన్నా తీరమును మాత్రము దాటిరాదు. అదే విధముగా కృష్ణచైతన్యములో నున్న వ్యక్తి నిండుగా సంతృప్తిగా ఉంటాడు. ఈ భౌతిక శరీరము ఉన్నంతకాలము ఇంద్రియములు కోరికలను కోరుతూనే ఉంటాయి. అయితే కృష్ణుని సేవలో సంతృప్తిని పొందిన వ్యక్తి వాటిని తీర్చాలని కోరుకోడు. ఈ విధముగా అతడు నిశ్చలముగా ఉండగలడు. అదే ముక్తిని కోరుకొనువారు గాని, తమ కార్యములకు మంచి ఫలితాలు రావాలని ఆశించేవారు కాని, యోగ సిద్ధులను ఆశించేవారు కాని ఆరాటముతో ఉండుట చేత శాంతిని పొందలేరు. కాబట్టి, కృష్ణుని సేవలోనే ఆనందమును పొందుచున్న వ్యక్తి ఎంత శాంతిని పొంది ఉంటాడంటే, అతడు ముక్తిని కూడా కోరుకోడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement