Monday, May 6, 2024

ధర్మం – మర్మం : నృసింహ జయంతి (ఆడియోతో…)

శ్రీమన్నారాయుణుని అనేక అవతారాలలో ప్రసిద్ధమైనది, చాలా మహిమను చూపినది నరసింహ అవతారం. అసలు నరసింహావతార ప్రయోజనం హిరణ్యకశిపుని సంహరించుటకు ప్రహ్లాదుని రక్షించుటకు అని అందరికీ తెలిసిన విషయమే అయినా ఆ అభిప్రాయం సరి యైనది కాదని భాగవతం ద్వారా తెలుస్తోంది.

హిరణ్యకశిపుని సంహరించుటకు, అలాగే ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి సంకల్పం చాలు వైకుంఠం నుండి దిగి రావలసిన అవసరం లేదు. అక్కడే ఉండి హిరణ్యకశిపుని ‘ధ్వస్థోభవ’ అనగా నశింపుము అని పలికితే హిరణ్యుడు మరణిస్తాడు. అయితే హిరణ్య కశిపుడు బ్రహ్మను నుండి చాలా వరాలు పొందాడు కావున ఆ వరాలు కాదని స్వామి ఎలా సంహరిస్తాడనే సందేహం కలుగుతుంది. వాస్తవముగా బ్రహ్మ సృషించిన వాటితో తాను మరణించకూడదని హిరణ్యకశిపుడు పొందిన వరం. కానీ శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సృష్టికాదు కావున అతని వల్ల హిరణ్యకశిపుడు మరణించడానికి బ్రహ్మ వరము అడ్డురాదు. నరసింహస్వామి వైకుంఠం నుండే హిరణ్యకశిపుని సంహరించవచ్చు కానీ తాను అవతారం ధరించాల్సినవసరం గూర్చి భాగవతం, సప్తమ స్కందంలో ఈవిధంగా తెలుపబడింది.

సత్యం విధాతుం నిజభృత్య భాషితమ్‌
వ్యాప్తించ స్వస్య అఖిల భూత గమ్యతామ్‌
అదృశ్యత అత్యద్భుత రూపం ఉద్వహన్‌
స్తంభే సభాయాం న మృగం న మానుషమ్‌

అనగా తన భ క్తుడు చెప్పిన మాటను నిజం చేయడానికి తన సకల భూత వ్యాప్తిని నిరూపించుకొనుటకు నరసింహ స్వామి ఆవిర్భవించెనని పై శ్లోకానికి తాత్పర్యం.

ఇందులో ఎక్కడా హిరణ్యకశిపుని సంహరించుటకు అన్న ప్రస్తావన లేదు కావున భక్తుల మాటను నిజం చేయడానికే నరసింహావతార ఆవిర్భావం జరిగిందని తెలుస్తోంది. ఇక్కడ భక్తుడు అనగా ప్రహ్లాదుడు. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు ‘ఇందుగలడు అందులేడ ని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడ’ని చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో స్వామిని చూపుతావా అని అడగగా చూపుతానని ప్రహ్లాదుడు సమధానమిచ్చాడు . హిరణ్యకశిపుడు తన అరచేతితో స్తంభాన్ని గట్టిగా కొట్టగా పగిలిన ఆ స్తంభంలో స్వామి కనబడకుంటే భక్తుడైన ప్రహ్లాదుని మాట అబ ద్ధమని తేలితే ఇక ప్రపంచంలో భక్తుల పరిస్థితి ఏంటీ అని తలచాడు స్వామి. ప్రహ్లా దునికి హరి సర్వాంతర్యామి అని ఉపదేశించనది నారద మహర్షి అలాగే నారదునికి భగవతత్త్వాన్ని చెప్పినది అతడి తండి బ్రహ్మ వీరంతా స్వామి భక్తులే కావున వారి మాటను నిలబెట్టడానికి స్వామిని తలచగాన్నే సాక్షాత్కరించాడు.

- Advertisement -

సాక్షాత్కరించకుండా అదృశ్య రూపంలోనే స్తంభంలో ఉండి ఏ తేజోరూపముగానో ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించవచ్చు కానీ స్వామి ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ” అని స్వామి గీతలో చెప్పారు. పరమాత్మ అవతారానికి ప్రధాన ప్రయోజనం తన భక్తులయిన సజ్జనులను ఆపదల నుండి కాపాడుట. ఆపద అనగా సంపద లేకపోవడమో, ఇల్లు లేకపోవడమో కాదు భక్తులకు నిజమైన ఆపద భగవంతుడు కనబడకపోవుట. ఆ భగవంతుని దివ్యమైన రూపాన్ని ఒక్క నిమిషం కూడా చూడలేకపోయినా భక్తులు బతుకజాలరు. ‘త్రుటి యుగాయతే త్వామపశ్యతామ్‌’ అనగా ఒక్క క్షణం లో 60వ భాగము నీవు కనబడకున్నా మాకు అది ఒక యుగముతో సమానమని గోపికలు పలికిరి. అలాంటి భక్తులకు స్వామికి ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా తృప్తి చెందరు కావున తన స్వరూపాన్ని కనులకు అందించాలి. కావున భక్తులను కాపాడ టమే నృసింహావతార పరమార్ధం.

పైరు మధ్యన పెరిగే కలుపు మొక్కలు దిగుబడిని తగ్గిస్తాయి కావున వాటిని నిర్మూలిస్తాము. వ్యవసాయానికి ప్రధాన ప్రయోజనం పంట పండించడమే కానీ కలుపు మొక్కలను తీయడం కాదు. అలాగే దుష్ట శిక్షణా అనేది స్వామికి అప్రధానమైనది. ప్రహ్లాదుని రక్షణకు, ఆయన మాట నిలబెట్టుటకు అవతరించి, పిలిస్తే పలికి ఆపదలు తొలగించే దైవంగా నరసింహస్వామి ప్రసిద్ధి అని పురాణ ఉవాచ.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement