Saturday, May 4, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 56
56
దు:ఖేష్వనుద్విగ్నమనా:
సుఖేషు విగతస్పృహ: |
వీతరాగభయక్రోధ:
స్థితధీర్మునిరుచ్యతే ||

తాత్పర్యము : త్రివిధ తాపములందును చలింపని మనస్సు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడును, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సుగల ముని అని చెప్పబడును.

భాష్యము : ఎప్పుడైతే వ్యక్తి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ: అనగా వాసుదేవుడైన కృష్ణుడి నుండే సర్వమూ వస్తున్నది అని తెలుసుకుంటాడో ్తడు తన మనో సంకల్పాలను వదిలివేసి స్థిర బుద్ధిని కలిగి ఉంటాడు. దు:ఖాలు వచ్చినప్పుడు భగవంతుడు కరుణతో నేను చేసిన పాపములకు ఎంతో తగ్గించి కొద్దిపాటి కష్టాన్నే ఇస్తున్నాడని గుర్తించగలుగుతాడు. అలాగే సుఖము వచ్చినప్పుడు, నేను దీనికి అర్హుడిని కాదు కేవలము భగవంతుని కృప వలననే ఇంత సౌకర్యము ఇవ్వబడినదని గుర్తించి మరింత సేవ చేయుటకు దానిని వినియోగిస్తాడు. భగవంతుని సేవ కోసము సాహసము చేసి రాగద్వేషాలకు అతీతముగా ఉంటాడు. ఇంద్రియ తృప్తికి అనుకూలముగా ఉంటే దానిపట్ల ఆకర్షణ, ప్రతికూలముగా ఉంటే ద్వేషము కలుగుతుంది. భగవంతుని సేవకు అంకితమైన భక్తుడు రాగద్వేషాలను పట్టించుకోడు కాబట్టి తన ప్రయత్నములు విఫలమైనప్పుడు కోపమునకు గురికాడు. అటువంటి భక్తుడు గెలుపు ఓటములకు చలించని స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement