Saturday, May 18, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

61.అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమే, మేనంతా భయభ్రాంతమే
యంతా నాంత శరీరశోషణమే దుర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్ను దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం
శ్రీకాళహస్తీశ్వరా!, దేహికిన్ – శరీరధారికి, అంతా – అంతయు, (ప్రతివిషయంలో), సంశయము్శ ఏ – సందేహమే, శరీరఘటనంబు – శరీరస్థితి, శరీరపు కూర్పు, అంతా – అంతయు, విచారంబు – ఎ – ఆలోచించ దగినదే (నిశ్చయంగా చెప్పటానికి వీలు లేనిది), లోన – అంతా – మనసు నందంతా, దుఃఖ – శోకాల, పరంపర – అన్వితము – ఏ – వరుసలతో కూడుకొన్నదే , మేను – శరీరం, అంతా – అంతయు, భయభ్రాంతము – ఏ – భయముతో, భ్రమతో నిండినదే, అంతా – ఈ సంసారం (లోకవర్తనం), న – అంత – అంతం లేని, శరీరశోషణము – ఎ – దేహపీడయే, దుర్వ్యాపారము – ఏ – చెడ్డపనులు చేయటమే, నరుల్ – మానవులు, చింతన్ – భావనలో, (చిత్తము నందు), నిన్ను – నిన్ను (శివుణ్ణి),తలంచి – ధ్యానించి, పొందరు – చేరుకోరు.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! శరీరధారి అయిన జీవుడికి ప్రతివిషయం కూడా సంశయమే. (ఇది ఇటువంటిది అని గట్టిగా చెప్పటానికి వీలు లేదు) శరీరం యొక్క కూర్పు అంతా ఆలోచించ దగినదే. ( ఎంత కాలం ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు కదా!) మనసంతా దుఃఖాల పరంపరలే. (దారాపుత్రాదుల సంబంధాల వల్ల దుఃఖమే తప్ప మరేమీ లేదుకదా!) శరీరం ఎప్పుడు రోగాదుల కారణంగా భయంతో కూడుకున్నదే. ఏ పని చేసినా అంతులేని దేహపీడయే, చెడుపనులు చేయటమే. అన్ని తెలిసి కూడా, మానవులు ఎందుకనో చిత్తంలో నిన్ను తలచి, నిన్ను చేరుకోరు.

విశేషం:
ఈ పద్యం కూడా మానవుల అజ్ఞానానికి వెత చెందుతూ చెప్పినదే. శరీరధారి శరీరం, సంబంధాలు అన్నీ అశాశ్వతా లని తెలిసి కూడా దుర్వ్యాపారం చేస్తాడని జాలి పడతాడు కవి.

దుర్వ్యాపారాలు:
భగవంతుణ్ణి చేరటానికి చేసే పనులన్నీ సద్వ్యాపారాలు లేక పుణ్యకార్యాలు. అవి కాక బ్రతుకుతెరువు కోసం ఇతరులని బాధించే పనులన్నీ, భగవంతుడి ధ్యాస లేని పనులన్నీ దుర్వ్యాపారాలు. ఇవన్నీ కర్మబంధాలు కలిగించి, పునర్జన్మలకి కారకాలవుతాయి కనుక ఇవి దుర్వ్యాపారాలు.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement