Sunday, May 5, 2024

ఇంద్రజిత్తు నాగపాశాలు విఫలమా?

రామలక్ష్మణ, సుగ్రీవ, హనుమ, అంగద, జాంబవంత నాయకత్వ సారధ్యంలో వానరులు లంకను నాలుగు వైపుల నుండి ముట్టడి చేసిన విషయాన్ని రాక్షసులు వెళ్ళి రావణుడికి చెప్పారు. రావణుడు కోపంగా తన మేడ ఎక్కి వానరు లు ఆక్రమించిన విధానం చూశాడు. భూమినే మింగేసే విధంగా వున్న ఈ వానరసేనను ఎలా చంపాల్నా అని ఆలోచించసాగాడు. ఇదిలావుండగా రామచంద్రమూర్తి ప్రాకార సమీప ప్రదేశానికి వెళ్ళి అన్నిపక్కలా రాక్షసులతో ఆవరించబడి, రక్షించబడి, ధ్వజాలతో అలంకరించబడిన లంకను చూశాడు.
శ్రీరాముడు విరోధులందరినీ నాశనం చేయమని అనుమతి ఇవ్వగా వానరులు సింహనాదాలు చేస్తూ, విచ్చలవిడిగా, వారివారి కి నచ్చిన రీతిలో రాక్షస సేనా సమూహాన్ని ఎదిరించారు. ప్రాణాల మీద ఆశ వదలుకుని రావణుడు చూస్తుండగానే బలాతిశయంతో వానర శ్రేష్ఠులు గుంపులుగా కోట గోడలను, ద్వారాలను, వనభూ ములను, నేలను చదరంగా నాశనం చేశారు. ఇలాచేస్తూ, జయం… జయం శ్రీరామచంద్రమూర్తికి, జయం… జయం లక్ష్మణుడికి, సుగ్రీవుడికి జయం… అని సంతోషంగా అరిచారు.
”రాక్షసులారా! యుద్ధానికి వెళ్ళండి” అని రావణుడు చెప్ప గానే సముద్రం పొంగి పొర్లినట్లు రాక్షస సేనలు వానరుల మీద పడ్డా రు. యుద్ధంలో రాక్షస సైన్యం ప్రకాశించింది. ఇంద్రజిత్తు అంగ దుడితో యుద్ధం చేశాడు. సంపాతి ప్రజంఘుడితో, జంబుమాలి #హనుమంతుడితో, మిత్రఘ్నుడు విభీషణుడితో, గజుడు తపనుడి తో, నీలుడు నికుంభుడితో, సుగ్రీవుడు ప్రఘసుడితో ఎదిరించి పోరా డారు. లక్ష్మణుడు విరూపాక్షుడిని అడ్డుకున్నాడు. ఇలా ఒకరి నొకరు ఎదిరించి దొమ్మియుద్ధం చేస్తుంటే నెత్తురు నేలమీద పారింది. మైం దుడు, ద్వివిదుడు, సుషేణుడు తదితరులు ద్వంద్వ యుద్ధంలో రాక్షసులను చంపారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. రాత్రి చీకట్లను వ్యాపింప చేసింది. ఆ అంధకారంలో వానర రాక్షసులకు యుద్ధం భీకరంగా జరిగింది. రాత్రుల్లో రాక్షసులకు బలం ఎక్కువ కాబట్టి వారు విజృంభించడం చూసి కోపించిన శ్రీ రామలక్ష్మణులు జడివానలాగా బాణాలు కురిపించి రాక్షసులను వధించారు. రామ లక్ష్మణుల శౌర్యం, రాక్షసుల పరాజయం చూసిన ఇంద్రజిత్తు, ప్రత్య క్ష యుద్ధంలో వీరిని జయించడం సాధ్యంకాదని, కనపడకుండా యుద్ధం చేద్దామనుకున్నాడు. అంగదుడి దెబ్బకు వెనుకడుగు వేసిన ఇంద్రజిత్తు తిరస్కరణీ విద్యను ఆశ్రయించి ఎవరికీ కనబడక తన వాడి బాణాలతో వానరులను బాధించాడు. ఆ సమయంలో రామచంద్రమూర్తి సుగ్రీవుడి దగ్గర నిలబడి హెచ్చరికగా వుండమని చెప్పాడు. ఇంతలో ఇంద్రజిత్తు వానరసేన మీద బాణాల వాన కురిపించాడు. రామలక్ష్మణులను కూడా ఇంద్రజిత్తు తన బాణా లతో బాధించసాగాడు. యుద్ధభూమిలో రామలక్ష్మణుల ఎదురు గా నిలుచుని వారిని జయించడం సాధ్యంకాదని తెలుసుకున్న ఇంద్రజిత్తు, మాయతో వారిని ఖండించాలని భావించి, వానరు లంతా చూస్తుండగా వారిని బాణాలతో కట్టివేయాలని ప్రయత్నం చేశాడు. తిరస్కరణీ విద్యా బలంతో ఎవరికీ కనబడకుండా ఆకాశా న్నుండి పరాక్రమం చూపుతున్న ఇంద్రజిత్తును అందరూ వెది కారు. వారెవరూ ఇంద్రజిత్తును చూడలేకపోయారు. ఇంద్రజిత్తు నాగాస్త్ర సమూహాలను ప్రయోగించి రామలక్ష్మణులను ఆ బాణా లతో కట్టిపడేసాడు. బాణాల గాయాలకు వారి దే#హం నుండి నెత్తు రు కారింది. రాముడు విల్లుతో సహా నేలమీద పడిపో యాడు. అన్న నేలమీద పడుకోవడం చూసి లక్ష్మణుడు కూడా తన ప్రాణం మీద ఆశ వదిలి బాణశయ్య మీద పడుకున్నాడు. వానరు లంతా వారిని సమీపించి దు:ఖపడ్డారు. కిందపడిపోయిన రామ లక్ష్మణులను చూసిన ఇంద్రజిత్తు సంతోషంగా రాక్షసులను చూసి ”రామలక్ష్మణు లు ఇద్దరూ బాణాలతో కట్టబడి నేలమీద పడి వున్నా రు. చూడండి” అనగానే భూమ్మీద పడి వున్న అన్నదమ్ములను చూసి వారు చని పోయారని రాక్షసులు భావించారు. వాస్తవానికి రామలక్ష్మణులు మూర్ఛపోయారు. ఆ అస్త్రాలకు కట్టివేయగలంత బలం మాత్రమే వుంది. మంత్రబలం తగ్గగానే కట్లు వూడిపోతాయి.
ఇంద్రజిత్తు వెళ్ళి తండ్రి రావణాసురుడికి రామలక్ష్మణులు ఇద్దరూ చచ్చారని చెప్పగా అతడు తన ఆసనం మీదనుండి లేచి, సంతోషంగా రావణుడు కొడుకును కౌగలించుకుని, ”ఎలా చంపా వు? ఏమి ఉపాయం చేశావు? చెప్పు” అని అడిగాడు. నాగపాశాలతో వాళ్లను కట్టేసానని, కాళ్లు- చేతులు కదిలించలేకుండా పడిపోయా రని చెప్పాడు ఇంద్రజిత్తు. రామలక్ష్మణుల వల్ల తనకు కలిగిన భయంపోయి రావణుడు సంతోషంగా కొడుకును పొగిడాడు.
రామలక్ష్మణులు ఇంద్రజిత్తు చేతిలో చనిపోయారని సంతో షంగా సీతాదేవికి చెప్పి, ఆమె నమ్మడానికి బలవంతంగానైనా పుష్ప క విమానం మీద కూర్చోబెట్టి యుద్ధ స్థలానికి తీసుకెళ్ళి వారిని చూపమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. రాక్షస స్త్రీలు సీతను విమానంలో యుద్ధభూమికి తీసుకెళ్లారు. రామలక్ష్మణులను చూసి దు:ఖించింది సీత. ఆమె దు:ఖం చూసి త్రిజట ”నీ భర్త మర ణించలేదు. ప్రాణాలతోనే వున్నాడు. రామలక్ష్మణులు మరణించలే దనడానికి సాక్ష్యం ఈ పుష్పక విమానమే! ఈ పుష్పకం దివ్య విమా నం. ఇది భర్త మరణించిన దానిని మోయదు. నీ భర్త మరణించి వుంటే నిన్నిది మోయ దు. కాబట్టి నీ భర్త మరణించలేదు. నా మాట నమ్ము.” అంది. సీతాదేవి, త్రిజటకు నమస్కరిస్తూ ”అమ్మా! నువ్వు చెప్పినదే వాస్తవం కావాలి” అంది. పుష్పక విమానం మరలింది.
రాముడు స్మృతి తెచ్చుకుని మూర్ఛపోయి వున్న తమ్ముడిని చూసి బాధపడి”ఇది బాణాల దెబ్బలకు నా తమ్ముడే మరణిస్తే, నిశ్చ యంగా నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడుస్తాను” అన్నాడు.
రామలక్ష్మణులు మాయా యుద్ధంలో పడిపోవడం విభీషణు డికి బాధ కలిగించి దు:ఖపడ్డాడు. విభీషణుడిని కౌగలించుకు నిసుగ్రీవుడు ”నువ్వే లంకను ఏలుతావు. రావణుడి కోరిక నెర వేరదు. దు:ఖపడవద్దు. వీరు మూర్ఛ నుండి లేవగానే రావణ సేనను, అతడిని చంపుతారు” అని ఊరడించాడు. ఆ తరువాత సమీపంలో వున్న సుషేణుడుని చూసి, రామలక్ష్మణులు మూర్ఛ తేరుకోగానే వారిద్దరినీ తీసుకుని కిష్కింధకు వెళ్ళమంటాడు.
జవాబుగా సుషేణుడు సుగ్రీవుడితో మృత సంజీవని విద్యతో కూడిన కొన్ని మూలికలు పాల సముద్రం సమీపంలో వున్నాయని, వాటిని సంపాతి, పనసుడు లాంటి వానరులను పంపించి తెప్పించ మని అంటాడు. లేదా ఆంజనేయుడిని పంపమంటాడు. ఇంతలో చెవుడు కలిగే పెద్ద ధ్వని వచ్చింది. మండుతున్న అగ్నిహోత్రుడి లాగా ప్రకాశిస్తూ గరుత్మంతుడు ఆకాశంలో కనబడ్డాడు. ఆయన కనపడగానే రామలక్ష్మణులను చుట్టుకున్న పాపపు పాములన్నీ చెల్లాచెదరై భయంతో పారిపోయాయి. గరుడుడు రామలక్ష్మణు లను సమీపించి వారి ముఖకమలాలను ముట్టుకోగానే వారి దేహా లకున్న గాయాలన్నీమానిపోయాయి. ఆయన ముట్టుకోగానే రామ లక్ష్మణులకు దేహబలం, బుద్ధి సూక్ష్మత వృద్ధి చెందాయి. దేహాలు బంగారుకాంతితో మెరిశాయి. గరుత్మంతుడు తానెవరో చెప్పాడు.
”మీకు తోడ్పడడానికి వచ్చాను. దానవులు, అసురులు, గంధ ర్వులు ఇంద్రుడిని ముందు వుంచుకుని వచ్చినా నీ శరబంధాలను వదిలించలేరు. ఎందుకంటే వీటిని ఇంద్రజిత్తు మంత్రాల వల్ల కలిగి న అద్భుత శక్తితో సృష్టించాడు. అప్పుడు విషంతో క్రూరమైన కోర లున్న సర్పాలు బాణాల్లాగా వచ్చి, మిమ్మల్ని బంధించాయి. ఈ వృత్తాంతం విని నీమీద వున్న స్నేహభావం వల్ల నేను అతి శీఘ్రంగా బయల్దేరి వచ్చాను. ఆ కట్లను విడిపించాను. రామచంద్రా! రాక్షసు లు మోస యుద్ధం చేస్తారు కాబట్టి నువ్వు అప్రమత్తంగా వుండాలి. మీరు ఋజుత్వాన్ని వదలక, వారి మాయలకు లోబడక, హెచ్చరిక గా వుండాలి. నేనెవరో యుద్ధం పూర్తయిన తరువాత తెలుసుకుంటా వు.ధర్మశాస్త్రం నీలాగా తెలిసిన వారెవరూ లేరు. రాక్షస సమూహా లను నాశనం చేసి నువ్వు పతివ్రత అయిన సీతను గ్రహిస్తావు” అని గరుడుడు వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులను అలా చూసిన వాన రులు సింహనాదాలు చేసారు. అవి విన్న రావణుడు ఉలిక్కి పడి విషయం కనుక్కోమని రాక్షసులను ఆదేశించాడు. స్వేచ్చగా యుద్ధ భూమిలో తిరుగుతున్న రామలక్ష్మణులను చూసిన రాక్షసుల ముఖాలు వెలవెలబోయాయి. రావణుడికిలా చెప్పారు. ”రాజా! ఇంద్రజిత్తు బాణాలతో కట్టబడిన రామలక్ష్మణులు తమ్ము కట్టిన తాళ్ళను తెంచుకుని ప్రకాశిస్తున్నారు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు, 8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement