Sunday, June 16, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 26

26
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే
సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్‌ విషయానన్య
ఇంద్రియాగ్నిషు జుహ్వతి

తాత్పర్యము : కొందరు (నిష్ఠ కలిగిన బ్రహ్మచారులు) శ్రవణాది కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనెడి అగ్ని యందు హోమము చేయగా, మరికొందరు (నియమితులైన గృహస్థులు)ఇంద్రియార్థములను ఇంద్రియములనెడి అగ్ని యందు అర్పింతురు.

భాష్యము : మానవ జీవితము ఇంద్రియ భోగమునకు కానందున మానవుడు క్రమేణా ఆధ్యాత్మిక జీవితములో పరిపూర్ణుడయ్యే విధముగా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అను నాలుగు ఆశ్రమాలను ఏర్పాటు చేయటం జరిగినది. గురువు ఆశ్రమములో ఉండి శిక్షణ పొందే విద్యార్థులను బ్రహ్మచారులు అందురు. వారు మనస్సును నిగ్రహించుట ద్వారా ఇంద్రియ భోగ వాంఛలకు దూరముగా ఉందురు. ఎల్లప్పుడూ కృష్ణునికి సంబంధించిన వచనములచే వినుట ద్వారా లౌకిక విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండరు. ఈ విధముగా భగవంతుని గురించి శ్రవణ, కీర్తనాదులందు నిమగ్నులై ఉందురు. అదే విధముగా ఇంద్రియ భోగమునకు అనుమతి కలిగి ఉన్న గృహస్థులు కూడా నియమముతో మైధున భోగము మరియూ ఇంద్రియ భోగమును పాటిస్తూ ఉన్నత ఆధ్యాత్మికలక్ష్యము కొరకు తమ సహజ నైజమును సైతమూ త్యాగము చేయుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement