Tuesday, May 14, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – గురువు(ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గురువు
అణుమాత్రాత్మకం దేహం షోడషార్ధం ఇతి స్మృతమ్‌
ఆద దీత యతో జ్ఞానం తం పూర్వం అభివాదయేత్‌

అణు మాత్రమైన దేహములో అయిదు పంచ భూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు అనే పదహారింటి నివాసం అని ఆ దేహం గురించి ఆ దేహములో ఉండే ఆత్మ గురించి ఆత్మలో ఉండే పరమాత్మ గురించి ఎవరి వల్ల తెలుసుకుంటామో ముందు అతనికి నమస్కరించాలి. అనగా షోడశ వికారములు కల శరీరాన్ని ఇచ్చిన వారు తల్లిదండ్రులు. ఈ శరీరంలో ఇవన్నీ ఉన్నాయని నీవు పూర్వ జన్మలో చేసుకున్న కర్మే నీకు ఈ శరీరాన్ని తల్లిదండ్రుల ద్వారా ప్రసాదించినది. కర్మ ఫలాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులు జ్ఞాన ఫలాన్ని ఇచ్చేవారు గురువు. అందువలన తల్లిదండ్రుల వద్ద ఉన్నపుడు మొదట వారికి నమస్కరించవలెను. వారు కాక తక్కిన వారు ఎవరున్నా మొదట గురువుకు నమస్కారం చేయవలెను. తల్లిదండ్రులు ఇచ్చినది అణుమాత్ర దేహం, గురువు ఇచ్చినది మేరువంత జ్ఞానము కావున గురువుకు ముందుగా నమస్కరించవలెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement