Friday, May 3, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 4

4. నీ నాయం దొడబాటు మాట వినుమా, నీ చేత జీతంబు నే
గానిం బట్టక సంతతంబు మది వేడ్కం గొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలు తే
జీ నొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం. విను. నిన్ను నేను ఎంతో సంతోషంగా సేవించుకుంటాను. దానికి ప్రతిగా ఏగానీ జీతమైనా ఆశించను. గుఱ్ఱాలు, ఏనుగలు, ధనలు అక్కఱ లేదు. అంతశ్శత్రువులైన కామ క్రోధాదులకు నన్ను ఆధీనము చేయక కాపాడు. అది చాలు నాకు.
విశేషం: అంతశ్శత్రువులు : కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మానవుడు పుట్టినప్పుడు స్వచ్ఛంగా, నిర్మలంగా, ఉంటాడు. పసితనం నుండి ఎదుగుతున్నప్పుడు ఆత్మీయుల వలె చేరి, మనిషిని లోబరచుకునే గుణాలు ఈ ఆరు. ఇవి కంటికి కనపడవు, పైకి తేలవు. కనుక వీటిపై యుద్ధం చేయటం చాల కష్టం. ఇవి ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నవి, కలిసికట్టుగా ఉండేవి. విడిగా దొరకవు. గెలవాలంటే అన్నిటినీ కలిపి గెలవాలి. మిగిలిన ఐదింటికి మూలమైనది మొదటిదైన కామం. దాన్ని దాన్ని అదుపులో పెడితే మిగిలినవి క్రమంగా లొంగుతాయి. ఈశ్వరుణ్ణి ప్రార్థించిన క్షణాన్నే కామనిరాసనం జరిగి తానేమీ కోరను అని ఘంటాపథంగా చెప్పటం జరిగింది. ఈశ్వర సేవ సద్యః ఫలదాయకం.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇదికూడా చదవండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3

Advertisement

తాజా వార్తలు

Advertisement