Thursday, May 2, 2024

Flute Gift – అయోధ్య బాలరామునికి 21.6 అడుగుల భారీ వేణువు

అయోధ్యలో 22న జరిగే శ్రీరాముని ‍ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాలరామునికి దేశవ్యాప్తంగా పలువురు కానుకలు పంపుతున్నారు. ఈ క్రమంలో 21.6 అడుగుల పొడవైన భారీ వేణువును పిలిభిత్ నుంచి అయోధ్యకు పంపించనున్నారు. అత్యంత పొడవైన ఈ వేణువును పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, కుమారుడు అర్మాన్ నబీ, వారి బంధువు షంషాద్ తదితరులు వారి స్నేహితుల సాయంతో తయారుచేశారు. ఈ వెదురును చరిత్రకు గుర్తు చాలా ఏళ్లుగా దాచివుంచామని, ఇప్పుడిది వేణువు రూపంలో శ్రీరాముని చెంతకు చేరుతున్నదని హీనా పర్వీన్ తెలిపారు.

కాగా ఈ వేణువును హీనా పర్వీన్‌ స్థానిక్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు అప్పగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్త హరీష్ రౌతేలా ఈ వేణువుకు పూజలు చేశారు. ఈ వేణువును జనవరి 26న అయోధ్యధామానికి పంపనున్నారు. వేణువు తయారీదారులలో ఒకరైన అర్మాన్ మాట్లాడుతూ ఈ వేణువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డులో నమోదైందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలిచిందన్నారు. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామన్నారు. ఇటువంటి వెదురు ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదన్నారు. ఈ వేణువును తయారీకి 10 రోజులు పట్టిందని, ఈ వేణువును రెండు వైపుల నుండి వాయించవచ్చని తెలిపారు. దీని తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement