Tuesday, May 14, 2024

Investments | సెమికండక్టర్‌ రేస్‌లో ఇండియా.. భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

సెమికండక్టర్‌ రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషి క్రమంగా ఫలిస్తోంది. ఈ రంగంలోకి 21 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు వ చ్చాయి. ఇందులో విదేశీ చిప్‌ తయారీ సంస్థలు, దేశీయ సంస్థలు, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఉన్న దేశీయ సంస్థలు ఉన్నాయి. ఇజ్రాయిల్‌కు చెందిన టవర్‌ సెమికండక్టర్‌ లిమిటెడ్‌ కంపెనీ భారత్‌లో 9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ప్లాంట్‌ పెట్టాలని ప్రతిపాదించింది. టాటా గ్రూప్‌ 8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో చిప్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లు గుజరాత్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు ఈ కంపెనీలు ప్రకటించాయి. భౌగోళిక రాజకీయాల్లో సెమికండక్టర్‌ పరిశ్రమ కూడా కీలకంగా మారింది.

చైనా, అమెరికా, జపాన్‌ దేశీయంగా దేశీయంగా ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెెడుతున్నాయి. భారత్‌ కూడా దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ చిప్‌ తయారీ సంస్థలను ఆకర్షిస్తోంది. దేశీయంగానే సెమికండక్టర్‌ల (చిప్‌) ఉత్పత్తి పెరిగితే దిగుమతి భారం తగ్గడంతో పాటు దేశంలో పెరుగుతున్న మొబైల్‌ అసెంబ్లింగ్‌ కార్యకలాపాలకు ఊతం ఇస్తుందని భావిస్తంది. దీంతో పాటు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల తయారీని కూడా ప్రోత్సహిస్తున్నందున దేశీయంగానే చిప్‌ల తయారీ జరిగితే ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

బడా కంపెనీల పెట్టుబడులు…

భారత్‌లో చిప్‌ మేకింగ్‌ ప్రోత్సహక స్కీమ్‌ ప్రకారం ఏదైనా ఆమోదించిన ప్రాజెక్ట్‌ వ్యయంతో కేంద్రం సగం భరిస్తుంది. ప్రభుత్వం దీన్ని పీఎల్‌ఐ స్కీమ్‌ కింద చేర్చింది. చిప్‌ తయారీ సంస్థలకు ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం 10 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. ఈ రంగంలో మన దేశం ఇంకా సరైన విజయం సాధించలేదు. దేశీయ సంస్థ వేదాంత రిసోర్సెస్‌, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ మధ్య సెమికండక్టర్‌ జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదన మొదట్లోనే రద్దయ్యింది. దీని తరువాత ఈ రెండు సంస్థలు సరైన భాగస్వామి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

మొబైల్‌ తయారీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ప్రోత్సాహక స్కీమ్‌ పీఎల్‌ఐ మూలంగా యాపిల్‌ కంపెనీ భారత్‌లో బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్ల తయారీ ఎగుమతులు చేస్తోంది. ఈ సంవత్సరం గూగుల్‌ కూడా భారత్‌లో తన ఫోన్ల తయారీని ప్రారంభించాలని నిర్ణయించింది. సెమికండక్టర్‌ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహకం మూలంగా అమెరికాకు చెందిన మైక్రాన్‌ టెక్నాలజీ ఇంక్‌ గుజరాత్‌లో 2.75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో టెస్టింగ్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది.

- Advertisement -

టవర్‌ కంపెనీ ఇండియాలో పెట్టుబడుల మూలంగా ఈ కంపెనీ వృద్ధికి తోడ్పాటు ఇవ్వనుంది. అంతకు ముందు టవర్‌ను కొనుగోలు చేసేందుకు ఇంటెల్‌ కార్పోరేషన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వాస్తవంగా ఇంటెల్‌ గ్రూప్‌తో పోలిస్తే టవర్‌ అమ్మకాలు చాలా స్వల్పమే. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో అవసరమైన చిప్‌లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. తైవాన్‌ సెమికండక్టర్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ కంపెనీ కంటే టవర్‌ చిన్నదే అయినప్పటికీ దేశీయంగా విద్యుత్‌ వాహనాల తయారీకి ఇది ఊతం ఇవ్వనుంది. టవర్‌ సంస్థ నెలకు 80 వేల సిలికాన్‌ వాఫేర్స్‌ను ఉత్పత్తి చేయనుంది. టవర్‌ పెట్టుబడుల ప్రాతిపాదలను కేంద్రం ఆమోదిస్తే మన దేశంలో ఇదే మొదటి అతి పెద్ద సెమికండక్టర్‌ తయారీ సంస్థ కానుంది.

టాటా గ్రూప్‌ ఏర్పాటు చేయనున్న సెమికండక్టర్‌ ప్లాంట్‌ను తైవాన్‌కు చెందిన పవర్‌చిప్‌ సెమికండక్టర్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ కార్పోరేషన్‌ తో కలిసి ఏర్పాటు చేయనుంది. టాటా గ్రూప్‌ ఈ భాగస్వామ్యం కోసం యూనైటెడ్‌ మైక్రోఎలక్ట్రానిక్స్‌ కార్పోరేషన్‌తోనూ చర్చలు జరుపుతోంది. ఈ సంవత్సరంలోనే గుజరాత్‌లోని ధోలేరాలో సెమికండక్టర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్‌ ప్రకటించింది. ధోలేరాలోనే టవర్‌ కంపెనీ కూడా సెమికండక్టర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ ప్రాంతం సెమికండక్టర్‌ హబ్‌గా మారుతుందని కేంద్రం ప్రకటించింది.

టాటా గ్రూప్‌, టవర్‌ కంపెనీలు తయారు చేసే చిప్‌లను ప్రధానంగా కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆటో మొబైల్స్‌, డిఫెన్స్‌ సిస్టమ్స్‌, ఏయిర్‌ క్రాఫ్ట్‌ ్స వంటి వాటిలో వినియోగించనున్నారు. దీంతో పాటు టాటా గ్రూప్‌ 3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో చిప్‌ ప్యాకేజింగ్‌ ప్లాంట్‌ను తూర్పు భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. టాటా గ్రూప్‌ హై టెక్‌ బిజినెస్‌లపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగానే చిప్‌ తయారీ, చిప్‌ ప్యాకేజింగ్‌ యూనిట్లపై భారీ పెట్టుబడులు పెట్టనుంది. టాటా గ్రూప్‌ యాపిల్‌ ఐఫోన్లను ఇండియాలో తయారు చేయాలని ఒప్పందం చేసుకుంది. ఇందు కోసం బెంగళూర్‌ కేంద్రంగా పని చేస్తున్న విస్ట్రన్‌ కార్పోరేషన్‌ను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఐఫోన్ల తయారీ కోసం ఈ ప్లాంట్‌పై టాటా గ్రూప్‌ 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశీయంగా ఐఫోన్లను తయారు చేసే మొదటి సంస్థ టాటానే కానుంది.

జపాన్‌కు చెందిన రెనెసాస్‌ ఎలక్ట్రానిక్స్‌ కార్పోరేషన్‌, మురగప్ప గ్రూప్‌ సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఆర్మ్‌తో చిప్‌ ప్యాకేజింగ్‌ ఏర్పాటు చేసేందుకు జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించనున్నాయి. దేశంలో చిప్‌ తయారీ కోసం వచ్చిన అన్ని ప్రతిపాదనలను కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందాల్సి ఉంది. సెమికండక్టర్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే సంస్థలు వారి భాగస్వామ్యాలు, పెట్టుబడుల వివరాలు, ఉత్పత్తి కోసం సాంకేతిక భాగస్వాములు, ఏ తరహా సెమికండక్టర్లను తయారు చేయనున్నారు. ఉత్పత్తి సామర్ధ్యం, ఉపాధి అవకాశాలు ఇలా అనేక విషయాలను పీఎల్‌ఐ స్కీమ్‌కు అప్లయ్‌ చేసే కంపెనీలు వెల్లడించాల్సి ఉంటుంది.

ఈ ప్రాతిపాదనలన్నీ కార్యరూపం దాల్చితే భారత్‌లోనే సెమికండక్టర్ల తయారీ భారీగా ప్రారంభం కానుంది. దీని వల్ల దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీతో పాటు, విద్యుత్‌ వాహనాలు, ఇతర హైబ్రీడ్‌ వాహనాల్లోనూ వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఈ రంగంలోకి హైటెక్‌ సెమికండక్టర్‌ తయారీ కంపెనీలు కూడా రావాల్సి ఉందని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement