Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 71
71.
శ్రద్దావాననసూయశ్చ
శృణుయాదపి యో నర: |
సోసిముక్త: శుభాన్‌ లోకాన్‌
ప్రాప్నుయాత్‌ పుణ్యకర్మణామ్‌ ||

తాత్పర్యము : శ్రద్ధను, అసూయారాహిత్యమును గూడి శ్రవణము చేయువాడు సర్వపాప ఫలముల నుండి విడుదలను పొంది, పుణ్యకర్ములైనవారు నివసించు పుణ్య లోకములను పొందగలడు.

భాష్యము : 67 వ శ్లోకము నందు అసూయా పరులకు భగవద్గీత వివరించరాదని స్పష్టముగా తెలియజేయబడినది, అయితే భక్తులు బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు అందరూ భక్తులు కాకపోవచ్చును, అటువంటప్పుడు వారు ఎందుకు భగవద్గీతను బహిరంగముగా చెప్పుచున్నారు అని ప్రశ్నించవచ్చును. దానికి సమాధానము ఈ శ్లోకము నందు తెలియజేయబడినది. అందరూ భక్తులు కాకపోయినా, అసూయాపరులు కాకుంటే, వారు అటువంటి శ్రవణము ద్వారా పాపముల నుండి ప్రక్షాళన కావింపబడి పుణ్యాత్ములగుదురు. అటువంటి పరిస్థితిలో కృష్ణ చైతన్య సునాయాసముగా స్వీకరించే అవకాశము ఉంటుంది. అందుచేత భక్తులు భగవద్గీత వినే అవకాశము అందరికీ ఇస్తూ ఉంటారు. శుద్ధ భక్తులు కావాలనే ధృఢసంకల్పము లేకున్నా పుణ్యకర్మలను అనగా గొప్ప యజ్ఞ యాగాదులను నిర్వహించిన వారు చేరుకునే ధృవలోకానికి భగవద్గీతను వినే వారు కూడా చేరుకొందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement