Tuesday, April 23, 2024

ఆ నాలుగు చోట్ల వైసిపి స‌రికొత్త వ్యూహం…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : గీతదాటిన నలుగురు ఎమ్మెల్యే లపై వేటు వేసిన సీఎం జగన్‌ .. ఆ తరువాత ఆయా నియోజక వర్గాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనను ఎప్పటికప్పుడు తెలుసుకుంటు న్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ విశ్లేషకుల అంచనాలకు కూడా అందకుండా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకునేలా ఆయన అడుగులు వేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు. అందులో భాగంగా నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ద్వితీయ స్థాయి నాయకులకు పార్టీలో మరింత ప్రాధాన్య తను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మండల స్థాయి నాయకులకు పెద్ద ఎత్తున పార్టీ పదవులను కట్టబెట్టబోతున్నా రు. అలాగే జిల్లా , రాష్ట్రస్థాయిలో ఖాళీగా ఉన్న మరికొన్ని డైరెక్టర్లు, చైర్మన్‌ పదవులను కూడా ఆ నాలుగు నియోజకవర్గాల పరిధిలోని బలమైన నాయకులకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో కూడా గతంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి కేటాయించిన రాష్ట్ర సేవాదళ్‌ అధ్యక్ష పదవిని కూడా నియోజకవర్గ పరిధిలో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వబోతున్నారు. వీటితో పాటు సిటీ అధ్యక్ష పదివిని కూడా భర్తీ చేయబోతున్నారు. ఇలా కీలకమైన పదవులను సెకండ్‌ క్యాడర్‌ నాయకులకు కేటాయించి నాలుగు నియోజకవర్గాల పరిధిలోని క్యాడర్‌కు కొత్త జోష్‌ను నింపేలా సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగానే జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకట్రెండు రోజుల్లో ఉదయగిరి ఇన్‌చార్జితో పాటు పదవుల పందేరానికి సంబంధించిన జాబితాను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు.

కాగా, వైసీపీ బహిష్కరణ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మొదలైంది. పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన నలుగురు ఎమ్మెల్యేలు తమపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ వైసీపీపై ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినట్లు అవుతుంది. సస్పెండ్‌ అయిన సందర్భంలోనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి , ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖ ర్‌రెడ్డిలు వైసీపీ అధిష్టాన నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆదివారం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి , తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి తమ గళం విప్పారు. ఓటుకు నోటు వ్యవహారంపై తాడోపేడో తేల్చుకుంటామని సవాల్‌ విసిరారు. తమపై విమర్శలు చేస్తున్న వైసీపీ .. దమ్ముంటే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతటితో ఆగకుండా వైసీపీతో తాడోపేడో తేల్చుకుంటామంటూ కోటంరెడ్డి , మేకపాటిలతో ఆనం, ఉండవల్లిలు కూడా మాట కలపడం రాజకీయ వర్గాల్లో మరింత కాక పుట్టిస్తుంది.

నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉంటూ నేడు అదే పార్టీ అధిష్టానంపై సవాళ్లు – ప్రతిసవాళ్లు చేయడం ఇదే సంద ర్భంలో పార్టీ పెద్దలు కూడా బహిష్కరణ ఎమ్మెల్యేలపై తలోమాట మాట్లాడడం చూస్తుంటే ఈ వివాదం మరింత ముదురు పాకానపడేలా కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం బహిష్కరణ ఎమ్మెల్యేల విమర్శలను గమనిస్తూనే మరోవైపు వారు ప్రాతనిధ్యం వసిస్తున్న నియోజకవ ర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే వెంకటగిరి , నెల్లూరు రూరల్‌ , తాడికొ ండ నియోజకర్గాలకు ఇన్‌చార్జిలను నియమించిన అధిష్టానం ఒకట్రెండు రోజుల్లో ఉదయగిరికి కూడా బలమైన నేతకు బాధ్యతలను అప్పగించబోతుంది. అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో కొత్త జోష్‌ నింపేందుకు పార్టీ పరంగా మరికొన్ని పదవులను భర్తీ చేయబోతున్నారు. ఆ దిశగా జాబితా కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

ఓటుకు నోటుపై సవాళ్లు .. ప్రతిసవాళ్లు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న నెపంతో వెంకటగిరి , ఉదయగిరి, నెల్లూరు రూరల్‌, తాడికొండ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి , మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి , ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో తెలుగుదేశం నుంచి ఒక్కో ఎమ్మెల్యే 10 నుంచి 20 కోట్లు ముడుపులు తీసుకుని పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని గత మూడు రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ నలుగురు ఎమ్మెల్యేలు మొదట మౌనంగా ఉన్నప్పటికీ శని , ఆదివారాల్లో ఒకరు తరువాత ఒకరు మీడియా ముందుకు వచ్చి తమ గళం విప్పారు. దమ్ముంటే తాము డబ్బులు తీసుకుని ఓటు వేశామని రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. కాణిపాకంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమేనని, అందుకు వైసీపీ సిద్ధమేనా అని శ్రీదేవి సవాల్‌ చేస్తూ ఇదే సందర్భంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

తాను ఇంతకాలం అవినీతి పార్టీలో ఉన్నానని, ఇప్పుడే జ్ఞానోదయం కలిగిందని , ఇక నుంచి అమరావతి రైతులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తన కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలకు భద్రత కరువైందని, దిశ చట్టాలు ఏమి చేస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. మరోవైపు ఆనం రామనారాయణ కూడా సజ్జలను ఉద్దేశించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మేకపాటి , కోటంరెడ్డిలు కూడా వైసీపీ విమర్శలపై ఎదురుదాడి చేయడంతో పాటు రానున్న రోజుల్లో తామేంటో చూపిస్తామంటూ సవాల్‌ విసరడాన్ని బట్టి చూస్తుంటే ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement