Saturday, May 18, 2024

ధర్మం – మర్మం – దీపావళి – వరాహావతారం (ఆడియోతో)

దీపావళి – వరాహావతారం విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ..

బ్రహ్మ మానసికంగా సంకల్పంగా శరీర అవయవాల నుండి పలు విధములుగా సృష్టి చేసి కూడ తాను అనుకున్న రీతిలో సృష్టి వృద్ధి చెందలేకపోవడం వలన తన శరీరాన్ని రెండు రూపములుగా అనగా స్త్రీ పురుష రూపంలో విభజించి స్త్రీ పురుషుల కలయికతో ప్రజా సృష్టి వృద్ధి పొందేలా సంకల్పించాడు. అలా వచ్చిన పురుషుడు స్వాయంభువ మనువు, ఆ స్త్రీ శతరూప.

ఆ విధంగా ఏర్పడ్డ మనువు బ్రహ్మ గారిని ఏమి సేవ చేయాలి అని విన్నవించగా ప్రజా సృష్టి వృద్ధి చెందించమని ఆజ్ఞాపించెను. అపుడు మనువు భూమి రసాతలంలో ఉందని సృష్టించబడిన వారు ఉండటానికి ఆశ్రయం కావాలి కావున భూమిని పైకి తెచ్చినట్టైతే ప్రాణుల సృష్టి అవ్యాహతంగా జరుగుతుందని విన్నవించెను. బ్రహ్మ తాను సృష్టించ బడిన వెంటనే తన చుట్టు ఉన్న నీటిని తాను త్రాగగా మరల నీరు వచ్చినదని ఈ భూమిని పైకి తేవడం తన పని కాదని తనని సృష్టించిన వారి పని అని పరమాత్మను ధ్యానించెను. శ్రీమన్నారాయణుడు బ్రహ్మ నాసికా రంధ్రం నుంచి అంగుష్టమాత్ర పరిమాణంతో ఆవిర్భవించాడు. అలా అవతరించిన స్వామి చూస్తూ ఉండగా మేరుశైలం అంత ఆకారంతో పెరిగి రసాతలంలోకి వెళ్లి అక్కడ ఉన్న భూమిని పైకి తీసుకొని వచ్చాడు. నీటిలో ఉన్న భూమి పైకి వచ్చిన రోజు చాలా మంది రోజు, సంస్కృతంలో మంచి అంటే ‘వర’ రోజు అంటే ‘అహ’ ఇలా ఆ స్వామిని ‘వరాహ’ అన్నారు. వరాహావతారం ప్రసిద్ధమైన అవతారం అనగా మంచి రోజు అవతరించినది. సకల ప్రాణులకు ఆవాస స్థానం ఏర్పడిన రోజు కావున అది మంచి రోజు. భూమి అవతరించిన సమయంలో దితి పుత్రుడైన హిరణ్యాక్షుడు భూమి తమదని ఎలా హరిస్తున్నావని అడ్డుపడగా అతనిని సంహరించాడు స్వామి. ఆ సమయంలోనే భయపడుతున్న భూమిని తన కోరల నుంచి సముద్ర జలంపైన నిలిపాడు. విశాలంగా వర్తులాకారంగా ఉన్నందున నీటిపై భూమి మునగలేదు.

స్త్రీ పురుష సమాగమం వలన సృష్టి పెరగాలని బ్రహ్మ సంకల్పించినందు వలన పెరిగిన సృష్టికి ఆవాసంగా భూమిని నీటిపై తేల్చి తానే ముందు బ్రహ్మ సంకల్పాన్ని అనగా తన సంకల్పాన్ని ఆచరింపదలచి భూదేవితో కొన్ని క్షణాలు ఏకాంతముగా గడిపిన సందర్భంలో పుట్టిన వాడు నరకాసురుడు. అయితే ఆదిదంపతులు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు భూదేవిలకు అసురుడు పుట్టుట కథ కొంచెం అసంబద్ధంగా కనపడుతుంది. కానీ భగవంతుడైనా తాను ఏర్పరిచిన శాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించినపుడు ఆ ఫలితాన్ని తాను కూడా అనుభవించి శాస్త్రం ఎంతటి వారికైనా అనుల్లంఘనీయమని బోధించడమే పరమోద్దేశ్యం. సంధ్యా సమయంలో స్త్రీ పురుష సమాగమం నిషిద్ధం. అది అసుర వేళ కావున నరకాసురుడనే అసురుడు పుట్టాడు. నరకాసురుడనే అసురుడిని సృష్టించాడు, హిరణ్యాక్షుడనే అసురుడిని సంహరించాడు. సంధ్యా వేళలోనే హిరణ్యాక్షుడిని సంహరించాడు, అదే సమయంలో నరకాసురుడిని ఆవిర్భవింప చేశాడు. తన దివ్యమైన కాంతిలో అన్ని లోకాలు ప్రకాశిస్తున్న సమయంలో ఆవిర్భవించిన వాడు నరకాసురుడు. నరకాసురుని పుట్టుక దివ్యమైన ప్రకాశంలోనే జరిగింది. నరకాసురుని సంహారం కూడా దీపాల కాంతిలోనే జరిగింది. అసలు వరహస్వామికి యజ్ఞ వరాహము అని పేరు. అయిదు యజ్ఞములను ప్రవర్తింప చేసిన వాడు వరాహస్వామి. అతని రోమములే దర్భలు. భూమిని పైకి తెచ్చిన తరువాత సముద్రంపై నిలిపి తన శరీరాన్ని ఒక సారి దులిపి తన గిట్టల సందున ఉన్న మట్టి ముద్దలను మూడుగా విభజించి పిండపితృ యజ్ఞం జరిపెను. తన నాలుక జ్వాలతోటి నాసిక సృక్‌ స్రువాలతోటి దేవ యజ్ఞాన్ని జరిపాడు. ఋషులకు భూదేవికి తత్త్వాన్ని బోధించి ఋషి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. భూమిలో తన సంకల్ప అనుగుణంగా పంట పండించి భూత యజ్ఞము, అతిథి యజ్ఞమును పూర్తి చేశాడు. ఈ విధంగా పంచ యజ్ఞ నిర్వాహకుడు వరాహ స్వామి.

అసలు దీపాల పండుగ దీపావళికి మూలం వరాహ స్వామి. ‘చంద్ర సూర్యౌచ నేత్రే’ అని తన కనులతో వెలుగును నింపిన వాడు వరాహస్వామి. నరక శబ్దానికి అర్థం ‘నర ‘క’ అని విడదీస్తే నర అనగా నశించనిది. న్యాయంగా నశించనిది ఆత్మ. ఆ ఆత్మకు ప్రకృతితో సంబంధం ఏర్పడినపుడు అనగా శరీరం ఏర్పడినపుడు శరీరం మాత్రమే కనపడుతుంది. ‘క’ అంటే ద:ఖం ‘క’ అంటే నరకం. ఆత్మ శరీరంలో ప్రవేశించినపుడు శరీర సంబంధంతో చేసే పుణ్యపాపాలతో స్వర్గ నరకాలు, సుఖ ద:ఖాలు కలుగుతుంటాయి. ఆత్మ శరీరంతో చేరి సంసారంలో ప్రవర్తించుటే నరకాసురుడు. ఆ శరీరం పోయినపుడు
మిగిలేది ఆత్మే కావున అది దివ్య జ్యోతి అందుకే నరకాసుర సంహారం దీపావళికి ప్రతీక.

- Advertisement -

ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఈ జీవాత్మ పరమాత్మను చేరే మార్గం ఏమిటి, అలా చేరడం వలన కలిగే ఫలితం ఏమిటి, అలా చేరకుండా ఆపుతున్నది ఏమిటి ఈ ఐదు తెలుసుకోవడమే దీపావళి పండుగను 5 రోజులు జరుపుకోవడం. మన ధనం పరమాత్మ ఆ పరమాత్మను పొందడానికి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అంత:కరణం 13 కవాలి, ఇదే ధన త్రయోదశి. ఈ 13తో పరమాత్మను తెలుసుకొని 14వ దైన శరీరాన్ని అంటే నరకాసురుని సంహరించడం నరక చతుర్ధశి. శరీరం ప్రకృతితో దూరం అయిన తరువాత జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. కావున అది అమావాస్య సూర్యచంద్ర సమాగమమే, అదే దీపావళి. ఇలా జ్ఞాన జ్యోతి వెలిగిన తరువాత పరమాత్మ సాక్షాత్కారంతో ప్రతి అడుగు అనగా ప్రతి పత్‌బలంగా ఉంటుంది. అదే బలి ప్రతిపత్‌. పరమాత్మ వైపు అడుగులు వేసిన తరువాత ఇక యముడు ద్వితీయ అంటే అప్రధానం అవుతాడు. ఇది యమ ద్వితీయ. ఈ విధంగా దీపావళి పంచ పర్వదినములకు వరాహావతారం, స్వాయంభువ మనువు, నరకాసురుడు మూల కర్తలుగా తెలుసుకొని ఆచరించి ఆనందించండి.

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement