Thursday, May 2, 2024

కన్నుల పండువగా అప్పన్నకురెండో విడత చందన సమర్పణ

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు అయిన సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నృసింహస్వామికి సోమవారం శాస్త్రోక్తంగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించారు. ఏడాది పొడవున సుగంద భరిత చందనం లో కొలువుండే సింహాద్రినాధుడు ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావి స్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చందనోత్సవంగా పిలవడం జరుగు తుంది. చందనోత్సవం రోజు భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిజరూప దర్శనం కల్పించి అదే రోజు రాత్రికి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించారు. ఇక సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా తెల్లవారు జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి పవిత్ర జలాలు తీసుకువచ్చి అభిషేకం జరిపారు. వేద మంత్రో శ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ స్వామికి మూడు మణుగుల చందనాన్ని సమర్పించడం జరిగింది. తదుపరి జ్యేష్ట, ఆషాడ పౌర్ణమి లలో మూడేసి మణుగుల చొప్పున ఏడాదిలో నాలుగు విడతల కింద 12 మణుగుల చందనం సమర్పించడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం అర్చక పరివారం ఆయా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించింది. వైశాఖ పౌర్ణమి సందర్భం గా సోమవారం సింహగిరి భక్తజన సంద్రంగా మారింది. అనేక ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారు నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement