Friday, May 10, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 29
29
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్‌
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య: |
ఆశ్చర్యవచ్చైనమన్య: శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్‌ ||

తాత్పర్యము : కొందరు ఆత్మను అద్భుతమైనదానిగా చూచుదురు. కొందరు దానిని అద్భుతమైనదానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అద్భుతమైన దిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు.

భాష్యము : అణు ఆత్మ పెద్ద ఎనుగు, పెద్ద మర్రి వృక్షములోనే కాక అతిసూక్ష్మమైన కీటకములోనూ ఉండుట ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అయితే నేటి ప్రజానీకం భౌతిక భావనల కారణముగాను, ఇంద్రియతృప్తిలో మునిగిపోవుట వలననూ ఆత్మ యొక్క అద్భుతమైన లక్షణాలను గుర్తించుటకు గాని అర్థము చేసుకొనుటకు గానీ సమయము లేకున్నది. కొంతమంది ఆసక్తితో శ్రవణము చేయాలనుకున్నా వారికి సత్సాంగత్యము కొరవడుచున్నది. ఆత్మ పరమాత్మల నడుమ ఎటువంటి భేదము లేదని తప్పు ద్రోవ పట్టించేవారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ జ్ఞానమును సరిగా అర్థము చేసుకుని, ఆత్మ, పరమాత్మ, శ్రీకృష్ణుల స్థితులను తెలుసుకున్న వ్యక్తి చాలా అరుదు. కేవలము అటువంటి శుద్ధ భక్తుల అకారణ కృప వలన మాత్రమే ఎవరైనా కృష్ణుడు దేవాదిదేవుడని గుర్తించి, ఆయన స్వయముగా భగవద్గీతలో వివరించినట్లు ఆత్మను అర్థము చేసుకోగలుగుతారు. జీవితాన్ని సార్దకము చేసుకొనుటకు ఇంతకు మించిన సులభమార్గము లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement