Friday, May 17, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 5

ఋషిభిర్బహుధా గీతం
ఛందోభిర్వివిధై: పృథక్‌ |
బ్రహ్మసూత్ర పదైశ్చవ
హేతుమద్భిర్వినిశ్చితై: ||

తాత్పర్యము : క్షేత్రము, క్షేత్రజ్ఞులను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందూ కార్యాకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది.

భాష్యము : భగవంతుణ్ని మించిన ప్రమాణమే లేదు. అయినప్పటికీ శ్రీ కృష్ణుడు ప్రామాణికులైన ఋషులు, మునుల అభిప్రాయములను, శాస్త్రాల అభిప్రాయమును పరిగణలోకి తీసుకుని క్లిష్టమైన ఆత్మ పరమాత్మల నడుమ గల సమానత్వాన్ని మరియు భేదాన్ని నిరూపించుచూ ఉన్నాడు. వేదాలను, వేదాంత సూత్రాలను రచించిన వ్యాసదేవుడు మరియు అతని తండ్రియైన పరాశరముని కూడా గొప్ప ప్రామాణిక ఆచార్యులు. ప్రత్యేకించి కంఠోపనిషత్తు నందు ఆత్మ, పరమాత్మ మరియూ ఈ శరీరము వేర్వేరని సుస్పష్టముగా తెలుపటమైనది. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురునూ దివ్యమైనవారే అయినప్పటికీ ఆత్మ అజ్ఞానమునకు లోనై త్రిగుణముల ప్రభావము చేత కర్మలు చేసి ఉన్నత, నీఛ స్థితులలో శరీరములను పొందుచూ ఉండును. అయితే పరమాత్మ ఎప్పటికీ అజ్ఞానముచే ప్రభావితము కాక దివ్యస్థితిలోనే స్థిరముగా నుండును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement