Thursday, April 25, 2024

విద్యుత్‌ కార్ల మార్కెట్‌లో గట్టి పోటీ.. మార్కెట్‌లోకి వస్తున్న బడా కంపెనీలు

మన దేశ విద్యుత్‌ కార్ల మార్కెట్‌లో రానున్న రోజుల్లో గట్టి పోటీ ఏర్పడనుంది. పలు కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించడంతో పోటీ పెరగనుంది పరిశ్రమ వర్గాలు అంచన వేస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ వల్ల నాణ్యమైన, మెరుగైన పనితీరును కనబరిచే కార్లకు ఆధరణ దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. విస్తృతమైన దేశీయ మార్కెట్‌లో ఎక్కువ వాటా సాధించేందుకు కంపెనీలు వినూత్నమైన, ఆధునిక ఫీచర్లతో కూడిన కార్లను మార్కెట్‌లో విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ మార్కెట్‌ ప్లాన్స్‌ను ప్రకటించాయి. ముందుగా ఈ రంగంలో ప్రవేశించిన టాటా మోటార్స్‌ ఈవీ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. టాటాకు చెందిన నెక్సాన్‌ అత్యధికంగా అమ్ముడవుతన్న కారుగా నమోదైంది. ఈవీ కార్ల మార్కెట్‌లో 2024 కల్లా ఐదు ఎస్‌యూవీ మోడల్స్‌ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్‌ కూడా 2024 కల్లా కారును భారత్‌ మార్కెట్‌లో తీసుకు వస్తామని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్‌ కారు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్లు వస్తుందని ఇతర కంపెనీలకు సవాల్‌ విసిరింది. మహీంద్రా కంపెనీ భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఒకేసారి ఈ కార్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.

మరో కంపెనీ వోక్సావ్యాగన్‌ కూడా దేశీయ మార్కెట్‌లో విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టనుంది. మహీంద్రా కంపెనీ ఎం అండ్‌ ఎంతో పాటు, బీఈ బ్రాండ్‌తోనూ ఈవీ కార్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తుంది. ఓలా కారు ఎంట్రీ లెవల్‌తో పాటు, ప్రీమియం సిగ్మెంట్‌లోనూ విద్యుత్‌ కార్లను తీసుకు వస్తుంది. ముందుగా మార్కెట్‌లోకి వచ్చిన టాటా కంపెనీ ప్రస్తుతం మంచి స్థితిలో ఉంది. ఈ కంపెనీ కూడా మరిన్ని మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకు రానుంది. ఏప్రిల్‌లో కంపెనీ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీ ఎలక్ట్రికల్‌ కారు కర్వ్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ కారు 400 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని టాటా మోటార్స్‌ వెల్లడించింది. వీటితో పాటు ఎంజీ కంపెనీ ఇప్పటికే జడ్‌ఎస్‌ ఇవీ పేరుతో కారును మార్కెట్‌లో విడుదల చేసింది. హుండాయ్‌ కంపెనీ కోనా పేరుతో కారును ఇప్పటికే విక్రయిస్తోంది. మారుతి సుజుకీ కూడా 2025లో తన తొలి ఈవీ కారును విడుదల చేయనుంది. ఈవీ వాహనాల అమ్మకాలు పెరిగేందుకు ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య భారీగా పెరగాల్సి ఉంది. ఇందు కోసం కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ప్రభుత్వ రంగంలోని పెట్రోలియం కంపెనీలు తమ బంకుల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఓలా కంపెనీ కారును మార్కెట్‌లోకి తీసుకురావడంతో పాటు, అన్ని ప్రధాన నగరాల్లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వీటితో ఎక్కువ మైలేజీ ఇచ్చేందుకు అనువైన బ్యాటరీలను సైతం అభివృద్ధి చేసేందుకు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2024 నుంచి మన దేశ ఈవీ కార్ల మార్కెట్‌లో గట్టి పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విస్తరమైన మన దేశ మార్కెట్‌లో తగిన వాటా సాధించేందుకు కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement