Monday, May 6, 2024

ఆగ‌స్టు 4 నుండి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి : తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 4 నుండి 6వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఆగ‌స్టు 3న ఉద‌యం ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సేనాధిప‌తి ఉత్స‌వం, మేదినిపూజ‌, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా ఆగ‌స్టు 4న‌ మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ట‌, శయనాధివాసం, ఆగ‌స్టు 5న రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగ‌స్టు 6న మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం జ‌రుగ‌నుంది. సాయంత్రం భాష్య‌కార్ల స‌న్నిధిలో ఆస్థానం చేప‌డ‌తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement