Friday, May 3, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 3
3.
సత్త్వానురూపా సర్వస్య
శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయోయం పురుషో
యో యచ్ఛ్రద్ధ: స ఏవ స: ||

తాత్పర్యము : ఓ భారతా! మనుజుడు వివిధ గుణముల యందలి తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పొందుచుండును. అతడు పొందిన గుణములను అనుసరించి అతడు ఒకానొక శ్రద్ధను కూడియున్నాడని చెప్పబడును.

భాష్యము : ప్రతి ఆత్మ భగవంతుని అంశ అగుటచే దివ్యమైనది. కానీ భగవంతునితో తనకకు గల సంబంధాన్ని మరచి పోవుటచే భౌతిక గుణ సంపర్కములోనికి వచ్చి కృత్రిమమైన లేదా కలుషితమైన శ్రద్ధను పొందుతాడు. కృష్ణ చైతన్య మార్గము ఓక్కటే అతనిని తిరిగి కృష్ణునితో గల సంబంధమును పునరుద్ధరించి దివ్య స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలదు.

శుద్ధ సత్వములోని శ్రద్ధ దివ్యమైనది. ఆ స్థితిలోనే భగవంతుణ్ని వాస్తవముగా అర్థము చేసుకొనగలుగుతారు. కానీ బద్ధ స్థితిలో ఏ కార్యము చేసినా త్రిగుణముల కలుషితము ఉంటుంది. ఏ గుణ సంపర్కములో ఎక్కువగా పని చేస్తే ఆ విధముగా హృదయము కలుషితమవుతుంది. కాబట్టి వేరు వేరు వ్యక్తుల యొక్క శ్రద్ధ సత్వగుణములోనూ, రజోగుణములోనూ, తమోగుణములోనూ ఉన్నట్లు కనిపిస్తుంది. అందువలన మనము ఈ ప్రపంచములో వేరు వేరు విశ్వాసాలను, మతములను చూడవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement