Saturday, May 18, 2024

జ్ఞానశక్తిని మించినది ఆత్మశక్తి

జనకుడు ఒకసారి యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యుడు కూడా వెళ్ళాడు. యాగము పూర్తి అయిన పిమ్మట జనకుడు మహర్షి మండలిని ఉద్దేశించి ఇలా పలికాడు ”పూజ్యులైన ఓ! సమస్త ఋషిపుంగవులారా! మీలో ఎవరు ఈ యాగము యొక్క అత్రాంబూ లానికి అర్హులో వారు వచ్చి స్వీకరించండి” అని అభ్యర్థనగా తన మనసులోని మాటను వెలిబుచ్చాడు. ఆ అగ్రతాంబూలం ఒక గొప్ప ధనరాశులమయంగా అక్కడ పేర్చబడింది. కాని ఎవరూ దానిని అందుకోవడానికి సాహసించలేదు. అందరూ సంశయంతో మిన్నకుండి పోయారు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఆ అగ్రతాంబూలమును స్పృశించి తన శిష్యులతో ఆ మణిమయ ధనరాశులను తన గృహానికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. అంత మిగిలిన ఋషులు యాజ్ఞవల్క్యునితో జ్ఞాన వాదానికి దిగారు. చివరికి అందరూ ఓటమిని అంగీక రించారు. జనకుడు ఆయనకు ఉచితరీతిన ఘనమైన పూజలు అందించాడు. ఆ సమయము శుభమైనదిగా భావించి అనేక ఆధ్యాత్మిక విషయాలను జనకు నకు, ఆ విద్వత్‌ సభకు వెలువరించాడు.
గంగాతీరంలో నివసించే బ్రహ్మరాతుడు, సునంద అనే పుణ్యదంపతుల కు బ్రహ్మతేజస్సుతో జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. అయిదవ ఏట అక్షరా భ్యాసము, ఎనిమిదవ ఏట ఉపనయనము చేసిన తండ్రి గురువుగా అతనికి సమస్త వేదములు, శాస్త్రములు బోధించాడు. తరువాత ప్రధాన గురువైన వైశంపాయనుని వద్ద మిగిలిన వేదరహస్యాలు తెలుసుకున్నాడు. గురువుని మించిన శిష్యునిగా పేరుపొందాడు. దురదృష్టవశాత్తు గురువు కోపానికి గుర యిన అతడు సూర్యోపాసనతో శుక్లయజుర్వేదము, సరస్వతీ అనుగ్రహం వల న అనేక ఇతర విద్యలను నేర్చుకున్నాడు. కోరినపుడు అతనికి సరస్వతీ మాత ప్రత్యక్షం అయ్యేది. ఆయన భార్యపేరు కాత్యాయిని. ఆయనకు ముగ్గురు కుమా రులు కలిగారు. కాలాంతరంలో కాత్యాయిని అనుమతితోనే మైత్రేయిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈయన నుండి వాజసనేయ సంహిత అను శుక్లయజు ర్వేదము, జనకునికి బోధించిన స్మృతి బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి.
దేహాత్మ భావన అజ్ఞానం వలన కలుగుతుంది. ఈ జీవన మాయా గమ నంలో ఆత్మ ఒక్కటే శాశ్వతం. ఇంద్రియాలు, అనుభవాలు, భావాలు అనే జీవ భావం అంతా ఒక అజ్ఞానం. ఆత్మజ్ఞానమే అమృత తత్త్వం. మానవ అనుబంధా లు, ప్రేమలు ఇవన్నీ వారి వారి స్వార్థం కొరకు ఏర్పడినవే! ఒకరినొకరు ప్రేమిం చుకునేది వాళ్ళవాళ్ళ స్వార్థం కొరకే! తండ్రి తన సంతానాన్ని ప్రేమించినా, భార్యభర్తలు పరస్పరం ప్రేమించినా, తల్లి తన సంతానం కొరకు త్యాగం చేసినా, మిత్రుల కొరకు ఆరాటపడినా, తుదకు రాజు తన ప్రజలను ప్రేమించినా దానికి కారణం స్వార్థం. విచిత్రంగా ఇది అంతా నా కొరకే అనే భావనతో గడిచిపోతుంది. ఈ ‘నేను’ అనేదే ఆత్మ. ఆ ఆత్మానందం కొరకే ఈ ప్రేమంతా! ఎవరికి వారికి తెలి యకుండా ఈ ఆత్మభావనతోనే సంసారం పయనిస్తుం ది. అయితే ఇది నాది, నావల్లే ఇదంతా జరుగుతోంది, జరిగింది అనుకోవడం ఒక గొప్ప అజ్ఞానం. చివరకు సమస్తమూ చేరేది ఆ ‘ఆత్మ’నే అని తెలుసుకోవడమే జ్ఞానం అని తెలియచేస్తాడు యాజ్ఞవల్క్యుడు. ఎవరైతే సాత్త్విక గుణోపాసకులో వారికి ఈ రహస్యం వారి అనుభవంతోనే అవగతమవుతుంది. అందుకే వారు బ్రహ్మాత్మ భావనతో ఈ సకల చరాచరమంతా ఆత్మస్వరూ పం అని గుర్తిస్తారు. అందుకే ఆశ్రమాల్లో చివరిదైన సన్న్యాసం ఒక గమ్యంగా సనాతనం నొక్కి చెప్పింది.
సుమారు యాజ్ఞవల్క్యుని కాలము శ్రీకృష్ణ భగవానుని కాలము ఒకటేనని భావిస్తారు. సమస్త ఋషిలోకము ఈయనను యోగీంద్రునిగా గుర్తించింది. ఆత్మజ్ఞానులు ఈయనతో వాదించే నెపంతో ఎన్నో విషయాలను గ్రహించినట్లు చరిత్ర చెబుతోంది. వారిలో గార్గి ఒకరు. వచక్నుడను మహర్షి కుమార్తె గార్గి ఒకసారి యాజ్ఞవల్క్యునితో జ్ఞాన సంవాదం చేసింది. సృష్టిలోని పంచభూతము లలోని జలమునకు వ్యాపించే లక్షణము ఎక్కడి నుండి వచ్చింది? వాయువు వలన, వాయువునకు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం వలన, ఆకాశానికి ఆ శక్తి ఎక్కడిది? గంధర్వలోకం నుండి వచ్చింది. గంధర్వ లోకమునకు ఆది త్యుని నుండి, ఆదిత్యునకు చంద్రలోకం నుండి, చంద్రునకు నక్షత్ర లోకం, నక్ష త్రలోకమునకు వరుసగా దేవ, ఇంద్ర, ప్రజాపతి, బ్రహ్మలోకముల నుండి ఒక దానికొకటి ఆ శక్తి వచ్చినదని యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు. బ్రహ్మ లోకము నుండే ఈ సృష్టి రచన వస్తున్నపుడు ఆయనకు ఆ శక్తి ఎక్కడిది? ఈ విధంగా ప్రశ్నకు ప్రశ్నను అనుసంధానిస్తూ ప్రశ్నించసాగింది. చివరికి అది ‘ఊ’ అంటే వస్తుందా అనే చిన్నపిల్లల కథ లాగా తయారయింది. కాని గార్గి ఆ యో గీంద్రుని నుండి ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుందామనే ఉద్దేశ్యంతో ప్రశ్నించిం ది. దానికి ఆయన ఈ విధంగా ప్రశ్నించే నీ తల ఛిద్రమవుతుంది కాని సమాధా నం దొరకదు. ఎందుకంటే బ్రహ్మలోకములో బ్రహ్మండములను నిర్మించు భూతశక్తి ఉన్నది. ఆ శక్తి గురించి జ్ఞానము తెలుసుకునేది బాహ్యముగా ఉం టుంది. అంటే ప్రశ్న, సమాధానములకు అందుతుంది. ఆ బ్రహ్మలోక భూత ములను దాటి తెలుసుకోవలెనన్న ఆగమము, నిగమమమూ, అనుమానము, ప్రశ్నోత్తరములు, వాదములు, ప్రవచనములు ఇవి పని చెయ్యవు. బ్రహ్మలోక మునకు, దాని సృష్టి రహస్యమును దాటి తెలుసుకోవలెనన్న ఇంద్రియముల కు, ఊహలకు అసాధ్యము. ఎవరైన పరమాత్మ స్వరూపమును ఊహించి చె ప్పవలెనని ప్రయత్నించినచో వారి తల అనగా మెదడు, మనసు పతనమవు తుంది తప్ప సాధ్యము కాదు. కావున ఆత్మానుగ్రహముతోనే పరమాత్మ దర్శ నము లభిస్తుంది. దానికి ఎనలేని ఆధ్యాత్మిక సాధన అవసరము. మనోబుద్ధుల వలన అది సాధ్యము కాదు. బ్రహ్మలోకము వరకే జ్ఞానశక్తి పనిచేస్తుంది. ఆపైన ఆత్మశక్తి ద్వారానే తెలుసుకోగలమని యోగేంద్రుడైన యాజ్ఞవల్క్యుడు విశదపరిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement