Wednesday, May 1, 2024

వాహన ఎగుమతుల్లో 28 శాతం క్షీణత.. ఏప్రిల్‌-జులై త్రైమాసికంలో ప్రతికూల ప్రభావం

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వాహన ఎగుమతులు భారీగా తగ్గాయి. దాదాపు 28 శాతం మేరకు క్షీణించాయి. జూన్‌30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మొత్తం 10,32,449 వాహనాలు ఎగుమతి కాగా, గతేడాది ఇదే త్రైమాసికంలో వీటి సంఖ్య 14,25,967గా ఉంది. ఆఫ్రికాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కరెన్సీ విలువలు పడిపోవటం ఎగుమతులపై ప్రభావం చూపిందని భారత వాహన తయారీదార్ల సంఘం (ఎస్‌ఐఎఎం) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో మన దేశం నుంచి 1,52,156 ప్రయాణికుల వాహనాలు ఎగుమతి అయ్యాయి.

2022లో ఇదే త్రైమాసికంలో ఎగుమతి అయిన 1,60,116 వాహనాలతో పోలిస్తే ఈసారి 5శాతం క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఇక, కార్ల ఎగుమతులు కూడా తగ్గాయి. 1,04,400గా ఉన్న కార్ల ఎగుమతులు.. ఈ ఏడాది జూన్‌ ముగిసే సమయానికి 94,793కు తగ్గాయి. యుటిలిటీ వాహన ఎగుమతులు 55,547 నుంచి 55,419కు చేరాయి. మారుతీ సుజుకీ ఎగుమతులు 68,987 నుంచి 62,857కు చేరాయి. వాహన ఎగుమతుల్లో మారుతీయే మొదటి స్థానంలో ఉంది. హుండాయ్‌ (35,100), కియా (22,511) వాహన ఎగుమతులతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇక ద్విచక్ర వాహన ఎగుమతులు సైతం 11,48,594 నుంచి 7,91,316కు పడిపోయాయి. దాదాపు 31శాతం తగ్గాయి. వాణిజ్య వాహన ఎగుమతులు 25శాతం తగ్గి 14,625కు చేరాయి. అదేసమయంలో త్రిచక్ర వాహనాల ఎగుమతులు 97,237 నుంచి 25శాతం తగ్గి 73,360కు చేరాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement