Friday, April 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – 3 (ఆడియోతో..)

మహాభారతంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

విత్తం బంధు: వయ: కర్మ విద్య భవతి పంచమి
ఏతాని మాన్య స్థానాని గరీయో యద్యదుత్తరమ్‌

ధనము, బంధువు, వయస్సు, కర్మ, విద్య ఈ ఐదు గౌరవించదగినవి. వీటిలో ముందు దాని కంటే తరువాతి దానిని ఎక్కువగా గౌరవించాలి.

ధనవంతుడు, బంధువు ఇరువురు ఒకసారి కనబడితే మొదట బంధువును తరువాత ధనవంతుడని గౌరవించాలి. ఉదాహరణకు శ్రీకృష్ణుడిని కలవడానికి దుర్యోధనుడు, అర్జునుడు వచ్చినపుడు రాజ్యము, సంపాదన గల దుర్యోధనుడు ధనవంతుడు మరియు మేనత్త కొడుకు అయిన అర్జునుడు బంధువు కావున శ్రీకృష్ణుడు బంధువైన అర్జునుడిని ముందుగా పలుకరించెను.

బంధువు, వయోధికుడు ఇరువురు కనబడినపుడు ముందుగా వయోధికుడిని తరువాత బంధువుని పలుకరించవలెను. ఉదాహరణకు కృష్ణుడు రాయబారానికి వచ్చినపుడు మొదట వయోధికుడు, ధర్మబద్ధుడైన భీష్ముడికి తరువాత దృతరాష్ట్రుడికి నమస్కరించెను.

- Advertisement -

ధనవంతుడు, బంధువు, వయోవృద్ధుడు ముగ్గురూ ఉన్ననూ సత్కర్మ ఆచరించిన వారు కనబడినచో ముందుగా వారిని గౌరవించి తదుపరి ఇతరులను గౌరవించవలెను. వీరందరి కంటే ముందు విద్యావంతుడిని గౌరవించి తరువాత త క్కిన వారికి నమస్కరించవలెను. ఉదాహరణకు శ్రీసుఖులు భాగవతం చెప్తుండగా నారదులు శ్రీసుఖునకు నమస్కరించిరి . నారదుడు దేవర్షి, యోగనిష్ఠుడు, జ్ఞాన నిష్ఠుడు, తపో నిష్ఠుడు, విద్యా నిష్ఠుడు అయిననూ చిన్నవాడైన సుఖయోగి బ్రహ్మనిష్ఠుడు కావున నమస్కరించెను.

‘శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం ‘అని శ్రుతి వాక్యం. ఈ విధంగా ధనము కంటే బంధుత్వము, బంధుత్వము కంటే వయస్సు, వయస్సు కంటే సత్కర్మ, అన్నింటి కంటే విద్య గౌరవించబడినది అని తాత్పర్యం..

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement