Monday, April 29, 2024

ఆషాడమాసంలో మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు..

హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాడ మాసం పూర్త య్యేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలంటూ ఉంటారు. మనకు సాధారణంగా వర్షాలు జేష్ఠ మాసంలో మొదలై ఆషాడ మాసం వరకు ఊపందు కుంటాయి. ఈ కాలంలో ప్రజలు తరచుగా వర్షపునీటిలో నానక తప్పదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది పొలం పనులు చేసుకునే వారు కాబట్టి చెరువులు, కాలవలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. కాళ్లు చేతులు తడవకుండా ఈ పనులు చేయలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చేతి మరియు కాలి గోళ్ళు దెబ్బ తినడం జరుగుతుంది. ఆషాడ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉండడం, ఆ కాలంలో చెట్టుపై గల ఆకులను కోయడం వల్ల చెట్టు కు ఎలాంటి హానీ జరగదు. అంతేగాక లేత ఆకులను బాగా దంచి చేతులకు పెట్టుకోవడం వల్ల చేతులు ఎర్రగా పండుతాయి. గోరింటాకు కాళ్లకు ,చేతులకు అందరూ కూడా పెట్టుకుంటారు. గోరింటాకు యాంటీ బ్యాక్టీరియా లాగా కూడా పని చేస్తుంది. గోరింటాకును సాంప్రదాయబద్ధమైన చుక్కలు, చంద్రుడు, పూల నమూనా లాగా పెట్టుకుంటారు. వాస్తు, జ్యోతిష శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఆషాడం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పోయి ఆకస్మాత్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మానవ శరీరంలో కఫా సంబంధమైన దోషాలు ఏర్పడతాయని అంటుంటారు. గోరింటాకు కు మన శరీరంలోని వేడిని తగ్గించే గుణం కూడా ఉంటుంది. అలాంటి సమ యంలో బయటి వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని
కూడా చల్లబరచి దోషాల నుండి తొలగించుటకు గోరింటాకు దోహ దం చేస్తుందని నమ్మకం. గోరింటాకు కేవలం ఆషాడ మాసం లోనే కాక పెళ్లిళ్లు, పర్వదినాల్లో సైతం మహిళలు ,పిల్లలు పెట్టు కుంటారు.ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, బెరడు, విత్తనాలు, మొక్కల వేళ్ళు కూడా ఔషధ గుణాలు కలవే. గోరింటను ఆయుర్వేద నిపుణులు పొడిచేసి, కాచిన నూనెలో కలిపి చిట్కా వైద్యం కూడా చేస్తారు. గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసొన్‌ అనే రసాయనిక పదార్థం వల్ల అది ఎరుపు రంగు గా మారుతుంది. ఆషాడమాసంలో కొత్త పెళ్ళి కూతుళ్ళు పుట్టింటికి పోవడం ఆనవాయితి. ఆ సమయంలో గోరింటాకు తమ చేతిలో పట్టించుకుంటే తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుందని, పుట్టినింట ఉన్న ఆడవారి మనసు , మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉందని అంటారు పెద్దలు. అరచేతికి కాళ్లకి కాకుండా , కాళ్లు చేతి గోళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వలన బాగా కనిపించడమే కాకుండా వాన కాలంలో గోళ్లు పెలుసు బారిపోకుండా , గోరుచుట్టూ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
కానీ ప్రస్తుత కాలంలో ప్రకృతి సిద్ధమైన గోరింట చెట్టు ఆకులతో తయారైన గోరింటాకు ని వాడకుండా , రకరకాల రసాయనతో కత్రిమంగా తయారుచేసే ,కోన్లను ,వాడుతున్నారు. వీటివల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆషాడమాసంలో ప్రకతిలో లభించే ప్రకతి సిద్ధమైన గోరింటాకు వాడితే మంచిది. పూర్వకాలపు మహిళలు, ప్రస్తుత కాల మహిళలకు ప్రాచీనకాలం ఆచార సంప్రదాయాలు తెలియజేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది.


– కామిడి సతీశ్‌ రెడ్డి,
9848445134

Advertisement

తాజా వార్తలు

Advertisement