Thursday, May 2, 2024

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు మోహినీ అవతార ఆవిర్భావంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
మోహినీ
క్షీరసాగర మదనం సమయంలో అమృత భాండాన్ని తీసుకుని ధన్వంతరి రాగా రాక్షసులు అతి వేగంతో అమృతభాండాన్ని అపహరించారు. ఖిన్నులైన దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థించగా వైరంతో కాక ప్రేమతోనే గెలవాలని తాను జగన్మోహిని రూపంలో అవతరించాడు. ఆమె ముగ్ధమోహన సౌందర్యానికి వివేకము కోల్పోయిన రాక్షసులు అమృతాన్ని సమంగా పంచమని అమృతభాండాన్ని మోహినికి అందించారు. అపుడు మోహిని ఒక వరుసలో దేవతలను మరొక వరుసలో రాక్షసులను కూర్చోబెట్టి ఎటువంటి చర్యకైనా అడ్డుపడకుండా కలహిచకుండా ఉంటేనే అమృతమును పంచుతానని ఒప్పందం కుదుర్చుకుని అమృతాన్ని కేవలం దేవతలకే పంచుతూ రాక్షసులను మాట్లాడకుండా నివారించింది. మూర్ఖులు కోరికతో లక్ష్యాన్ని వదులుతారు – బుద్ధిమంతులు ల క్ష్యం కోసం కోరికలను విడిచిపెడతారు. ఇదే రాక్షస, దైవిక స్వభాలకు మూలమని మోహిని సమస్త లోకాలకు చేసిన ఉపదేశం.

కేవలం అమృతాన్ని పంచడమే కాక రెండు ఛాయాగ్రహాలైన రాహుకేతులను సృష్టించడానికి వచ్చిందే మోహినీ అవతారం. సూర్యచంద్రుల గర్వాన్ని అణచడం, రాక్షసుల దురాశను తొలగించడం ప్రపంచానికి కావాల్సిన సమతుల్యాన్ని అందించి గోళ పరిరక్షణ, విశ్వ పరిరక్షణ, ప్రపంచ సంరక్షణ జరిపిన కమనీయ రమణీయమూర్తి మోహినీమూర్తి. అతివలు అందంతో ప్రళయాన్నే కాక ప్రమోదాన్ని, రక్షణను కల్గిస్తారని ఆశ, లోభం వదిలిపెడితే రక్షిస్తారు – అత్యాశ చూపితే శి క్షిస్తారని, స్త్రీకి చక్కని నిర్వచనం అందించిన అవతారం మోహినీ. వైకృతం, మధురం అనే సౌందర్య శాస్త్రాన్ని బోధించే 24 విభాగాలున్న 84000 శ్లోకాలతో ఒక అద్భుత గ్రంథాన్ని అందించి నది మోహినీ అవతారం.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement