Thursday, May 2, 2024

భారత్‌లో తగ్గిన పేదరికం, 12.30 శాతం నమోదు.. మెరుగుపడిన పరిస్థితులు

భారతీయులకు ఇది కొంత ఊరట ఇచ్చే అంశమే.. ప్రపంచ బ్యాంకు చేసిన ప్రకటన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. భారతదేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందని ప్రపంచ బ్యాంకు ఆదివారం ప్రకటించింది. భారత్‌లో పేదరికం 12.3 శాతం తగ్గిందని వెల్లడించింది. 2011తో పోలిస్తే.. 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం 2019లో 10.2 శాతానికి పడిపోయిందని వివరించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని తమ పరిశోధనలో తేలిందని వరల్‌ ్డ బ్యాంకు ప్రకటన చేసింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా ఇదే ప్రకటన చేసింది. భారతదేశం తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని ఐఎంఎఫ్‌ వర్కింగ్‌ పేపర్‌ ప్రకటించింది. ప్రభుత్వం ఉచితంగా ఆహార సరుకులను అందజేస్తుండటంతో వినియోగంలో అసమానతలు 40 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గినట్టు వివరించింది.

2011లో 26.3 శాతం..

ప్రపంచ బ్యాంకు వర్కింగ్‌ పేపర్‌ను ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హా రాయ్‌, రాయ్‌ వాన్‌ డెర్‌ వెయిడేలు సంయుక్తంగా రూపొందించారు. ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉందన్నారు. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 26.3 శాతం ఉండేదని, ఇది 2019లో 11.6 శాతానికి తగ్గిందన్నారు. అలాగే అదే కాలంలో పట్టణ ప్రాంతాల్లో పేదరికం 14.2 శాతం ఉండేదని, 2019 నాటికి 6.3 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. 2011-19లో గ్రామీణ, పట్టణ పేదరికం 14.7 శాతం, 7.9 శాతం పాయింట్లు తగ్గాయని నివేదికలో పేర్కొన్నారు.

పెరిగిన రైతుల ఆదాయం..

చిన్న కమతాలు ఉన్న రైతులు అధిక లాభాలు గడించారని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 2013, 2019 మధ్య కాలంలో ఏటా 10 శాతం చొప్పున వీరి ఆదాయం పెరిగినట్టు తెలిసింది. ఎక్కువ విస్తీర్ణంగల భూమి ఉన్నవారి ఆదాయం ఏటా 2 శాతం మాత్రమే పెరిగినట్టు వెల్లడైంది. అయితే భారతదేశంలో గత దశాబ్దంలో పేదరికం తగ్గింది కానీ.. ఇంతకుముందు అనుకున్నంత కాదు అని వ్యాఖ్యానించింది. అభివృద్ధిపై ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడం, పరిశోధన ఫలితాలను త్వరగా వ్యాప్తి చేయడం లక్ష్యంగా ప్రపంచ బ్యాంకు పాలసీ మేరకు ఈ నివేదికను తయారు చేసినట్టు ఆర్థిక వేత్తలు సుతీర్థ రాయ్‌, రాయ్‌ వాన్‌ డెర్‌ వెయిడే తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement