Monday, April 29, 2024

వైసీపీకి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ‘తారక’ మంత్రం!

ఏపీలో రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య రోజుకో వివాదంపై రచ్చ జరుగుతోంది. అయితే, టీడీపీని టార్గెట్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం ఏదైనా టీడీపీ నేతలపై మాత్రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.

గడిచిన రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తల మీద వివిధ కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్ని అవినీతి ఆరోపణలకు సంబంధించినవి కాగా, మరికొన్ని వివిధ ఆందోళన సందర్భంగా నమోదయిన కేసులున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు, రవీంద్ర. నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమపై కూడా అదే కేసును నమోదు చేశారు.

వివిధ సందర్భాల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసిన ఉదంతాలున్నాయి. అందులో ఎక్కువగా అమరావతి పరిరక్షణ పేరుతో సాగించిన ఉద్యమంలో అనేక మంది జైళ్లకు వెళ్లారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో చేసిన పోస్టుల విషయంలో కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది తెలుగుదేశం కీలక నేతలు ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. కొందరిని రిమాండ్ కి కూడా తరలించారు. ఇక స్థానిక ఎన్నికల సందర్భంలోనూ కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో టీడీపీ సహా వివిధ పార్టీల నేతలు కేసుల్లో ఇరుక్కున్నారు.  ఇలా టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును తాకర మంత్రంగా ఉపయోగిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వి నియోగం చేస్తున్నారని టీడీపీ చెబుతోంది. ఏపీలో ప్రభుత్వ పెద్దలు ప్రతీకారంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆపార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రశ్నించే నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. దేవినేని ఉమ అరెస్టుతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. అసలు మైనింగ్ కు ఎస్సీ, ఎస్టీలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేవినేనిపై దాడి చేసిన వారిని వదిలేసి టిడిపి కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అట్రాసిటీ యాక్ట్ అంటే ఏమిటి?

- Advertisement -

ఎస్‌సీ, ఎస్‌టీలను “కులం” పేరుతో తిట్టడం, మాటలతో, చూపులతో వేధించినా, ఫోన్ లో దూషించినా ప్రత్యక్షంగా, పరోక్షంగా వివక్ష, సోషల్ మీడియాలో కించ పరిచినా, ద్రోహం, కుట్ర చేసినా ఈ చట్టం ద్వారా శిక్షార్హులు. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 18 ప్రకారం ముందస్తు బెయిలుకు వీలు లేదు. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ పిర్యాదు అందిన వెంటనే ఎలాంటి ప్రాధమిక దర్యాప్తు లేకుండానే FIR నమోదు చెయ్యవచ్చు. పై అధికారుల అనుమతితో నిమిత్తం లేకుండానే అరెస్ట్ చెయ్యవచ్చు. సెక్షన్ 438 CRPC క్రింద నిందితులు బెయిల్ పొందే అవకాశం ఉండదు. ఎవరైనా నేరం గురించి తెలిసినా వ్యక్తి ఫిర్యాదు చెయ్యవచ్చు. బాధితుడే ఫిర్యాదు చెయ్యాలనే నిబంధన ఏమి లేదు. సంఘటన జరిగిన పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యాలి.

ఎస్సీ, ఎస్టీ అమెండ్​మెంట్ యాక్ట్–2018 రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అసాధారణ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చని చెప్పింది. నిందితులపై మోపిన ఆరోపణలు ప్రాథమిక విచారణలో రుజువు కానప్పుడు మాత్రమే యాంటిసిపేటరీ బెయిల్‌ ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు గతంలో పేర్కొంది. అయితే, ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసును ఏపీలో రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement