Friday, May 17, 2024

Market : బుల్‌ రన్‌, యుద్ధ భయంలోనూ భరోసా.. భారీగా ఎగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. గురువారం నాటి భారీ పతనం నేపథ్యంలో కనిష్టాల వద్ద ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉదయం సెన్సెక్స్‌ 55,321.72 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 56,183.70 పాయింట్ల గరిష్టానికి, 55,299.28 పాయింట్ల కనిష్టాన్ని సెన్సెక్స్‌ సూచీ తాకింది. చివరికి 1328.61 పాయింట్ల లాభంతోఒ 55,858.52 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 16,515.65 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16,748.80 పాయింట్ల గరిష్టాన్ని, 16,478.30 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 410.45 పాయింట్లు లాభపడి 16,658.40 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.28 వద్ద కొనసాగుతున్నది.

భారీ నష్టం నుంచి.. భారీ లాభాల్లోకి..
గురువారం భారీగా నష్టపోయిన మార్కెట్లు.. శుక్రవారం దాదాపు అదే స్థాయిలో లాభాలతో ప్రారంభం అయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. చివరలో కాస్త పుంజుకుని.. నష్టాలను తగ్గించాయి. దీంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఉక్రెయిన్‌, రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడి ఉండొచ్చు అని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే.. ప్రస్తుత కనిష్టాల వద్ద కొనుగోళ్లు తాత్కాలికమే అని, ఆ తరువాత నష్టాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. రష్యాపైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆంక్షలు కాస్త సానుకూలతకు కారణం అయ్యాయి.

కొనుగోళ్ల వైపు పరుగులు
దీర్ఘ కాలంలో భారత్‌ మార్కెట్లపై పాజిటివ్‌గా ఉన్న ఇన్వెస్టర్లు.. ఏమాత్రం కరెక్షన్‌ వచ్చినా.. కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లలో గురువారం అతిపెద్ద కరెక్షన్‌ను నమోదు చేసిన సూచీలకు శుక్రవారం ఆద్యంతం కొనుగోళ్ల మద్దతు లభించింది. చమురు ధరలు రికార్డు స్థాయికి చేరడం, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపుపై కఠిన వైఖరిని వాయిదా వేసే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లను పాజిటివ్‌ వైపు పరుగులు పెట్టించాయి. యుద్ధ భయాలు ఎలా ఉన్నా.. చమురు సరఫరాలో మాత్రం ఇబ్బందులు ఉండవని స్పష్టమైంది. ధరల విషయానికి వస్తే.. తాత్కాలికంగా అమెరికా ఉత్పత్తి పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

అన్ని రంగాలకు లాభాలు
రష్యాను నిలువరించేందుకు అమెరికా సహా కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం చేసే స్విఫ్ట్‌ వ్యవస్థ నుంచి ఆ దేశాన్ని నిషేధించడం వంటి కఠిన నిర్ణయాలు లేకపోవడం మార్కెట్లకు కలిసి వచ్చింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క నెస్లే తప్ప.. అన్ని షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. రంగాల వారీగా చూసుకున్నా.. లోహ, రియాల్టిd, పవర్‌, యుటిలిటీస్‌, బేసిక్‌ మెటీరియల్స్‌, ఇండస్ట్రియల్స్‌, ఇన్‌ఫ్రా షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేసుకున్నాయి. నిఫ్టీ 50లో 47 షేర్లు లాభపడగా.. 3 షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement