Monday, April 29, 2024

13 నగరాల్లో 5జి సేవలు.. వాటిలో హైదరాబాద్‌కు చోటు

టెలికం రంగంలో 5జి సేవలు అందించేందుకు దేశీయ టెలికం దిగ్గజ సంస్థలు తహతహలాడుతున్నాయి. వచ్చే నెలనుంచి దేశంలో 5జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.అయితే దేశమంతటా ఒకేసారి 5జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దశలవారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో హైదరాబాద్‌ సహా 13 ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5జి రేడియో తరంగాల విక్రయం ఇప్పటికే పూర్తయ్యింది. ఈ కొత్తతరం సాంకేతికత అందుబాటులోకి వస్తే 4జి కన్నా పదిరెట్ల వేగంతో సేవలు అందుతాయి. మొదట్లో ఆగస్టు 15నుంచి 5జి సేవలు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ ఆ అవకాశాలు కన్పించడం లేదు. దాదాపు సెప్టెంబర్‌ నెలలో అది సాధ్యం కావొచ్చు. దేశంలో 4జి సేవలు అందుబాటులోకి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో లభించడం లేదు. నిన్నగాక మొన్న లఢక్‌ ప్రాంతంలో తొలిసారిగా 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 5జి సేవలు అందుబాటులోకి వచ్చినా తొలి దశలో కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది. ఆ తరువాత దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.4జికన్నా వంద శాతం వేగంగా 5జి సేవలు అందిస్తుంది.

ఈ నగరాలకు ప్రాధాన్యం

దేశలో 5జి సేవలు అందుబాటులోకి వచ్చే నగరాల్లో అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నయ్‌, ఢిల్లిd, గాంధీనగర్‌, గురుగావ్‌, జామ్‌నగర్‌, హైదరాబాద్‌, పూనే, లక్నో ముంబై, కోల్‌కతా ఉన్నాయి. అయితే 5జి సేవలను అందించే తొలి టెలికం ఆపరేటర్‌ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. సెల్యూలార్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీలో ఐదవ తరాన్ని 5జిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రేడియో తరంగాల (స్పెక్ట్రమ్‌) కొనుగోలులో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో ఉంది. కాగా 4జికి అనుగుణంగా ఉన్న కనెక్టివిటీ సౌకర్యాలు, మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ను తట్టుకోవడం, కనెక్టెడ్‌ ఎకోసిస్టమ్‌ ఉత్పత్తుల విషయంలో 5జికి అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం (4జి) డేటా డౌన్‌లోడ్‌కు 50 మిల్లిd సెకన్ల సమయం పడుతూండగా 5జి అందుబాటులోకి వచ్చాక కేవలం 1 మిల్లిd సెకన్‌ సరిపోతుంది. ఎన్ని కనెక్షన్లు పెంచుకున్నా తట్టుకోవడమే గాక సెకన్‌కు 10 గిగాబైట్ల వేగంతో సేవలు అందుతాయి. ఆగస్టు చివరివారంలో 5జి సేవలు అందుబాటులోకి తీసుకవస్తామని ఎయిర్‌టెల్‌ ఇప్పటికే ప్రకటించింది. రిలయన్స్‌ జియోకూడా ఆగస్టు 15న తమ ప్రణాళికను ప్రకటించే అవకాశాలున్నాయి.

రిలయన్స్‌ జియో హవా

5జి రేడియో తరంగాల కొనుగోలులో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. వారం రోజులపాటు 40 రౌండ్లలో నిర్వహించిన వేలంలో రిలయన్స్‌ జియో 50 శాతంకన్నా ఎక్కువగా కొనుగోలు చేసింది. దాదాపు రూ. 88,078 కోట్ల వెచ్చించించింది. 700 మెగాహెర్జ్‌, 800 మెగాహెర్జ్‌, 1800 మెగాహెర్జ్‌, 3300 మెగాహెర్చ్‌, 26 గిగాహెర్జ్‌ బాండ్‌ సేవలు అందించేందుకు సంబంధించిన రేడియో తరంగాలను కొనుగోలు చేసింది. ఇక దేశంలో రెండో టెలికం దిగ్గజం రూ.43,084 కోట్లతో 19.8 గిగాహెర్జ్‌ రేడియో తరంగాలను కొనుగోలు చేసింది. అయితే ఈ సంస్థ 900,1900, 2100, 3300 మేగాహెర్జ్‌ విభాగాల్లోను, 26 గిగా హెర్జ్‌ బాండ్‌లోను వేలం పాడింది. వోడా ఫోన్‌ రూ.18,799 కోట్లు వెచ్చించి 6,228 మెగాహెర్జ్‌ రేడియో తరంగాలను కొనుగోలుచేసింది. అదానీ డేటా నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ రూ.212 కోట్లు వెచ్చించి 26 గిగాహెర్జ్‌ రేడియో తరంగాలను వేలంలో దక్కించుకుంది. అయితే ఇప్పుడు మనం వాడుతున్న 5జి సాంకేతికత దేశీయంగా తయారు చేసుకుంటున్నది. 2జి, 3జి, 4జి సాంకేతికతను విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నాం. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది.

- Advertisement -

టారిఫ్‌ ఎలా ఉంటుంది?

5జి టారిఫ్‌లు ఎంతమేర ఉంటాయి. బాగా పెరుగుతాయా అన్నదానిపై ఇప్పుటు ఫోన్‌ వినియోగదార్లు ఆసక్తి చూపుతున్నారు. టెలికం సంస్థల ఆలోచనల ప్రకారం యావరేజ్‌ రెవెన్యూ పెర్‌ యూనిట్‌ కాస్త పెరగొచ్చు. దాదాపు రూ.50 నుంచి 225-250 దాగా ఉండొచ్చని, ఈ పెరుగుదల 12-24 నెలల్లో ఉండొచ్చని ఒక అంచనా. అయితే, ఇదేమీ 4జి సేవలతో పోలిస్తే పెద్ద తేడా ఉండదు. 4జిలో పొందే డేటాతో పోలిస్తే 5జిలో పొందే డేటా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ డేటాకోసం వెచ్చించే మొత్తంతో పోలిస్తే 5జిలో తక్కువ ఖర్చుకే ఎక్కువ డేటా లభిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement