Wednesday, May 8, 2024

YSRCP – వంద‌కు పైగా నామినేటేడ్ పోస్టుల భ‌ర్తీపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు…….

అమరావతి, ఆంధ్రప్రభ: అధికార వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో మరోమారు పదవుల పండుగ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు నామినేటెడ్‌ పదవుల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని అధినేత, సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత 2021 జులై 17న 137 నామినేటెడ్‌ పదవులను ఒకేసారి భర్తీ చేసి పార్టీలో పదవుల పండుగకు తెరతీసారు. ఇప్పుడు వీరందరి పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే మళ్లిd ఇదే తరహాలో పదవులను ఒకేసారి భర్తీ చేయాలని, అదికూడా సామాజిక న్యాయం పాటిస్తూ ఎంపికలు ఉండాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బాధ్యుల నుండి ఎవరెవరు పార్టీకోసం పనిచేసి ప్రస్తుతం ఖాళీగా
ఉన్నారన్న సమాచారాన్ని ముఖ్యమంత్రి సేకరించారు. వీరిలో ఈ పదవులకు వన్నె తేగలిగిన నేతలు ఎవరున్నారన్న దానిపై జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా తాను ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో దీనిపై చర్చించేందుకు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గతంలో భర్తీ చేసిన 137 నామినే-టె-డ్‌ పదవుల్లో సగం మహిళలకు కేటాయించడంతో పాటు- సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించారు. ఈసారి భర్తీ చేసే విధానం కూడా అంతకు తీసిపోకుండా ఉండాలని సీఎం జగన్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

సామాజిక న్యాయమే ఎజెండగా
ఇది ఎన్నికల ఏడాది కావడంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ పదవుల భర్తీలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేపట్టిన నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. ఇప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో నేతల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గకుండా అంతకు మించి ఏ విధంగా ఈ నియామకాలు చేపట్టాలన్నదానిపై సీఎం సహా పలువురు సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఐతే, గతంలో ఈ నియామకాలు చేపట్టినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం అంటే 76 మందికి పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో చేయాలా.. అంతకు మించి చేయాలా అన్నదానిపై చర్చోప చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

జల్లెడ పడుతున్న పార్టీ బాధ్యులు, ఐప్యాక్‌ టీం
నామినేటెడ్‌ పదవుల భర్తీలో పార్టీ బాధ్యులు, ఐప్యాక్‌ టీం, ప్రాంతీయ సమన్వయకర్తలు అర్హులైన అభ్యర్దులకోసం జల్లెడ పడుతున్నారు. ఎక్కడ చూసినా నేతల సంఖ్య కోకొల్లలుగా ఉండటంతో ఎవరికి ఎలా న్యాయం చేయాలన్నదానిపై వారు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గం నుండి 50 మంది వరకూ అర్హుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో కొంత మందికి పార్టీ పరంగా స్థానం కల్పించడం చేయాలని భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి ఇద్దరేసి చొప్పున అధికార ప్రతినిధులను నియమించాలని, ఆమేరకు ఐప్యాక్‌ టీంకు రాజకీయాలపట్ల పూర్తి స్థాయి అవగాహన, పదిమందిలోనూ మాట్లాడగలిగే చొరవ ఉన్న నేతల జాబితాలను సిద్ధం చేయమని ఆదేశించారు. ఐప్యాక్‌ టీం కూడా ఆమేరకు జాబితాలు సిద్ధంచేసి సీఎం వద్దకు పంపింది. ఇప్పటికే నియోజకవర్గాలకు పరిశీలకులుగా పనిచేస్తున్న వారిలో దాదాపు 40 శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆగస్టు మొదటి వారంలో వారితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సమావేశమై ఎన్నికల వేళ చేయాల్సిన పనులు, విధివిధానాలపై అవగాహన కల్పించారు. దీంతో చాలా మందికి పదవులు లభించినట్లయింది. మిగిలిన వారిలో నామినేటెడ్‌ పోస్టులను సమర్థవంతంగా నిర్వహించగలిగిన వారి జాబితా తయారు చేస్తున్నారు.

సీఎం జగన్‌ వద్దకు చేరిన జాబితా
ఇదిలా ఉండగా మొత్తం 250 మందికిపైగా పేర్లతో సీఎం జగన్‌ వద్దకు జాబితా చేరినట్లు తెలుస్తోంది. ఇందులో 100 మందికిపైగా ఎంపిక చేయాల్సి ఉంది. ఈక్రమంలో పోస్టుల భర్తీ మరింత కీలకంగా మారింది. ముఖ్యమంత్రికి ఉన్న సమయాభావం వల్ల ఈ పని ఆగస్టు మొదటి వారంలో పూర్తి కావల్సి ఉన్నా అది కాలేదు. మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు సీఎం జగన్‌ తన రోజువారీ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసుకుని జాబితాకు తుది రూపు తీసుకొస్తున్నారని తెలుస్తోంది. తాను ఎంపిక చేసిన అభ్యర్ధుల స్థితిగతులు, వ్యక్తిగత వివరాలపై సీఎం జగన్‌ మరో రెండు మూడు రోజుల్లో ఇంటిలిజెన్స్‌, ఐప్యాక్‌ సహా పలు కోణాల్లో నివేదికలు తెప్పించుకోనున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అంతా సజావుగా జరిగితే ఈనెలాఖరులోగా 100కుపైగా నామినేటెడ్‌ పోస్టుల బర్తీ పూర్తయి కొత్తవారు పదవీ బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది.

గతంలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసింది ఇలా
శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 6 పోస్టులు,
విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 5 పోస్టులు
విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 5 పోస్టులు
తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 9 పోస్టులు
పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 6 పోస్టులు
కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 6 పోస్టులు
గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 6 పోస్టులు
ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 5 పోస్టులు
నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 5 పోస్టులు
చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 7 పోస్టులు
అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 5 పోస్టులు
వైఎస్సార్‌ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 6 పోస్టులు
కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 5 పోస్టులు

Advertisement

తాజా వార్తలు

Advertisement